తెలంగాణలోని ప్రైవేట్ స్కూళ్లకు విద్యాశాఖ కీలక ఆదేశాలిచ్చింది. ప్రొఫెషనల్ ట్యాక్స్ చెల్లించాలని ఆదేశించింది. ట్యాక్స్ వసూలు చేసే బాధ్యత డీఈవోలకు అప్పగించింది. ట్యాక్స్ వసూలు చేయకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని విద్యాశాఖ హెచ్చరించింది. ట్యాక్స్ వసూలులో నిర్లక్ష్యంగా ఉంటే అధికారులపై చర్యలు తీసుకుంటామని తెలిపింది..
విద్యాశాఖపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా దృష్టి సారించిన సంగతి తెలిసిందే.ఇప్పటికే రాష్ట్రంలోని ప్రైవేటు, కార్పొరేట్ స్కూళ్ల ఫీజుల దందాకు చెక్ పెట్టేందుకు సర్కారు సిద్ధమైంది. ఇష్టారాజ్యంగా ఫీజులు పెంచే ఆనవాయితీకి బ్రేక్ వేస్తూ.. శాస్త్రీయంగా ఫీజులను నిర్ణయించే ప్రక్రియను స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు వేగవంతం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 11 వేల ప్రైవేటు స్కూళ్లలో ప్రస్తుతం వసూలు చేస్తున్న ఫీజులు, గత మూడేండ్ల ఆదాయ, వ్యయాల వివరాలను సేకరించాలని విద్యాశాఖ అధికారులు నిర్ణయించారు.
ప్రతి రెండేండ్లకోసారి 8 శాతం మాత్రమే ఫీజు పెంచుకునేలా ప్రభుత్వం ఇప్పటికే సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన విధివిధానాలపై కసరత్తు ముమ్మరమైంది. ఎంఈఓలు, డీఈఓల ఆధారంగా ఏ స్కూళ్లో ఎంత ఫీజు ఉంది? ఏఏ క్లాసులకు ఎంతెంత తీసుకుంటున్నారు?అనే వివరాలను సేకరిస్తోంది. ప్రైవేటు స్కూళ్లలో దేని ఆధారంగా బేస్ ఫీజులను నిర్ణయించాలనే దానిపై అధికారులు కసరత్తు చేశారు.
త్వరలో పబ్లిక్ లోకి ఫీజుల డ్రాఫ్ట్
ఫీజుల డ్రాఫ్ట్ ను పారదర్శకంగా వెబ్‌సైట్‌లో ఉంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై పేరెంట్స్, స్టూడెంట్లు, విద్యావేత్తలు, ప్రజల అభిప్రాయాలను, సూచనలు సేకరించనున్నారు. ఆ తర్వాతే దాన్ని ఫైనల్ చేయాలని సర్కారు డిసైడ్ అయింది. డీఎఫ్ఆర్సీ నిర్ణయించిన ఫీజుల వివరాలనూ ఏ స్కూల్ ఎంత వసూలు చేయబోతోందనే డేటాను వెబ్ సైట్ టో పెట్టనున్నారు.
