- ఎస్సీ వెల్ఫేర్ కమిషనర్ విజయేందిర బోయి
హైదరాబాద్, వెలుగు: ఎస్సీ గురుకుల విద్యార్థులు పది, ఇంటర్ పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించేలా పని చేయటమే తమ లక్ష్యమని ఎస్సీ వెల్ఫేర్ కమిషనర్, సొసైటీ సెక్రటరీగా విజయేందిర బోయి అన్నారు. బుధవారం డీఎస్ఎస్ భవన్‌లో అధికారులతో తొలి సమీక్ష నిర్వహించారు. ప్రీ-మెట్రిక్, పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్‌ల ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. విద్యార్థుల మానసిక ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, ఒత్తిడికి లోనయ్యే విద్యార్థుల కోసం ఫోన్ మిత్ర’ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చి, కౌన్సిలర్ల ద్వారా అవసరమైన సహాయం అందించాలని చెప్పారు.
వచ్చే వేసవి సెలవుల్లో హాస్టళ్లు, పాఠశాలల మరమ్మతులు చేపట్టనున్నట్లు తెలిపారు. అట్రాసిటీ కేసుల బాధితులకు పరిహారం వేగంగా అందజేస్తామన్నారు. ఆహార నాణ్యత విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని, లోపాలు కనిపిస్తే అధికారులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం ఆమె ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ను కలిశారు. శాఖా పరమైన పురోగతిపై చర్చించారు.
