- శాతవాహన, కేయూ మాజీ వీసీల అక్రమాలపై విచారణ పూర్తి
- ఏడాది క్రితమే ఉన్నతాధికారులకు ఎంక్వయిరీ రిపోర్టులు
- చర్యలు తీసుకోవడంలో సర్కార్ జాప్యం
కరీంనగర్, వెలుగు: బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో శాతవాహన, కాకతీయ యూనివర్సిటీల్లో జరిగిన అక్రమాలపై విజిలెన్స్ ఎంక్వైరీ పూర్తైనా ఇప్పటివరకు చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కాకతీయ యూనివర్సిటీ మాజీ వీసీ తాటికొండ రమేశ్‌పై ఏడాది క్రితం, శాతవాహన యూనివర్సిటీ మాజీ వీసీ సంకసాల మల్లేశంపై ఆరు నెలల క్రితం విచారణ నివేదికలు సమర్పించినప్పటికీ అధికారులు ఇంకా నిర్ణయం తీసుకోకపోవడం పై విద్యార్థి, అధ్యాపక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. దుర్వినియోగమైన ప్రజాధనాన్ని రికవరీ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
శాతవాహనలో రూ.35 కోట్లపై అనుమానాలు..
శాతవాహన యూనివర్సిటీలో మాజీ వీసీ సంకసాల మల్లేశం హయాంలో నిధులు, అధికార దుర్వినియోగం జరిగిందనే ఆరోపణలు ఉన్నాయి. నోటిఫికేషన్లు లేకుండానే నాన్ టీచింగ్ సిబ్బంది నియామకాలు, రిటైర్డ్ ప్రొఫెసర్లను అడ్జంక్ట్ ఫ్యాకల్టీగా నియమించడం, వాహనాల కొనుగోలు -రిపేర్లకు అధిక ఖర్చు, పీఎఫ్ డబ్బులు జమ చేయకపోవడం వంటి ఆరోపణలు వెలుగుచూశాయి.
ఆన్సర్ షీట్ల స్కానింగ్ పనులను టెండర్ లేకుండా కోసిన్ సంస్థకు అప్పగించారని కూడా ఆరోపణలు ఉన్నాయి. విజిలెన్స్ తనిఖీల్లో సుమారు రూ.35 కోట్లకు బిల్లులు లేవని గుర్తించినట్లు సమాచారం.
వివాదాల కేరాఫ్‌గా కేయూ మాజీ వీసీ..
కాకతీయ యూనివర్సిటీ మాజీ వీసీ రమేశ్ తన పదవీకాలంలో పలు వివాదాల్లో నిలిచారు. అర్హతలపై వివాదం, నియామకాలు, ప్రమోషన్లలో అక్రమాలు, ఫార్మసీ కాలేజీలకు అనుమతుల్లో అవకతవకలు, నోటిఫికేషన్ లేకుండా రిటైర్డ్ ప్రొఫెసర్ల నియామకాలు వంటి ఆరోపణలు ఎదుర్కొన్నారు.
అలాగే న్యాక్ గుర్తింపునకు ఫేక్ ప్రాజెక్టులు, సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సుల నుంచి రూ.20 కోట్ల దారి మళ్లింపు, పీహెచ్‌డీ అడ్మిషన్లలో అక్రమాల ఆరోపణలు కూడా వచ్చాయి. తన సోషియాలజీ విభాగంలో మొదటి నుంచే తనకు వ్యతిరేకంగా ఉంటున్నాడనే అక్కసుతో ప్రొఫెసర్ కుంట ఐలయ్యను ఖమ్మం కాలేజీకి ట్రాన్స్‌ఫర్ చేయడం, అనంతరం చిన్న కారణం చూపి అసోసియేట్ ప్రొఫెసర్‌గా డిమోట్ చేయడం వంటి చర్యలకు పాల్పడ్డారని ఆరోపణలున్నాయి.
అంతటితో ఆగకుండా ఇంజినీరింగ్ కాలేజీలో కాంట్రాక్ట్ లెక్చరర్‌గా పనిచేస్తున్న ఐలయ్య కొడుకును కూడా భద్రాద్రి జిల్లా కొత్తగూడేనికి ట్రాన్స్‌ఫర్ చేయడం వంటి కక్షపూరిత చర్యలు తీసుకున్నట్లు విమర్శలు ఉన్నాయి. మాజీ వీసీ రమేశ్ అక్రమాలపై 2024 మే 18న విజిలెన్స్ విచారణకు ఆదేశాలు జారీ కాగా, నివేదిక సమర్పించి ఏడాది గడిచినా చర్యలు తీసుకోకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
