హోటల్స్, హాస్పిటల్స్, మాల్స్‌పై సుప్రీం కోర్టు షాకింగ్ తీర్పు.. కరెంట్, వాటర్ కనెక్షన్ కట్!

హోటల్స్, హాస్పిటల్స్, మాల్స్‌పై సుప్రీం కోర్టు షాకింగ్ తీర్పు.. కరెంట్, వాటర్ కనెక్షన్ కట్!

చెత్తాచెదారం, సాలిడ్ వేస్ట్స్ మేనేజ్మెంట్ కేవలం పారిశుద్ధ్య కార్మికుల బాధ్యత మాత్రమే కాదని.. సమాజంలోని ప్రతి ఒక్కరి సామూహిక బాధ్యత అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా ఘన వ్యర్థాల నిర్వహణ నిబంధనలను కఠినంగా అమలు చేయాలని ఆదేశిస్తూ అత్యున్నత ధర్మాసనం కీలక తీర్పు వెలువరించింది. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా ఉన్న షాపింగ్ మాల్స్, హోటళ్లు, హాస్పిటల్స్, పెద్ద హౌసింగ్ సొసైటీలు వంటి భారీ వ్యర్థాలను ఉత్పత్తి చేసే సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది కోర్టు.

వ్యర్థాల సపరేషన్ తప్పనిసరి:
ప్రతి వ్యక్తి తమ ఇళ్లలో లేదా కార్యాలయాల్లోనే చెత్తను తడి, పొడిగా వేరుచేయాలని సుప్రీంకోర్టు నొక్కిచెప్పింది. దానిని సురక్షితంగా నిల్వ చేసి, నిర్ణీత వ్యవస్థ ద్వారానే మున్సిపల్ సిబ్బందికి అందజేయాలని లేదా పారవేయాలని స్పష్టం చేసింది. చెత్తను ఉత్పత్తి చేయడం మాత్రమే కాకుండా, దాని నియంత్రణలో సహకరించాలనే కనీస స్పృహ సమాజంలో కొరవడటం చాలా బాధాకరమని ధర్మాసనం కామెంట్ చేసింది.

భారీ వ్యర్థాల ఉత్పత్తిదారులకు హెచ్చరిక:
రోజుకు 100 కిలోల కంటే ఎక్కువ వ్యర్థాలను ఉత్పత్తి చేసేవి, 20వేల చదరపు మీటర్ల కంటే ఎక్కువ నిర్మాణ ప్రాంతం ఉన్నవి, రోజుకు 40వేల లీటర్లకు పైగా నీటిని వినియోగించే సంస్థలను బల్క్ వేస్ట్ జనరేటర్లుగా పరిగణిస్తారు. ఈ రూల్స్ ఉల్లంఘిస్తే తీవ్ర పరిణామాలుంటాయని కోర్టు హెచ్చరించింది. రూల్స్ పాటించని సంస్థలకు తాత్కాలికంగా విద్యుత్, నీటి సరఫరాను నిలిపివేయాలని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు, జిల్లా కలెక్టర్లకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

కంప్లైయన్స్ సర్టిఫికేట్ సమర్పిస్తేనే:
రూల్స్ ఉల్లంఘించిన కారణంగా విద్యుత్, నీటి కనెక్షన్ కోల్పోయిన సంస్థలు.. వ్యర్థాల నిర్వహణ నిబంధనల ప్రకారం ఏర్పాట్లు చేసుకున్న తర్వాతే తిరిగి సేవలను పొందగలవు. ఇందుకు సంబంధించిన కంప్లైయన్స్ సర్టిఫికేట్‌ను సమర్పిస్తేనే అధికారులు విద్యుత్, నీటి సరఫరాను పునరుద్ధరిస్తారు. ఈ మొత్తం ప్రక్రియ పర్యవేక్షణ బాధ్యతను సుప్రీంకోర్టు మానిటరింగ్ కమిటీకి అప్పగించారు.

టెక్నాలజీ వాడకం:
నిబంధనల అమలును పర్యవేక్షించడానికి సాంకేతికతను విరివిగా ఉపయోగించాలని కోర్టు సూచించింది. చెత్త డంపింగ్ ప్రదేశాల జియో-ట్యాగ్ చేసిన ఫోటోలను,  నెలవారీ నివేదికలను ప్రత్యేక ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా సమర్పించాలని ఆదేశించింది. కేవలం ప్రైవేట్ సంస్థలే కాకుండా రైల్వేలు, రక్షణ శాఖ, ప్రభుత్వ రంగ సంస్థలు, ఇతర కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు కూడా ఈ వ్యర్థాల నిర్వహణ నిబంధనలను కచ్చితంగా పాటించేలా మానిటరింగ్ కమిటీ పర్యవేక్షించనుంది.

సమాజంలో చదువుకున్నవారు, చదువుకోనివారు, ఉద్యోగులు, వ్యాపారవేత్తలు అనే తేడా లేకుండా అందరిలోనూ చెత్త నియంత్రణ పట్ల బాధ్యత లోపించిందని సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. చెత్తను క్లీన్ చేసే బాధ్యతను కేవలం కార్మికుల నెత్తిన పెట్టి.. వాళ్లే క్లీన్ చేసుకుంటారులే అంటూ మిగతా ప్రజలు చూస్తూ ప్రేక్షకులుగా ఉండటం చట్టపరంగా తప్పు, ఆచరణలో అసాధ్యం.. నైతికంగా కూడా సరైన పద్ధతి కాదని తేల్చిచెప్పింది ధర్మాసనం. మున్సిపల్ ఘన వ్యర్థాల వల్ల నదుల్లో పెరుగుతున్న కాలుష్యాన్ని కూడా ఈ కమిటీ పరిశీలించి నివేదిక అందజేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.