
పెద్ద సినిమాలతో పోటీగా చిన్న సినిమాలు చేస్తూ.. మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు టాలెంటెడ్ యాక్టర్ సత్యదేవ్. ఇప్పుడిప్పుడే హీరోగా నిలదొక్కుకుంటున్న సత్యదేవ్.. లాస్ట్ ఇయర్ తిమ్మరుసుతో థియేటర్లలో సందడి చేశాడు. తాజాగా ‘‘గాడ్సే’’ అనే చిత్రంతో మరోసారి ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యాడు. డైరెక్టర్ గోపి గణేష్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా నేడు జూన్ 17 రిలీజై.. సినీ అభిమానులను ఆకట్టుకుంటోంది. అయితే ఇదే డైరెక్టర్ తో బ్లఫ్ మాస్టర్ అనే సినిమా తీసిన సత్యదేవ్.... ఇప్పుడు గాడ్ సే మూవీలో ఎలా నటించాడు.. అసలు స్టోరీ ఏంటీ అనే విషయానికొస్తే...
కథేంటి?
వైశాలి (ఐశ్వర్య లక్ష్మీ) ఓ ఏసీపీ ఆఫీసర్. డ్యూటీ ఫస్ట్ ఎవ్రీథింగ్ నెక్స్ట్ టైపు. ఓ ఆపరేషన్ లో భాగంగా తన పెళ్లి చూపులు కూడా పోస్ట్ పోన్ చేసుకుంటుంది. ఆ ఆపరేషన్ లోఒక గర్భవతి తన చేతుల్లో మరణించడంతో జాబ్ రిజైన్ చేస్తుంది. మళ్లీ డిపార్ట్మెంట్ నుంచి పిలుపు రావడంతో ఒక కిడ్నాపర్ తో మాట్లాడుతుంది.. ఆ కిడ్నాపర్ పేరు గాడ్సే(సత్యదేవ్). మంత్రులు, ఒక ఎస్పీ, కొందరు సీఏలను కిడ్నాప్ చేస్తాడు గాడ్సే. అతను ఎందుకు వాళ్ళను కిడ్నాప్ చేశాడు? వైశాలి గాడ్సేను పట్టుకుందా? చివరికి ఏం జరిగిందన్నది సస్పెన్స్.
నటీనటుల పర్ఫార్మెన్స్
సత్యదేవ్ మరోసారి తన నేచురల్ నటనతో మెప్పించాడు. అంతే కాదు ఈ మూవీలో కొన్ని పవర్ ఫుల్ డైలాగులతో ఇంటెన్స్ పర్ఫార్మెన్స్ అందించాడు. హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మీ కూడా తన పాత్రకు న్యాయం చేసింది. నాగబాబు తన పాత్రలో మెప్పించాడు. రాజకీయ నాయకులుగా తనికెళ్ల భరణి, నాగబాబు తమ పాత్రల్లో రాణించారు. ప్రియదర్శి, నోయల్ సత్యదేవ్ ఫ్రెండ్స్ పాత్రల్లో బాగా చేశారు. ఇక పృథ్వీ రాజ్ నవ్వించడానికి చాలా ట్రై చేసినట్టు తెలుస్తోంది. సురేష్ సారంగం సినిమాటోగ్రఫీ బాగుంది. సునీల్ కశ్యప్ ఇచ్చిన పాటల్లో ఒక్కటీ బాగాలేవు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం ఫర్వాలేదు. సినిమా మూడ్ కు తగ్గట్టే ఉంది. ఎడిటింగ్ ఇంకాస్త షార్ప్ గా ఉండాల్సింది. నిర్మాణ విలువలు నాసిరకంగా ఉన్నాయి. ఇలాంటి పవర్ ఫుల్ బ్యాక్ డ్రాప్ ఎంచుకున్నప్పుడు కాస్టింగ్ పక్కాగా ప్లాన్ చేసుకోవాలి. కానీ ఏదో మమ అనిపించినట్టు చేశారు. గోపీ గణేష్ రాసుకున్న డైలాగులు సిస్టమ్ ను ఎదిరించేలా ఉన్నాయి. కొన్ని డైలాగులు మాత్రం బాగా పేలాయి.
పార్ట్ పార్ట్ లుగా ఫర్వాలేదు
ప్రస్తుత రాజకీయ వ్యవస్థపై ఓ సామాన్య యువకుడు చేసే పోరాటమే ‘‘గాడ్సే’’. తనకు జరిగిన అన్యాయం మరెవరికీ జరగకూడదని సిస్టమ్ లో ఉన్న లోపాలను ఎత్తి చూపుతాడు. రాజకీయ నాయకులు ఎంత అవినీతికి పాలుపడుతున్నారనేది చూపించాడు. అయితే దీనికి మంచి కాస్టింగ్, టెక్నికల్ టీమ్ ముఖ్యం. కానీ మేకర్స్ ఉన్నంతలో అడ్జెస్ట్ అయ్యారు. ఈ సబ్జెక్ట్ సత్యదేవ్ ఇమేజ్ కు సరిపోలేదు. వేరే స్టార్ హీరో అయితే ఇంపాక్ట్ ఉండేది. దర్శకుడు ఇంటర్వ్యూల్లో పవన్ కళ్యాణ్ కోసం ఈ కథ రాసుకున్నాను అని చెప్పినట్టు అలాంటి స్టేటస్ ఉన్న హీరో చేస్తే బాగుండేది. డైరెక్టర్ గోపి అనుకున్న పాయింట్ బాగానే ఉన్నా దాన్ని సరిగా చూపించలేకపోయారు. స్క్రీన్ ప్లే గ్రిప్పింగ్గా లేదు. ఫస్టాఫ్ ఫర్వాలేదనిపించినా.. సెకండాఫ్ ల్యాగ్ ఉంది. ఒవరాల్ గా ‘‘గాడ్సే’’ పార్ట్ పార్ట్ లుగా ఫర్వాలేదనిపిస్తుంది. కానీ ఈ రోజుల్లో ఇలాంటి సినిమాను థియేటర్లలో ఆదరించడం కష్టమే. ఓటీటీలోవచ్చినప్పుడు మాత్రం ఓ లుక్కేయొచ్చు.
రివ్యూ: గాడ్సే
నటీనటులు: సత్యదేవ్, ఐశ్వర్య లక్ష్మీ, బ్రహ్మాజీ, తనికెళ్ల భరణి, నాగబాబు, నోయల్ తదితరులు
సినిమాటోగ్రఫీ: సురేష్ సారంగం
మ్యూజిక్: సునీల్ కశ్యప్
నిర్మాత: సి.కళ్యాణ్
రచన,దర్శకత్వం: గోపి గణేష్
రిలీజ్ డేట్: జూన్ 17,2022