జయలలిత మృతిపై అర్ముగస్వామి కమిటీ ఆరోపణలను ఖండించిన శశికళ

జయలలిత మృతిపై అర్ముగస్వామి కమిటీ ఆరోపణలను ఖండించిన శశికళ

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత మృతిపై విచారణ జరిపేందుకు ఏర్పాటైన జస్టిస్ అర్ముగస్వామి కమిషన్‌ రిపోర్టులోని ఆరోపణలను అన్నాడీఎంకే బహిష్కృత నాయకురాలు శశికళ ఖండించారు. జయలలిత వైద్యం విషయంలో తానెప్పుడూ జోక్యం చేసుకోలేదన్నారు. దీనిపై విచారణను ఎదుర్కొనేందుకు తాను సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు.

జయలలిత మరణానికి దారి తీసిన పరిస్థితులపై దర్యాప్తు జరిపిన జస్టిస్ అర్ముగస్వామి కమిషన్.. సంచలన రిపోర్టు ఇచ్చింది. జయలలిత సన్నిహితురాలు వీకే శశికళపై పలు కోణాల్లో నేరారోపణలు చేసింది. ఆరోగ్య శాఖ మాజీ మంత్రి విజయభాస్కర్, డాక్టర్ కేఎస్ శివకుమార్ (శశికళ బంధువు), నాటి హెల్త్ సెక్రటరీ జె.రాధాకృష్ణన్‌‌‌‌పైనా అభియోగాలు మోపింది. ఈ నలుగురిపై దర్యాప్తు చేపట్టాలని సిఫార్సు చేసింది. ఈ రిపోర్టుపై స్పందించిన తమిళనాడు ప్రభుత్వం.. న్యాయ సలహా తీసుకున్న తర్వాత చర్యలు ప్రారంభిస్తామని ప్రకటించింది.

475 పేజీల రిపోర్టు

అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 2016లో జయలలిత మరణించారు. అయితే ఆమె మృతిపై అనుమానాలు ఉండటంతో.. దర్యాప్తు జరిపించేందుకు 2017లో మద్రాస్ హైకోర్టు మాజీ జడ్జి జస్టిస్ అర్ముగస్వామి నేతృత్వంలో కమిషన్‌‌‌‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కమిటీ గత ఆగస్టులో తన నివేదికను సర్కారుకు సమర్పించింది. దీన్ని మంగళవారం తమిళనాడు అసెంబ్లీ ముందుకు తీసుకొచ్చారు. శశికళ, ఆమె బంధువులు కుట్ర చేసినట్లుగా కమిటీ ఆరోపించింది. నాడు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పని చేసిన డాక్టర్ రామమోహన్ రావు క్రిమినల్ చర్యలకు పాల్పడినట్లు పేర్కొంది. జయలలిత పరిస్థితిపై అపోలో ఆసుపత్రి చైర్మన్ డాక్టర్ ప్రతాప్ రెడ్డి తప్పుడు ప్రకటనలు చేశారని చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామ మోహన రావు, మరో ఇద్దరు డాక్టర్లపైనా దర్యాప్తు చేయాలని రికమండ్ చేసింది. ఎయిమ్స్‌‌‌‌ వైద్యుల కమిటీ నివేదికకు సంబంధించిన కొన్ని అంశాల్లో అర్ముగస్వామి కమిషన్ వ్యక్తం చేసిన భిన్నాభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని.. న్యాయ నిపుణుల సలహాలు తీసుకున్న తర్వాత తగిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించినట్లు డీఎంకే ప్రభుత్వం తెలిపింది.