స్టూడెంట్ల భద్రత, బాధ్యత స్కూళ్లదే.. ఇంటి నుంచి స్కూల్కు, తిరిగి ఇంటికి చేరే వరకు యాజమాన్యాలే చూస్కోవాలె

స్టూడెంట్ల భద్రత, బాధ్యత స్కూళ్లదే.. ఇంటి నుంచి స్కూల్కు, తిరిగి ఇంటికి చేరే వరకు యాజమాన్యాలే చూస్కోవాలె
  • స్కూళ్లలో మార్షల్స్,  సీసీటీవీలు, జీబ్రా క్రాసింగ్‌‌ ఏర్పాటు చేసుకోవాలి
  • సిటీలో 5 నెలల్లో 1,604 యాక్సిడెంట్స్ 
  • స్కూళ్ల భద్రతపై ఉన్నతస్థాయి సమీక్షలో సీపీ సజ్జనార్​

హైదరాబాద్ సిటీ, వెలుగు:  హైదరాబాద్ లో ప్రతి స్టూడెంట్​ఇంటి నుంచి స్కూల్ కు, తిరిగి స్కూల్​నుంచి ఇంటికి చేరేవరకు మొత్తం బాధ్యత, భద్రత, స్కూల్ యాజమాన్యాలదేనని సీపీ సజ్జనార్ స్పష్టం చేశారు. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ ఆధ్వర్యంలో రవీంద్రభారతిలో శుక్రవారం ఉన్నతస్థాయి సమావేశం  నిర్వహించారు.

ఈ సందర్భంగా సజ్జనార్​మాట్లాడుతూ స్కూల్స్​అంటే అకడమిక్ ర్యాంకులు సాధించడమే కాదని, సురక్షితమైన వాతావరణంలో స్టూడెంట్స్​ను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పెట్టుకోవాలన్నారు. మైనర్ డ్రైవింగ్‌‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని, రూల్స్​బ్రేక్​చేసే స్టూడెంట్స్​వివరాలను స్కూల్స్​కు పంపిస్తామన్నారు. ఈ విషయాన్ని సీరియస్​గా తీసుకుని నెగటివ్​మార్కులు కేటాయించాలన్నారు.

స్కూల్ డ్రైవర్లు డ్రంక్ అండ్ డ్రైవ్‌‌లో దొరికితే ఆ స్కూల్స్​పేరును కూడా బహిర్గతం చేస్తామని హెచ్చరించారు. ప్రతి స్కూల్​తప్పనిసరిగా ట్రాన్స్‌‌పోర్ట్ మేనేజర్‌‌ను నియమించుకోవాలన్నారు. బడి పరిసరాల్లో సైన్ బోర్డులు, జీబ్రా క్రాసింగ్‌‌ ఏర్పాటు చేయడంతో పాటు ట్రాఫిక్ మార్షల్స్ నియమించుకోవాలన్నారు.

స్కూల్స్​పరిసర ప్రాంతాల నుంచి 100 మీటర్ల లోపు ఎక్కడా పొగాకు ఉత్పత్తులను అమ్మకూడదన్నారు. స్కూల్స్​చుట్టుపక్కల వాతావరణాన్ని పర్యవేక్షించడానికి మేనేజ్​మెంట్లు సొంత నిధులతో విజిలెన్స్ సెంటర్లు, సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు.  

  • డ్రైవర్లకు మూడేండ్లకోసారి ట్రైనింగ్​

రవాణా శాఖ కమిషనర్ కె. ఇలంబ‌‌ర్తి మాట్లాడుతూ దేశంలో రోడ్డు ప్రమాదాల మరణాల రేటులో మనది తొమ్మిది , పది స్థానాల్లో ఉందని, ఏటా 7వేల మంది రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్నారని అన్నారు. బస్సు డ్రైవర్లకు ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి ఇన్‌‌స్టిట్యూట్ ఆఫ్ డ్రైవింగ్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్  ద్వారా రీఫ్రెషర్ కోర్సు తప్పనిసరి అని స్పష్టం చేశారు.

ఆటోలు, ఒమ్నీ వ్యాన్లు వంటి ప్రైవేట్ రవాణా వ్యవస్థను క్రమబద్ధీకరించడానికి రవాణా శాఖ పోర్టల్‌‌లో కొత్తగా ప్రత్యేక ట్యాబ్‌‌ను తీసుకువస్తున్నామని, యాజమాన్యాలు తమ విద్యార్థులు వచ్చే ప్రైవేట్ వాహనాలు, డ్రైవర్ల వివరాలను సేకరించి ఇందులో నమోదు చేయాలన్నారు. హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటరీ జనరల్ సి. శేఖర్ రెడ్డి మాట్లాడుతూ త్వరలోనే బైక్ పెట్రోలింగ్ వాహనాల రెండో బ్యాచ్‌‌ను ప్రారంభించబోతున్నామని వెల్లడించారు.

టీచర్లను  ఎంపిక చేసి వారికి భద్రతా అంశాలపై శిక్షణ ఇస్తామన్నారు. జీహెచ్‌‌ఎంసీ కమిషనర్ ఆర్. వి. కర్ణన్ మాట్లాడుతూ చాలా స్కూల్స్​లో ఆట స్థలాలు, పార్కింగ్ వసతులున్నా వాహనాలను రోడ్డుపైనే పార్క్ చేయిస్తున్నారన్నారు. తెలంగాణ, ఏపీ, కర్ణాటక రాష్ట్రాల యునిసెఫ్ ప్రతినిధి డా. జెలాలెం బిర్హాను తఫెస్సే, అడిషనల్ కలెక్టర్ జితేందర్ రెడ్డి,  టీజీఎస్ఆర్టీసీ ఈడీలు వెంకన్న, శ్రీధర్‌‌,  డీఈఓ యాదయ్య పాల్గొన్నారు.