నాగ్‌పూర్ ఎయిర్ పోర్ట్ కన్సెషన్ హక్కులు జీఎంఆర్‌కే!

నాగ్‌పూర్ ఎయిర్ పోర్ట్ కన్సెషన్ హక్కులు జీఎంఆర్‌కే!

హైదరాబాద్​, వెలుగు: నాగ్‌పూర్ విమానాశ్రయ బిడ్డింగ్ కేసులో జీఎంఆర్​ గ్రూపు విజయం సాధించింది.  బిడ్డింగ్​ను నిలిపివేస్తూ మిహాన్​ (మల్టీ మోడల్​ ఇంటర్నేషనల్​ కార్గో హబ్​ అండ్​ ఎయిర్​పోర్ట్​ ఎట్​ నాగపూర్​) ఇండియా లిమిటెడ్ 2020 మార్చి 19న జారీ చేసిన లేఖను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఈ మేరకు బాంబే హైకోర్టు నాగ్‌పూర్ బెంచ్ ఇచ్చిన తీర్పును సమర్థించింది. మిహాన్​ ఇండియన్ లిమిటెడ్, మహారాష్ట్ర ప్రభుత్వం, ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా, కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్​ లీవ్​ పిటిషన్లను కొట్టివేసింది. జీఎంఆర్  రిట్ పిటిషన్‌ను అనుమతించింది. హైకోర్టు పేర్కొన్న అంశాలు చట్టానికి లోబడి ఉన్నాయని, వాటిలో తాము జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని పేర్కొంది. ఈ తీర్పు కారణంగా అధికారులు గతంలో నాగ్‌పూర్ విమానాశ్రయం కోసం జీఎంఆర్​ తో ఏర్పరచుకున్న కన్సెషన్ ఒప్పందాన్ని అమలు చేయాలని జీఎంఆర్​ తెలిపింది. 2019లో నాగ్‌పూర్ విమానాశ్రయం కోసం మిహాన్​ ఇండియా లిమిటెడ్ నిర్వహించిన టెండర్లలో జీఎంఆర్​ హయ్యెస్ట్ బిడ్డర్‌గా నిలిచింది. జీఎంఆర్​కి మార్చి 2019లో లెటర్ ఆఫ్ అవార్డ్ జారీ చేశారు.   మహారాష్ట్ర ప్రభుత్వం మార్చి 2020లో టెండర్ ప్రక్రియను రద్దు చేయాలని నిర్ణయించింది. దీనిని బాంబే హైకోర్టు  నాగ్‌పూర్ బెంచ్  2021 ఆగస్టులో కొట్టివేయగా, అదే తీర్పును ఇప్పుడు సుప్రీంకోర్ట్ సమర్థించింది.