మోదీపై అనర్హత పిటిషన్​ను తోసిపుచ్చిన ఢిల్లీ హైకోర్టు

మోదీపై అనర్హత పిటిషన్​ను తోసిపుచ్చిన ఢిల్లీ హైకోర్టు

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీని ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ ను ఢిల్లీ హైకోర్టు సోమవారం కోట్టేసింది. దేవతలు, ప్రార్థనా స్థలాల పేరుతో ప్రధాని మోదీ ఓట్లను అడిగారంటూ పిటిషనర్ ఆనంద్ ఎస్ జోంధాలే డిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ను మోదీ ఉల్లంఘించారని అందులో పేర్కొన్నారు. ఎన్నికల్లో పోటీ చేయకుండా ఆయనపై ఆరేండ్ల పాటు నిషేధం విధించాలని కోరారు. సోమవారం ఈ పిటిషన్​ను ఢిల్లీ హైకోర్టు విచారించింది. పిటిషన్ తప్పుదోవ పట్టించేలా ఉందని జస్టిస్ సచిన్ దత్తా అన్నారు. విచారణకు అర్హత లేనిదిగా తేల్చారు. అంతకు ముందే పిటిషనర్ ఈ అంశంపై ఏప్రిల్ 10న ఎలక్షన్ కమిషన్​కు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో పిటిషనర్ అభ్యర్థన ఈసీ వద్ద పరిశీలనలో ఉన్నప్పుడు తమను ఆశ్రయించడం సరికాదని కోర్టు వ్యాఖ్యానించింది.