నాలుగు వారాల్లో తెలంగాణకు కొత్త డీజీపీని సిఫారసు చేయండి : సుప్రీంకోర్టు

నాలుగు వారాల్లో తెలంగాణకు కొత్త డీజీపీని సిఫారసు చేయండి : సుప్రీంకోర్టు
  • యూపీఎస్సీకి సుప్రీంకోర్టు ఆదేశం.. రాష్ట్రాల ట్రాప్​లో పడొద్దని సూచన
  • తమకు సరిపోయే యాక్టింగ్/అడ్​హక్ డీజీపీని కోరుకుంటున్నాయని కామెంట్
  • డీజీపీ నియామకాలకు సకాలంలో ప్రతిపాదనలు ఇవ్వని రాష్ట్రాలపై
  • ధిక్కార చర్యలు తీసుకునే స్వేచ్ఛ యూపీఎస్సీకి ఇచ్చిన సీజేఐ ధర్మాసనం

న్యూఢిల్లీ, వెలుగు: రానున్న నాలుగు వారాల్లో తెలంగాణ రాష్ట్రానికి నూతన డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ)ని సిఫారసు చేయాలని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ)కి సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అర్హత కలిగిన ఐపీఎస్ అధికారుల జోన్ ఆఫ్ కన్సిడరేషన్లో, వారి పరస్పర ప్రతిభ (ఇంటర్–సే మెరిట్) ఆధారంగానే ఎంపిక జరగాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. ప్రస్తుతం పలు రాష్ట్రాల్లో ‘యాక్టింగ్ డీజీపీ’ల నియామకాలపై అసంతృతప్తి వ్యక్తం చేసింది. ఈ విషయంలో రాష్ట్రాల ట్రాప్ లో పడొద్దని యూపీఎస్సీకి సూచించింది. 

‘వారికి డీజీపీ  వద్దు. వారికి సరిపోయే యాక్టింగ్ /అడ్​హక్ డీజీపీలు కావాలి’ అని సీజేఐ వ్యాఖ్యానించారు. తెలంగాణ డీజీపీ ఎంపిక ప్రక్రియను నాలుగు వారాల్లో పూర్తి చేయాలన్న రాష్ట్ర హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ గత 29న యూపీఎస్సీ సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ ను గురువారం సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మాల్య బాగ్చిలతో కూడిన ధర్మాసనం విచారించింది. యూపీఎస్సీ తరఫున సీనియర్ అడ్వకేట్ నరేశ్ కౌశిక్, తెలంగాణ ప్రభుత్వం తరఫున సీనియర్ అడ్వకేట్ శేషాద్రి నాయుడు హాజరయ్యారు. తొలుత కౌశిక్ వాదనలు వినిపిస్తూ.. ప్రకాశ్ సింగ్ కేసులో 2006 ఆదేశాల ప్రకారం.. డీపీపీ సిఫారసు కోసం రాష్ట్ర ప్రభుత్వం పేర్లను యూపీఎస్సీకి పంపుతుందన్నారు.

 ఇదే కేసులో 2018 లో కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం.. రాష్ట్రాలు ప్రస్తుత డీజీపీ పదవీవిరమణకు మూడు నెలల ముందుగానే ప్రతిపాదనలు పంపాలని తెలిపారు. దీనిపై యూపీఎస్సీ ప్యానెల్ కొత్త బాస్ ను రాష్ట్రానికి సిఫారసు చేస్తుందన్నారు. కానీ.. రాష్ట్రాలు ప్రతిపాదనలు పంపడంలో ఆలస్యం చేస్తూ.. యాక్టింగ్ డీజీపీలను నియమిస్తుందన్నారు. అలాగే నూతన డీజీపీ ఎంపిక కోసం చేసే ప్రతిపాదనలకు నిర్దేశించిన మూడు నెలల తప్పనిసరి వ్యవధిని తెలంగాణ పాటించలేదన్నారు. ఈ వాదనలపై జోక్యం చేసుకొన్న సీజేఐ.. ఈ అదేశాలను ఉల్లంఘించిన తెలంగాణపై ఎందుకు ధిక్కార కేసు దాఖలు చేయలేదని ప్రశ్నించారు. ఇందుకోసం 15 రోజులు గడువు ఇవ్వాలని కౌశిక్ కోరగా.. భవిష్యత్ లో ఇటువంటి ఆదేశాల ఉల్లంఘన జరిగితే.. ధిక్కార చర్యలు తీసుకునే, కోర్టుకు వెళ్లే హక్కు యూపీఎస్సీకి ఉంటుందని సీజేఐ స్పష్టం చేశారు. అయితే.. వాదనల ఆరంభంలో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ యూపీఎస్సీ దాఖలు చేసిన ఈ పిటిషన్ ను అంగీకరిస్తే ఏం జరిగేదని సీజేఐ ప్రశ్నించారు. ఒకవేళ అదే జరిగిందని కాసేపు ఊహించుకుంటే తెలంగాణకు క్రియాశీల డీజీపీ ఉండరని సీజేఐ అన్నారు. ఇలాంటి పిటిషన్ ను దాఖలు చేసే ముందు ఈ పరిణామాన్ని ఎందుకు యూపీఎస్సీ మర్చిపోయిందని ప్రశ్నించారు.

యాక్టింగ్ డీజీపీల నియామకానికి ఊతం..

‘‘దయచేసి రాష్ట్రాల ట్రాప్ లో పడొద్దు. వారికి డీజీపీ వద్దు. వారికి సరిపోయే యాక్టింగ్ డీజీపీ/అడ్​హక్ డీజీపీ కావాలి’’ అని సీజేఐ కీలక వ్యాఖ్యలు చేశారు. కొత్త డీజీపీ నియామకాల్లో యూపీఎస్సీ వాదనలు పరిగణలోకి తీసుకోదగ్గవే అయినా.. నియామకాల్లో తీవ్ర జాప్యం అడ్​హక్/యాక్టింగ్ డీజీపీల ఎంపికకు రాష్ట్రాలకు పరోక్షంగా ఊతం ఇస్తున్నట్లు ఉందని అభిప్రాయపడ్డారు. అందువల్ల ఎంపానెల్మెంట్ కమిటీ మీటింగ్(ఈసీఎం) వీలైనంత త్వరగా సమావేశపరిచి... తెలంగాణలో నూతన డీజీపీ ని సిఫారసు చేయాలని యూపీఎస్సీకి సీజేఐ బెంచ్ స్పష్టం చేసింది. మధ్యలో శేషాద్రి నాయుడు జోక్యం చేసుకొని... డీజీపీ నియామకానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం 2025 ఏప్రిల్ లోనే యూపీఎస్సీకి సిఫారసులు చేసినట్లు బెంచ్ దృష్టికి తీసుకెళ్లారు. కానీ.. యూపీఎస్సీ ఈ ప్రతిపాదనపై ఎలాంటి రిప్లై ఇవ్వలేదని నివేదించారు. కోర్టు స్పందిస్తూ ప్రస్తుతం పరిశీలనలో ఉన్న అధికారుల అర్హతను యూపీఎస్సీ నిర్ణయిస్తుందని కోర్టు స్పష్టం చేసింది.

కేసు బ్యాక్​గ్రౌండ్​
రాష్ట్ర డీజీపీగా శివధర్‌రెడ్డి నియామకాన్ని సవాల్‌ చేస్తూ హైదరాబాద్‌కు చెందిన సామాజిక కార్యకర్త టి.ధన్‌గోపాల్ రావు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. సెప్టెంబర్, 2025 న సర్కార్‌ జారీ చేసిన ఉత్తర్వులు.. 2018లో సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాలను ఉల్లంఘించడమేనని పేర్కొన్నారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు ధర్మాసనం.. నాలుగు వారాల్లో డీజీపీ ప్రక్రియను పూర్తి చేయాలని యూపీఎస్సీ చైర్మన్ కు ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్యానెల్ లిస్ట్ ను పరిశీలించి, నిబంధనల ప్రకారం శాశ్వాత డీజీపీ ఎంపికను ముగించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు తీసుకున్న నిర్ణయాలపై ఫిబ్రవరి 5 న నివేదిక సమర్పించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. అయితే హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ యూపీఎస్సీ సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. యూపీఎస్సీ ఎస్ఎల్పీ పై సీజేఐ ధర్మాసనం తాజా ఆదేశాలు జారీ చేస్తూ విచారణ ముగించింది.