ఏప్రిల్ 30లోగా ఎస్సీ గురుకులాల్లో ప్రమోషన్లు పూర్తి : మంత్రి అడ్లూరి లక్ష్మణ్ 

ఏప్రిల్ 30లోగా ఎస్సీ గురుకులాల్లో ప్రమోషన్లు పూర్తి : మంత్రి అడ్లూరి లక్ష్మణ్ 
  • స్టూడెంట్స్ సౌకర్యార్థం టైమింగ్స్ మార్పు: మంత్రి అడ్లూరి లక్ష్మణ్ 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ఎస్సీ గురుకులాల్లో వచ్చే నెల 30వ తేదీలోగా పదోన్నతుల ప్రక్రియను పూర్తి చేస్తామని  మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ప్రకటించారు. శాసనమండలిలో సభ్యులు శ్రీపాల్ రెడ్డి, మల్క కొమరయ్య అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. గత నాలుగేళ్లుగా గురుకులాల్లో ప్రమోషన్లు లేక టీచర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మంత్రి తెలిపారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ అంశంపై ప్రత్యేక దృష్టి పెట్టి చర్యలు ప్రారంభించామని చెప్పారు.

ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ కారణంగా కొంత ఆలస్యమైందని, ఏప్రిల్ 30లోపు గవర్నింగ్ బాడీ సమావేశం నిర్వహించి అర్హులైన వారందరికీ పదోన్నతులు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికే మైనార్టీ గురుకులాల్లో టైమ్ టేబుల్ మార్పులు చేసిన విషయాన్ని గుర్తు చేస్తూ, ఎస్సీ గురుకులాల్లో కూడా విద్యార్థుల అవసరాలకు అనుగుణంగా టైమింగ్స్ మార్చనున్నట్లు మంత్రి స్పష్టం చేశారు. ఎస్సీ గురుకులాల్లో మెస్ బకాయిలు లేవని, మార్చి వరకు అన్ని బకాయిలను క్లియర్ చేసినట్లు మంత్రి వెల్లడించారు.