బ్యాంక్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నారా.. ? ఎస్బీఐలో క్లర్క్ ఉద్యోగాలు పడ్డాయి.. త్వరగా అప్లై చేసుకోండి..

బ్యాంక్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నారా.. ? ఎస్బీఐలో క్లర్క్ ఉద్యోగాలు పడ్డాయి.. త్వరగా అప్లై చేసుకోండి..
  • 6,589 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

స్టేట్ బ్యాంక్ ఆఫ్​ ఇండియా(ఎస్​బీఐ) జూనియర్ అసోసియేట్(క్లర్క్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా దేశవ్యాప్తంగా  వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఉన్న ఎస్​బీఐ శాఖల్లో 6,589  పోస్టులను భర్తీ చేయనున్నది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్​లైన్ ద్వారా అప్లై చేయవచ్చు. ఆగస్టు 6 నుంచి అప్లికేషన్ ప్రాసెస్ ప్రారంభమైంది. అప్లికేషన్ల సమర్పణకు చివరి తేదీ ఆగస్టు 26. 

పోస్టుల సంఖ్య: 6,589. జూనియర్ అసోసియేట్స్(కస్టమర్ సపోర్ట్ అండ్ సేల్స్– రెగ్యులర్) 5180,  జూనియర్ అసోసియేట్స్(కస్టమర్ సపోర్ట్ అండ్ సేల్స్–-బ్యాక్​లాగ్) 1409. తెలంగాణ రాష్ట్రంలో 250(ఎస్సీ 40, ఎస్టీ 17, ఓబీసీ 67, ఈడబ్ల్యూఎస్ 25, జనరల్ 101), ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 310 (ఎస్సీ 49, ఎస్టీ 21, ఓబీసీ 83, ఈడబ్ల్యూఎస్ 31, జనరల్ 126).

ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత లేదా సమాన అర్హత కలిగి ఉండాలి.

వయోపరిమితి: కనిష్ట వయోపరిమితి 20 ఏండ్లు. గరిష్ట వయోపరిమితి 28 ఏండ్లు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్లు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 10 ఏండ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.  వితంతు, విడాకులు, చట్టబద్ధంగా వేరుపడిన మహిళలకు గరిష్ట వయోపరిమితి జనరల్, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 35 ఏండ్లు, ఓబీసీలకు 38 ఏండ్లు, ఎస్సీ, ఎస్టీలకు 40 ఏండ్ల వరకు ఉంటుంది. 

ఎస్ బీఐ ట్రెయిన్డ్ అప్రెంటీస్ అభ్యర్థులకు జనరల్/ ఈడబ్ల్యూఎస్ ఏడాది, ఓబీసీలకు నాలుగేండ్లు, ఎస్సీ, ఎస్టీ ఆరేండ్లు, పీడబ్ల్యూబీడీ(జనరల్/ ఈడబ్ల్యూఎస్) 11 ఏండ్లు, పీడబ్ల్యూబీడీ(ఓబీసీ) 14 ఏండ్లు, పీడబ్ల్యూబీడీ(ఎస్సీ/ ఎస్టీ) 16 ఏండ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. 

 ముఖ్యమైన వివరాలు 

  • అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.
  • అప్లికేషన్లు ప్రారంభం: ఆగస్టు 06.
  • లాస్ట్ డేట్: ఆగస్టు 26. 
  • అప్లికేషన్ ఫీజు: ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఎక్స్ సర్వీస్​మెన్, డీఈఎస్ఎం అభ్యర్థులకు ఫీజు లేదు. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.750.
  • ప్రిలిమినరీ: 2025, సెప్టెంబర్.
  • మెయిన్: 2025, నవంబర్. 
  • పూర్తి వివరాలకు  sbi.co.in  వెబ్​సైట్​లో సంప్రదించగలరు. 

సెలెక్షన్ ప్రాసెస్: రాత పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. రాత పరీక్ష రెండు దశల్లో ఉంటుంది. ప్రిలిమినరీ ఎగ్జామ్, మెయిన్ ఎగ్జామ్ ఉంటుంది. ఈ రెండు ఎగ్జామ్స్ కూడా ఆబ్జెక్టివ్ విధానంలో ఆన్​లైన్ ద్వారా నిర్వహిస్తారు. ఆన్​లైన్ ప్రిలిమినరీ క్వాలిఫై అయిన అభ్యర్థులను మెయిన్ ఎగ్జామ్​కు షార్ట్​లిస్ట్ చేస్తారు. మెయిన్‌‌ తర్వాత తాత్కాలిక కేటాయింపునకు ముందు లోకల్ లాంగ్వేజ్ ప్రొఫిషియెన్సీ టెస్ట్ నిర్వహిస్తారు. 

ప్రిలిమినరీ ఎగ్జామినేషన్

ఇది క్వాలిఫై ఎగ్జామ్ మాత్రమే. ఇందులో వచ్చిన మార్కులు తుది ఎంపికలో పరిగణనలోకి తీసుకోరు.  ప్రిలిమినరీ ఎగ్జామ్ ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. మొత్తం మూడు సెక్షన్లు ఉంటాయి. 100 ప్రశ్నలు ఇస్తారు. ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు. సెక్షన్–1లో ఇంగ్లిష్ లాంగ్వేజ్ 30 ప్రశ్నలు 30 మార్కులకు, సెక్షన్–2లో న్యూమరికల్ ఎబిలిటీ 35 ప్రశ్నలు 35 మార్కులకు, సెక్షన్–3లో  రీజనింగ్ ఎబిలిటీ 35 ప్రశ్నలు 35 మార్కులకు మొత్తం 100 మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది. ప్రతి సెక్షన్​కు 20 నిమిషాల సమయం ఇస్తారు. ఒక గంటలో ఎగ్జామ్ పూర్తి చేయాల్సి ఉంటుంది. నెగెటివ్ మార్కులు ఉన్నాయి. ప్రతి తప్పుడు సమాధానానికి 0.25 మార్కులు కోత విధిస్తారు. ఎలాంటి సమాధానాన్ని గుర్తించకుండా వదిలిన ప్రశ్నలకు మార్కుల కోత ఉండదు. అభ్యర్థులు మెయిన్​కు అర్హత సాధించాలంటే కనీస అర్హత మార్కులు సాధించాల్సి
ఉంటుంది. 

లోకల్ లాంగ్వేజ్ ప్రొఫిషియెన్సీ టెస్ట్  

మెయిన్స్​లో క్వాలిఫై అయిన అభ్యర్థులను ఉద్యోగానికి తాత్కాలికంగా ఎంపిక చేస్తారు. వీరిలో పదో తరగతి లేదా 12వ తరగతిలో రాష్ట్రంలో పేర్కొన్న స్థానిక భాషను అభ్యసించని వారు లోకల్ లాంగ్వేజ్ ప్రొఫిషియెన్సీ టెస్ట్(ఎల్ఎల్​పీటీ) రాయాల్సి ఉంటుంది. ఇందులో రెండు సెక్షన్లు ఉంటాయి. 50 మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది. సెక్షన్–1లో నాన్ వర్బల్ లో ఆబ్జెక్టివ్ మూడు ప్యాసేజ్ లు15 మార్కులకు, సబ్జెక్టివ్ మూడు ప్యాసేజ్ లు 15 మార్కులకు సెక్షన్–2లో వర్బల్ టెస్ట్ 20 మార్కులకు ఉంటుంది.  ప్రతి అభ్యర్థి కనీస అర్హత మార్కులు సాధించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూబీడీ, ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు 5 శాతం మార్కులు సడలింపు ఉంటుంది.

మెయిన్ ఎగ్జామినేషన్: ఈ ఎగ్జామ్ ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. ఇందులో వచ్చిన మార్కులనే ఫైనల్ మెరిట్​గా పరిగణిస్తారు. మెయిన్ ఎగ్జామినేషన్​ లో నాలుగు  సెక్షన్లు ఉంటాయి. మొత్తం 190 ప్రశ్నలు ఇస్తారు. సెక్షన్–1లో జనరల్ ఇంగ్లిష్​ 40 ప్రశ్నలు 40 మార్కులకు (35 నిమిషాల సమయం), సెక్షన్–2లో క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 50ప్రశ్నలు 50 మార్కులకు (45 నిమిషాల సమయం), సెక్షన్–3లో రీజనింగ్ ఎబిలిటీ అండ్ కంప్యూటర్​ ఆప్టిట్యుడ్ 50 ప్రశ్నలు 60 మార్కులకు (45 నిమిషాల సమయం), సెక్షన్–4లో జనరల్/ ఫైనాన్స్ అవేర్ నెస్ 50 ప్రశ్నలు 50 మార్కులకు (35 నిమిషాల సమయం) మొత్తం 190 ప్రశ్నలు 200 మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది. 

రెండు గంటల 40 నిమిషాల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది. నెగెటివ్ మార్కులు ఉన్నాయి. ప్రతి తప్పుడు సమాధానానికి 0.25 మార్కులు కోత విధిస్తారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్​ఇండియా నిర్దేశించిన మేరకు ప్రతి అభ్యర్థి కనీస అర్హత మార్కులు సాధించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూబీడీ, ఎక్స్ సర్వీస్​మెన్ అభ్యర్థులకు 5 శాతం మార్కులు సడలింపు ఉంటుంది. సెక్షన్ల వారీగా కనీస మార్కులు సాధించాల్సిన అవసరం లేదు. 

ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ 

కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనార్టీ కమ్యూనిటీ, ఎక్స్ సర్వీస్ మెన్, పర్సనాలిటీ విత్ బెంచ్ మార్క్ డిజెబిలిటీస్ అభ్యర్థులకు ఉచితంగా ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ ఇస్తుంది. ఇందుకోసం ఆన్ లైన్ అప్లికేషన్ సమర్పించేటప్పుడు ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్​ను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. వీరిలో నుంచి అభ్యర్థులను ఎంపిక చేసి ఆన్ లైన్ పద్ధతిలో ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ ఇస్తారు.