ఓ యువకుడికి బెంగళూరులో ఒక మంచి కంపెనీలో ఉద్యోగం. నెలకు రూ.3 లక్షల జీతం. ఇంకా పెళ్లి కాలేదు. సాధారణంగా అయితే నెలకు భారీగా సంపాదిస్తున్న ఆ యువకుడికి పిల్లను ఇచ్చేందుకు క్యూ కడుతారు. అబ్బాయి అందంగా లేకపోయిన.. కాస్తా అటు ఇటూ ఉన్న కూడా నో ప్రాబ్లమ్ అంటారు. కానీ మనం ఇప్పుడు చదువుతోన్న ఈ వార్తలో మాత్రం సీన్ రివర్స్. నెలకు రూ.3 లక్షలు సంపాదిస్తున్న ఆ యువకుడికి పెళ్లి చేయడానికి ఇంట్లో వాళ్లు సంబంధాలు చూస్తుండగా పిల్లను ఇచ్చేందుకు మాత్రం ఎవరూ ముందుకు రావట్లేదు.. అతడిని పెళ్లి చేసుకునేందుకు అమ్మాయిలు ఇష్టపడట్లేదు. ఆ యువకుడి స్నేహితుడు ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించడంతో ఆ పోస్ట్ కాస్తా వైరల్‌గా మారింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఏంటో తెలుసుకుందాం..
@Ajinkya Revdikar అనే యూజర్ ఎక్స్ (ట్విట్టర్)లో చేసిన పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ పోస్ట్ ప్రకారం.. ‘‘నా స్నేహితుడికి 31 సంవత్సరాలు. చూడటానికి బానే ఉంటాడు. ఎత్తు 5.9. బెంగళూరులో స్విగ్గీ సంస్థలో జాబ్ చేస్తున్నాడు. నెలకు రూ.3 లక్షల జీతం. అరెంజ్డ్ మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నాడు. గత రెండేళ్లుగా పెళ్లి సంబంధాల కోసం ప్రయత్నిస్తున్నాడు. కానీ ఒక్క సంబంధం కూడా సెట్ అవ్వట్లేదు. మంచి ఉద్యోగం, భారీ వేతనం ఉన్నప్పటికీ అమ్మాయిలు పెళ్లి చేసుకోవడానికి ఇష్టం పడటం లేదు.
చివరకు నెలకు రూ.50 వేలు సంపాదించే అమ్మాయిలు కూడా నా ఫ్రెండ్‌ను రిజెక్ట్ చేస్తున్నారు. ఒక అబ్బాయికి పెళ్లి కావాలంటే.. అమ్మాయిలకు నచ్చాలంటే ఇంకేం కావాలి. నా దృష్టిలో అసలు అరెంజ్డ్ మ్యారేజ్ అనేది ఒక పెద్ద స్కామ్’’ అంటూ తన ఫ్రెండ్ పడుతోన్న ఇబ్బందులను ప్రస్తావిస్తూ పెద్దల కుదిర్చిన పెళ్లి గురించి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అరెంజ్డ్ మ్యారేజ్‌ల గురించి డిస్కషన్ స్టార్ట్ అయ్యింది. నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కొందరు అతడి వాదనను సమర్ధిస్తుండగా.. మరి కొందరు విభేదిస్తున్నారు.
అమ్మాయిలకు నచ్చాలంటే డబ్బు ఒక్కటే ముఖ్యం కాదని.. మంచి వ్యక్తిత్తవం అవసరమని కొందరు పేర్కొంటున్నారు. నెలకు రూ.3 లక్షలు సంపాదిస్తే సరిపోదని, పెళ్లి బంధానికి పరస్పర అవగాహన, ఆలోచనలు కలవడం అవసరమని అంటున్నారు.
అబ్బాయి ఎక్కువ సంపాదిస్తున్నంత మాత్రాన అమ్మాయిలు లేదా వారి కుటుంబాలు వెంటనే ఒప్పుకోవాలని రూలేమి లేదని.. తమకు నచ్చిన భాగస్వామిని ఎంచుకునే హక్కు వారికి ఉంటుందని కామెంట్ చేస్తున్నారు.
ప్రస్తుత సమాజంలో అమ్మాయిలు, వారి కుటుంబ సభ్యుల అంచనాలు భారీగా పెరిగిపోయాయని.. చివరకు బిలియనీర్ మస్క్, స్టార్ హీరో షారుఖ్ ఖాన్‌ను కూడా తిరస్కరించే స్టేజ్‌కు వెళ్లారని కొందరు అబ్బాయిలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేవలం మంచి ఉద్యోగం, భారీ ప్యాకేజీలు ఉన్నంత మాత్రాన ఈ రోజుల్లో పెళ్లిళ్లు అవ్వడం లేదని.. అరేంజ్డ్ మ్యారేజ్ మార్కెట్ చాలా క్లిష్టంగా మారిందని కొందరు వాపోయారు. పెద్దలు కుదిర్చే పెళ్లిళ్ల ప్రక్రియ ఈ మధ్య కాలంలో కేవలం జీతాలు, ఆస్తులు, ఉద్యోగ భద్రత చుట్టూ తిరిగే ఒక వ్యాపార లావాదేవీలా మారిపోయిందని మరికొందరు అభిప్రాయం వ్యక్తం చేశారు.
