రోజుల తరబడి తమ కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటూ.. విధులు నిర్వహిస్తుంటారు జవాన్లు. ఒక్కోసారి వారి ఫోన్ సౌకర్యం కూడా లేని మారుమూల ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుంది. అప్పుడు కనీసం పిల్లలతో కూడా మాట్లాడలేని పరిస్థితి. దీన్ని దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం సైనికులకు శాటిలైట్ కమ్యూనికేషన్(వీ శాట్) ఆధారంగా శాటిలైట్ ఫోన్ సౌకర్యం కల్పించనున్నట్లు తెలిపింది.
సమాచార వ్యవస్థలు లేని మారుమూల ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్న సమయంలో కూడా వారు… తమ కుటుంబ సభ్యులతో మాట్లాడుకునే అవకాశం ఉంది. మారుమూల ప్రాంతాల్లోని మిలిటరీ, పారామిలిటరీ సిబ్బందికి ఈ వ్యవస్థ ద్వారా రోజుకు 1GB డేటాను ఫ్రీగా అందిస్తామని.. తమ కుటుంబ సభ్యులతో మాట్లాడుకోవచ్చని టెలికాం కార్యదర్శి అన్షు ప్రకాశ్ తెలిపారు. 1,409 మారుమూల ప్రాంతాల్లో వీశాట్ వినియోగానికి డిజిటల్ కమ్యూనికేషన్ కమిషన్(DCC) శుక్రవారం ఒప్పుకుందన్నారు. ఈ వ్యవస్థ ద్వారా జవాన్లు చాలా తక్కువ ఖర్చుతో తమ కుటుంబ సభ్యులతో మాట్లాడుకోవచ్చని చెప్పారు ప్రకాశ్.
