
సైంటిస్ట్ సురేశ్ మర్డర్ కేసులో అదుపులో నిందితుడు
ల్యాబ్ టెక్నీషియన్ శ్రీనివాస్ పై అనుమానాలు
ఏసీపీ నేతృత్వంలోని మూడు ప్రత్యేక బృందాలతో దర్యాప్తు
హైదరాబాద్,వెలుగు: నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ సైంటిస్ట్ శ్రీధరన్ సురేశ్ కుమార్(56) హత్య కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. సురేశ్ మృత దేహానికి బుధవారం పోస్ట్ మార్టమ్ పూర్తయ్యాక కుటుంబ సభ్యులకు అప్పగించారు. హైదరాబాద్, బాలానగర్ లోని నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్‌లో పనిచేస్తున్న సురేశ్.. అమీర్‌పేటలోని అన్నపూర్ణ అపార్ట్ మెంట్లో మంగళవారం హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ కేసులో పంజాగుట్ట ఏసీపీ తిరుపతన్న నేతృత్వంలో మూడు ప్రత్యేక బృందాలు విచారణ చేపట్టాయి.
ల్యాబ్ టెక్నీషియన్ కోసం ఆరా
సురేశ్ మర్డర్ కేసులో అనుమానితుడిగా గుర్తించిన శ్రీనివాస్ అనే ల్యాబ్ టెక్నీషియన్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. సురేశ్ ఫ్లాట్‌లో ఓ గ్లిజరిన్ బాటిల్, పెయిన్ కిల్లర్కెమికల్ ను స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం సాయంత్రం 5.30 గంటలకు సురేశ్ ఫ్లాట్ కి చేరుకున్న తర్వాత గంటకు మరోవ్యక్తి ఫ్లాట్ లోకి వెళ్లినట్లు పోలీసులు సమాచారం సేకరించారు. సురేశ్ ఫోన్ కాల్‌డేటా సేకరించి, అపార్ట్ మెంట్ వాచ్ మన్ స్టేట్ మెంట్ రికార్టు చేశారు. సురేశ్ కుమార్ కి అతని భార్య ఇందిరకు ఎలాంటి కుటుంబ కలహాలు లేవని, సెలవు రోజుల్లో చెన్నైలో ఉన్న భార్యా పిల్లల దగ్గరికి వెళ్ళేవాడని విచారణలో వెల్లడైనట్లు పోలీసులు తెలిపారు. స్వలింగ సంపర్కం నేపథ్యంలో హత్య జరిగిందనడానికి ఎలాంటి ఆధారాలు లభించలేదని ఏసీపీ తిరుపతన్న స్పష్టం చేశారు. ల్యాబ్ టెక్నీషియన్ శ్రీనివాస్ ను టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.