దూసుకొస్తున్న శాటిలైట్ స్మార్ట్ ఫోన్స్ : పోటాపోటీగా ఆపిల్, గూగుల్, శాంసంగ్ కంపెనీలు..

దూసుకొస్తున్న  శాటిలైట్ స్మార్ట్ ఫోన్స్ : పోటాపోటీగా ఆపిల్, గూగుల్, శాంసంగ్ కంపెనీలు..

భవిష్యత్తులో స్మార్ట్‌ఫోన్ల వినియోగం మరో మెట్టు ఎక్కబోతోంది. 2030వ సంవత్సరం నాటికి మనం వాడే ప్రతి రెండు ఫోన్లలో ఒక ఫోన్ నేరుగా శాటిలైట్  ద్వారా సిగ్నల్స్ అందుకునే అవకాశం ఉందని కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ అనే సంస్థ తెలిపింది.

అంటే 2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా అమ్ముడయ్యే ఫోన్లలో దాదాపు 46 శాతం ఫోన్లు శాటిలైట్ కనెక్టివిటీతో ఉంటాయి. ఈ రేసులో ఆపిల్, శాంసంగ్, గూగుల్ వంటి పెద్ద కంపెనీలు ఈ సాంకేతికతను అందించడంలో ముందున్నాయి. ఆపిల్ ఇప్పటికే ఈ రంగంలో అగ్రస్థానంలో ఉండగా, ఆండ్రాయిడ్ ఫోన్లలో శాంసంగ్ దూసుకుపోతోంది. హువావే, గూగుల్ కూడా సొంతంగా శాటిలైట్ టెక్నాలజీని అభివృద్ధి చేస్తున్నాయి.

 ప్రస్తుతం ఈ శాటిలైట్ సేవలు కేవలం ఖరీదైన ఫోన్లలోనే కనిపిస్తున్నాయి. బడ్జెట్ ధరలో లభించే ఫోన్లలో ఈ ఫీచర్ రావడానికి మరికొంత కాలం పట్టవచ్చు. అమెజాన్ సంస్థ 'గ్లోబల్‌స్టార్‌'ను కొనుగోలు చేయడం వల్ల శాటిలైట్ నెట్‌వర్క్ సేవలు మరింత వేగంగా విస్తరించే అవకాశం ఉంది. ఇది అమెజాన్‌కు కొత్త ఆదాయ వనరుగా మారబోతోంది.

 ప్రస్తుతానికి అమెరికాలో ఈ సేవలు ఎక్కువగా అందుబాటులోకి వచ్చాయి. యూరప్, చైనా వంటి దేశాల్లోని నెట్‌వర్క్ కంపెనీలు కూడా వీటిపై దృష్టి పెడుతున్నాయి.

మొబైల్ టవర్లు లేని మారుమూల ప్రాంతాలు, అడవులు లేదా సముద్ర ప్రయాణాల్లో ఉన్నప్పుడు కూడా ఈ శాటిలైట్ కనెక్టివిటీ ద్వారా అత్యవసర సమాచారం పంపడానికి, కనెక్ట్ అవ్వడానికి వీలుంటుంది. రాబోయే రోజుల్లో చిప్‌సెట్ కంపెనీల మధ్య పోటీ పెరిగితే, సాధారణ వినియోగదారులకు కూడా ఈ సేవలు తక్కువ ధరకే అందుబాటులోకి రావచ్చు.

రీసెర్చ్ వైస్ ప్రెసిడెంట్ పీటర్ రిచర్డ్‌సన్ అభిప్రాయం ప్రకారం, కేవలం ధనిక దేశాల్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆండ్రాయిడ్ కంపెనీలు, టెలికాం ఆపరేటర్లు ఈ సేవలను అందిస్తేనే ఇది అందరికీ అందుబాటులోకి వస్తుంది.