వచ్చే విద్యా సంవత్సరం స్కూళ్ల తనిఖీలు ముమ్మరం

వచ్చే విద్యా సంవత్సరం స్కూళ్ల తనిఖీలు ముమ్మరం
  •     బోధన మెరుగుపర్చేందుకు రాష్ట్ర సర్కార్​ చర్యలు 
  •     సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో 299 తనిఖీ బృందాల ఏర్పాటు
  •     ఇప్పటికే 4,600 పాఠశాలల్లో ఆకస్మిక తనిఖీలు 

హైదరాబాద్, వెలుగు :  సర్కారు బడుల్లో బోధనను మెరుగుపర్చేందుకు ప్రభుత్వం​ ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో రాష్ట్రవ్యాప్తంగా ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో తనిఖీలు నిర్వహించడానికి 299 బృందాలను నియమించారు. ఇప్పటివరకు సుమారు 4,600 పాఠశాలల్లో ఆకస్మిక తనిఖీలు జరిగాయి. ప్రతి బృందానికి మూడు నెలల వ్యవధిలో 100 ప్రాథమిక, ప్రాథమికోన్నత లేదా 50 ఉన్నత పాఠశాలలను తనిఖీ చేయాలని టార్గెట్ ​పెట్టారు.

అయితే, కొన్ని జిల్లాల్లో తనిఖీలు ఆశించిన స్థాయిలో సాగలేదని గుర్తించిన తర్వాత, వచ్చే విద్యా సంవత్సరం నుంచి మరింత పకడ్బందీగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. 

సంగారెడ్డి (811), సూర్యాపేట (442), ఆదిలాబాద్ (429), నాగర్ కర్నూల్ (367) జిల్లాల్లో అత్యధికంగా తనిఖీలు జరిగాయి. పెద్దపల్లి, నిర్మల్, మెదక్, వికారాబాద్ జిల్లాల్లో ఇంకా ప్రారంభం కాలేదు. ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలకు ముగ్గురు ఉపాధ్యాయులు, ఉన్నత పాఠశాలలకు తొమ్మిది మంది ఉపాధ్యాయులతో బృందాలు ఏర్పాటు చేశారు. కేటాయించిన పాఠశాలల్లో తనిఖీలు పూర్తయిన వెంటనే, ప్రతి వారం డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్లకు నివేదికలు సమర్పించాలని మార్గదర్శకాలు జారీ అయ్యాయి. 

ఉపాధ్యాయుల పనితీరు, సిలబస్ పూర్తి స్థితి, బోధనలో వెనుకబడిన తరగతుల వివరాలు నమోదవుతున్నాయి. తనిఖీల ప్రభావం ఉపాధ్యాయ వర్గంలో స్పష్టంగా కనిపిస్తోంది.  బోధనలో నిర్లక్ష్యం వహిస్తున్న టీచర్లలో ఆందోళన పెరిగింది. కొందరు నివేదికలు సకాలంలో సమర్పించడం, పాఠ్యాంశాలు పూర్తి చేయడంలో వెనుకబడుతున్నారని తేలింది. ఆకస్మిక తనిఖీలతో పాటు, పాఠశాలలను మళ్లీ పర్యవేక్షించాల్సిన బాధ్యత కూడా బృందాలకు అప్పగించారు. దీనివల్ల పాఠశాలలు పాత పద్ధతులకు మళ్లకుండా నిరంతర పర్యవేక్షణ సాగిస్తున్నారు.