- 175 మందికి చెందిన రూ. 5 కోట్లతో పరార్
శాయంపేట, వెలుగు : ఓ వ్యక్తి చిట్‌ఫండ్ కంపెనీ పేరుతో పలువురి నుంచి రూ. కోట్లు వసూలు చేసి ఆ తర్వాత పరార్ అయ్యాడు. ఈ ఘటన హనుమకొండ జిల్లా శాయంపేట మండలం పత్తిపాకలో వెలుగుచూసింది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం... పత్తిపాక గ్రామానిక చెందిన పెరుమాండ్ల కిశోర్‌రెడ్డి హనుమకొండలో ఉంటూ పదేండ్లుగా చిట్‌ఫండ్ కంపెనీని నడుపుతున్నాడు. పలువురు వ్యక్తులు అతడి దగ్గర చిట్టీలు వేశారు.
అధిక వడ్డీ ఇస్తానని ఆశ పెట్టడంతో చిట్టీలు ఎత్తుకున్న వ్యక్తులు ఆ డబ్బులతో పాటు తమ వద్ద ఉన్న డబ్బులను సైతం కిశోర్‌రెడ్డికి ఇచ్చి వడ్డీ తీసుకునేవారు. ఇలా మొత్తం 175 మంది దగ్గర రూ. 5 కోట్ల వరకు తీసుకున్నాడు. డబ్బులు ఇచ్చిన వ్యక్తులు కిశోర్‌రెడ్డిని కలిసి తమ డబ్బులు తిరిగివ్వాలని కోరడంతో వారిపై బెదిరింపులకు దిగాడు. ఈ విషయం మిగతా వారికి సైతం తెలియడంతో కిశోర్‌రెడ్డి అక్కడి నుంచి పరార్ అయ్యాడు.
తర్వాత రూ. 5 కోట్లకు ఐపీ పెట్టి.. ఆ మెసేజ్‌ను ఓ వ్యక్తికి ఫార్మార్డ్ చేసిన అనంతరం ఫోన్‌ను స్విచాఫ్ చేశాడు. విషయం తెలుసుకున్న బాధితులు సీఐ రంజిత్‌రావును కలిశారు. గుండారపు కిరణ్‌రెడ్డి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు కిశోర్‌రెడ్డి కోసం గాలింపు మొదలుపెట్టారు. కాగా, బాధితుల్లో చాలా మంది రోజువారి కూలీలు, కూరగాయలు అమ్మేవారు, చిన్నచిన్న ఉద్యోగులే ఉన్నారు. తాము సంపాదించిన డబ్బంతా కిశోర్‌రెడ్డికి ఇచ్చామని, తమకు న్యాయం చేయాలని బాధితులు కోరారు.
