గండికోట రిజర్వాయర్ ముంపు బాధితులను ఆదుకోండి

గండికోట రిజర్వాయర్ ముంపు బాధితులను ఆదుకోండి

ఏపీ ప్రభుత్వానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లేఖ

కడప: గండికోట రిజర్వాయర్ ముంపు బాధితులను ఆదుకోవాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లేఖ రాశారు. భారీ వర్షాలు.. వరదలతో నీట మునుగుతున్నందున వరద నీటి నుండి తాళ్ళ ప్రొద్దుటూరును తక్షణం రక్షించాలి పవన్ కళ్యాణ్ కోరారు.

జమ్మలమడుగు నియోజకవర్గంలోని గండికోట రిజర్వాయర్ ముంపు పరిధిలో ఉన్న తాళ్ళ ప్రొద్దుటూరు గ్రామస్తులను వరదనీటి నుంచి కాపాడడానికి ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు తక్షణం చర్యలు చేపట్టాలన్నారు. తమ కాలనీలోకి రిజర్వాయర్ నీరు చేరుకుంటోందని, వరద ముంపు నుండి తమను కాపాడాలని  ఎస్.సి.కాలనీ వాసులు జనసేన ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్య ను కోరగా ఆయన వెంటనే నా దృష్టికి తీసుకువచ్చారు…  కాలనీ వాసులు అందించిన వివరాలను పరిశీలించాను… జనసేన స్థానిక నాయకులను క్షేత్రస్థాయి పరిశీలనకు పంపాను. అక్కడి పరిస్థితి దయనీయంగా ఉందని వారు వివరాలు అందచేశారు. తమకు ఇంకా పరిహారం కూడా అందనందున తాము ఇక్కడే ఉండిపోయామని కాలనీవాసులు చెబుతున్నారు… వేరేచోట ఇల్లు అద్దెకు తీసుకునే ఆర్థిక స్థోమత వారికి లేదు… ఇటువంటి పరిస్థితుల్లో వారు ఎక్కడికి వెళతారు? వృద్దులు, చంటి పిల్లలు, చివరికి గర్భిణీలు సైతం వరద నీరు ఎప్పుడు ముంచేస్తుందేమోనని బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు… ఇది చాల అమానుషం… ప్రస్తుతం రిజర్వాయర్లో 15 టి.ఎం.సి.ల నీరు చేరుకుంటేనే ఎస్.సి. కాలనీలోకి వరద నీరు వచ్చింది. పూర్తి స్థాయి నీటి మట్టం ఉంటే పరిస్థితి వూహించడం కష్టంగా వుంది. అందువల్ల చివరి కుటుంబం సైతం తాళ్ళ ప్రొద్దుటూరు గ్రామం విడిచి వెళ్లే వరకు గ్రామస్తుల భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం భరోసా ఇవ్వాలి… రిజర్వాయర్ లోకి  నీటి విడుదలపై సంయమనం పాటించాలి… నిర్వాసితులను బలవంతంగా కాకుండా వారు ఇష్టపూర్వకంగా వెళ్లే విధంగా చర్యలు తీసుకోవాలి. నిర్వాసితులతో అధికారులు తక్షణం సంప్రదింపులు జరిపి వారి అభీష్టాన్ని నెరవేర్చాలి.. తాళ్ళప్రొద్దుటూరు వాసుల ప్రాణాలు రక్షించాలని పవన్ కళ్యాణ్ కోరారు.