పంచాయతీ నిధుల దారి మళ్లింపుపై సర్పంచుల ఆగ్రహం

పంచాయతీ నిధుల దారి మళ్లింపుపై సర్పంచుల ఆగ్రహం
  • అప్పులు చేసి పనులు చేయించినా బిల్లులు రావడంలేదని ఆవేదన
  • ఆసిఫాబాద్‌‌ జిల్లాలో బీఆర్‌‌ఎస్‌‌కు 18 మంది సర్పంచుల రాజీనామా
  • పలు జిల్లాల్లో డీపీవో ఆఫీస్‌‌ల ఎదుట నిరసనలు
  • ప్రభుత్వ తీరు మారకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరిక

హైదరాబాద్‌‌/ఆసిఫాబాద్​/మహబూబాబాద్​ అర్బన్​, వెలుగు: రాష్ట్ర సర్కార్​పై సర్పంచులు తిరుగుబాటుకు దిగారు. అప్పులు చేసి మరీ గ్రామాల్లో అభివృద్ధి పనులు చేయిస్తే బిల్లులు చెల్లించడం లేదని మండిపడుతున్నారు. కేంద్ర 15వ ఆర్థిక సంఘం జమ చేసిన నిధులను కూడా రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం ఆసిఫాబాద్‌‌ జిల్లాలో బీఆర్​ఎస్​కు చెందిన 18 మంది సర్పంచులు పార్టీకి రాజీనామా చేశారు. రాష్ట్రంలో సర్పంచులకు కనీస గౌరవం లేకుండా పోయిందని వాళ్లు వాపోయారు. 

స్థానిక ఎమ్మెల్యే, జెడ్పీ చైర్​పర్సన్​ దృష్టికి సమస్యలను తీసుకెళ్లినా స్పందించడం లేదని అన్నారు. అనేక జిల్లాల్లో సర్పంచులు డీపీవో ఆఫీసులను ముట్టడించి ఆందోళనలకు దిగారు. రాష్ట్ర ప్రభుత్వ తీరు సరికాదని అన్నారు. పల్లె ప్రగతిలో భాగంగా ఒక్కో సర్పంచ్‌‌ రూ.15 లక్షల వరకు అప్పులు చేసి పనులు చేయిస్తే.. ఆ బిల్లులు ఇవ్వకపోగా వచ్చిన నిధులను కూడా దారి మళ్లించడం ఏమిటని ప్రశ్నించారు. కొందరు సర్పంచులకు వేరే దారిలేక గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లి భిక్షాటన చేస్తున్నారని, రాష్ట్ర ప్రభుత్వం ఇలాగే వ్యవహరిస్తే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. వెంటనే నిధులు విడుదల చేయాలని డిమాండ్​ చేశారు. 

రెండేండ్లుగా గ్రామ పంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయడం లేదని సర్పంచులు అంటున్నారు. పల్లె ప్రగతిలో భాగంగా ప్రకృతి వనాలు, నర్సరీలు, శ్మశాన వాటికలు సహా అనేక పనులను సర్పంచులు చేయించారు. చేతిలో ఉన్న డబ్బుతోపాటు అప్పులు చేసి వాటి కోసం  ఖర్చు చేశారు. నెలలకు నెలలు గడిచిపోతున్నా ఆ బిల్లులను మాత్రం రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం లేదు. గ్రామ పంచాయతీల మెయింటెనెన్స్‌‌ కోసం ఇవ్వాల్సిన నిధులను కూడా తొమ్మిది నెలలుగా పెండింగ్‌‌లో పెట్టిందని సర్పంచులు చెప్తున్నారు. 

తాము వడ్డీలకు అప్పులు తెచ్చి, భార్య మెడలో పుస్తెలు తాకట్టు పెట్టి గ్రామాల్లో పనులు చేయిస్తే ప్రభుత్వం ఇలా వ్యవహరించడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సర్కారు తీరుతో తీవ్ర మనోవేదనకు గురై కొందరు సర్పంచులు ఆత్మహత్య చేసుకున్నారని వారు గుర్తుచేస్తున్నారు. తెచ్చిన అప్పులకు వడ్డీలు కట్టలేక, ట్రాక్టర్‌‌ ఈఎంఐలు, సిబ్బంది వేతనాలు ఇవ్వలేక ఇబ్బందులు పడుతున్నామని అన్నారు. 

డిజిటల్​ కీతో దారి మళ్లింపు

కేంద్ర ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం ద్వారా విడుదల చేసే నిధులను రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించి ఇతర పనులకు ఖర్చు చేస్తోందని కొన్నాళ్లు ఆరోపణలు ఉన్నాయి. దీనికి చెక్‌‌ పెట్టడానికే కేంద్రం పంచాయతీలకు ప్రత్యేక బ్యాంకు ఖాతాలు తీసి వాటిలో నిధులు జమ చేస్తున్నది. అయితే.. డిజిటల్‌‌ కీతో ఆ మొత్తం నిధులు దారి మళ్లించి పంచాయతీల ఖాతాలన్నీ ఖాళీ చేశారని సర్పంచులు అంటున్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం రూ.700 కోట్లకు పైగా పంచాయతీల ఖాతాల్లో జమ చేస్తే పైసా లేకుండా ఊడ్చేశారని చెప్తున్నారు.

గ్రామ పంచాయతీల కరెంట్‌‌ బిల్లులు, ట్రాక్టర్‌‌ల ఈఎంఐలు, సిబ్బంది వేతనాల కోసం స్టేట్‌‌ ఫైనాన్స్‌‌ కమిషన్‌‌ నుంచి నిధులు ఇచ్చామని చెప్పిన సర్కారు..  అకౌంట్లు ఫ్రీజ్‌‌ చేసి ఆ బిల్లులు నిలిపి వేసిందని తెలిపారు. ఇప్పుడు కేంద్రం నిధులు ఇవ్వడంతో ట్రాక్టర్ల ఈఎంఐలు, కరెంట్‌‌ బిల్లుల పేరుతో ఆ నిధులను దారి మళ్లించారని సర్పంచులు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగానే ఎన్నికైందని, అదే రాజ్యాంగానికి లోబడి తమను ప్రజలు ఎన్నుకుంటేనే పంచాయతీల పాలన పగ్గాలు చేపట్టామని గుర్తు చేస్తున్నారు. సర్పంచులకు ఉన్న చెక్‌‌ పవర్‌‌ను కాలరాసే హక్కు ప్రభుత్వానికి ఎక్కడిదని మండిపడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్ష విధానాలపై రానున్న రోజుల్లో పోరాటం మరింత ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు. 

బీఆర్‌‌ఎస్‌‌కు 18 మంది సర్పంచులు గుడ్‌‌బై

ఆసిఫాబాద్‌‌ జిల్లా వాంకిడి మండలంలోని 18 మంది సర్పంచులు బీఆర్‌‌ఎస్‌‌కు గుడ్‌‌బై చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు అందక గ్రామాల్లో సరిగా పాలన చేయలేకపోతున్నామని వారు వాపోయారు. పంచాయతీల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తున్న నిధులను తమకు తెలియకుండానే ఎలా దారి మళ్లిస్తారని ప్రశ్నించారు. మంగళవారం వాంకిడిలోని పాత ఎంపీడీవో ఆఫీసులో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆదివాసీ సర్పంచులందరూ మూకుమ్మడిగా బీఆర్‌‌ఎస్‌‌ పార్టీకి రాజీనామా చేశారు. వారిలో కోట్నాక్  కిష్టు (పాటగుడ), సిడం అన్నీగా (చౌపన్ గూడ), కొర్కెట దేవురావ్ (సవాగి), కొర్వేత జంగు (చిచ్చుపల్లి), సెడ్మకి దౌలత్ (గోయగాం), జుగ్నక మనోహర్ (వెల్లి),పెందుర్ పవన్ (ఖమాన), అడ జయరాం (నవేధరి), మడావి లింగుబాయి (దొడ్డిగూడ) , సెడ్మకి గంగారాం (ఖిరిడి), మడావి బాలు (నవేగామ్), మడావి రేణుక (నవేగూడ), కోట్నాక్ సుమిత్ర (దాభ), కినక గంగుబాయి (సోనాపూర్), పెందుర్ సుగంధ బాయి (ఖనర్ గాం), రాయిసిడం మంగళ (కోమటిగూడ), ముచ్చనేని పోచక్క (జంబుల్ ధర)  తదితరులు ఉన్నారు. తమ రాజీనామా లేఖలను సిర్పూర్‌‌ ఎమ్మెల్యే, ఆసిఫాబాద్‌‌ జిల్లా బీఆర్‌‌ఎస్‌‌ అధ్యక్షుడు కోనేరు కోనప్పకు అందజేశారు.

 ఆదివాసీ సర్పంచ్‌‌ల అధ్యక్షుడు సిడం అన్నీగా మాట్లాడుతూ..  తెలంగాణలో  సర్పంచులకు కనీస గౌరవం లేకుండా పోయిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వకపోవడంతో ప్రజల్లోకి వెళ్లలేకపోతున్నామని, అభివృద్ధి పనులు చేపట్టలేకపోతున్నామని తెలిపారు. ఆదివాసీ గ్రామాల అభివృద్ధిని ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. 

అత్యంత వెనుకబడిన కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని గిరిజన గ్రామాల్లో నేటికీ రోడ్లు లేక, హాస్పిటళ్లకు వెళ్లే దారిక లేక గర్భిణులు చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యలను ఎమ్మెల్యే ఆత్రం సక్కు, జడ్పీ చైర్‌‌ పర్సన్‌‌ కోవ లక్ష్మీకి పలుమార్లు విన్నవించినా ఫలితం లేదని, అందుకే తామంతా మూకుమ్మడిగా రాజీనామా చేశామని చెప్పారు. 

ఏ నెలలోనూ సక్కగ రాలే

రాష్ట్రంలో 12,751 గ్రామ పంచాయతీలు ఉండగా, వాటి నిర్వహణ కోసం ప్రతి నెలా స్టేట్​ ఫైనాన్స్​ కమిషన్​ ఫండ్స్​ కింద సుమారు రూ.250 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తుంటుంది.  కానీ ఈ ఆర్థిక సంవత్సరంలో ఏ నెలలోనూ సక్రమంగా నిధులు రిలీజ్​ చేయలేదు. గడిచిన 9 నెలల్లో కేవలం 4 నెలలకు సంబంధించిన ఫండ్స్​ విడుదల చేసిన రాష్ట్ర సర్కార్​.. ఐదు నెలలకు సంబంధించిన రూ.1,250 కోట్లను పెండింగ్​లో  పెట్టింది. దీంతో కార్మికులకు జీతాలు ఇవ్వలేక, కరెంట్​బిల్లులు, కొన్న ట్రాక్టర్లకు ఈఎంఐలు కట్టలేక సర్పంచులు ఆగమవుతున్నారు.

 కేంద్ర ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం ద్వారా కూడా ప్రతి నెలా తన వాటా కింద నిధులు విడుదల చేస్తుంటుంది. కానీ ఈ నిధులను రాష్ట్ర సర్కారు పక్కదారి పట్టిస్తుందన్న ఆరోపణలతో ఈ ఆర్థిక సంవత్సరం నుంచి పంచాయతీలన్నింటికీ కేంద్రం ప్రత్యేక అకౌంట్లు తీయించింది. ఈ అకౌంట్లలో పడ్డ సెంట్రల్​ ఫండ్స్​ను సర్పంచులకు తెలియకుండా ఆఫీసర్ల సాయంతో రాష్ట్ర ప్రభుత్వం  దారిమళ్లించిందని సర్పంచులు మండిపడుతున్నారు.

సర్పంచుల నిరసన

కేంద్రం నుంచి వచ్చిన15 ఫైనాన్స్ నిధులను సర్పంచుల ప్రమేయం లేకుండా అధికారులు డ్రా చేయడంపై మహబూబాబాద్​ జిల్లా సర్పంచులు ఆందోళనకు దిగారు. ఇదే అంశంపై మంగళవారం జిల్లా​ కలెక్టర్ శశాంక, జిల్లా పంచాయతీ అధికారులకు  జిల్లా సర్పంచుల ఫోరమ్ ఆధ్వర్యంలో  వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచులు మాట్లాడుతూ.. తమ అనుమతి లేకుండా, నోట్ ఫైల్ లేకుండా, ఎటువంటి చెక్కులు గాని, డిజిటల్ కీ ద్వారా డబ్బులు డ్రా చేసే అధికారం అధికారులకు లేదని అన్నారు. 

ఇది సర్పంచుల హక్కులను కాలరాయడమేనని, పంచాయతీరాజ్ చట్టాలను రాష్ట్ర ప్రభుత్వం ఉల్లంఘించడమేనని మండిపడ్డారు. కలెక్టర్ స్పందించి.. గ్రామ పంచాయతీలకు డిజిటల్ కీలను వెంటనే అందజేయాలని డీపీవోను ఆదేశించారు. ఆందోళనలో సర్పంచులు యాదగిరి రెడ్డి, బోడ లక్ష్మణ్ నాయక్, కొమ్మినేని రవీందర్, పంజాల సాయిలు, లీడర్​ రమేష్, పరకాల వెంకన్న, రెడ్యా, బాలు, సింధు భాస్కర్, బొబ్బ వెంకట రెడ్డి, బాలాజీ, శ్యామ్  తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా, కామారెడ్డి జిల్లా లింగంపేట మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన సర్పంచులు ఎంపీడీవో ఆఫీసు ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. కరీంనగర్​ జిల్లా గంగాధర మండలంలోని సర్పంచులు ఎంపీడీవో ఆఫీసు ఎదుట ఆందోళనకు దిగారు. 

రాష్ట్ర ప్రభుత్వం తీరు దుర్మార్గం: ఎమ్మెల్సీ జీవన్‌‌ రెడ్డి

డిజిటల్‌‌ కీలను తమ వద్ద పెట్టుకొని నిధులు దారి మళ్లించిన అధికారులను ప్రాసిక్యూట్‌‌ చేయాలని ఎమ్మెల్సీ టి.జీవన్‌‌ రెడ్డి డిమాండ్‌‌ చేశారు. మంగళవారం మీడియాతో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తీరును తప్పుబట్టారు. నిధులు మళ్లించిన అధికారులపై క్రిమినల్‌‌ కేసులు పెట్టాలని హైకోర్టును ఆశ్రయిస్తామన్నారు. 

బిల్లులు రాక సర్పంచులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారని, వాళ్ల పరిస్థితి దయనీయంగా ఉందన్నారు. తాము ఇచ్చే నిధులకు రాష్ట్ర ప్రభుత్వం యుటిలైజేషన్‌‌ సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని, ఆ నిధులు దారి మళ్లిస్తున్నదని కేంద్రం అనేక సందర్భాల్లో చెప్పిందని పేర్కొన్నారు. సర్పంచ్‌‌, ఉప సర్పంచ్‌‌ చెక్‌‌ పవర్‌‌తోనే నిధులు ఖర్చు చేయాల్సి ఉండగా దాన్ని బ్రేక్‌‌ చేసేలా డిజిటల్‌‌ కీని తెచ్చారని మండిపడ్డారు.