హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని 3,253 సర్కారు బడుల్లో భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ (బీఎస్‌జీ) కార్యకలాపాలు పూర్తిస్థాయిలో విస్తరించనున్నాయి. ఆయా స్కూళ్లలో చదివే సుమారు 1.28 లక్షల మంది విద్యార్థులకు స్కౌటింగ్, గైడింగ్‌లో భాగస్వామ్యం కల్పించి వారిలో క్రమశిక్షణ, సేవాభావం, లీడర్‌షిప్ క్వాలిటీస్‌ను పెంపొందించనున్నారు. ఈ యూనిట్లను సమర్థవంతంగా నడిపించేందుకు ఏకంగా 6 వేల మంది ఉపాధ్యాయులను ‘స్కౌట్ మాస్టర్లు’, ‘గైడ్ కెప్టెన్లు’గా ఎంపిక చేసి ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. ఈ కార్యాచరణ కోసం సమగ్ర శిక్ష, పీఎం-శ్రీ పథకం కింద రూ.25.97 కోట్ల బడ్జెట్ మంజూరైంది.
శనివారం రాజ్‌భవన్‌లో గవర్నర్ శివప్రతాప్ శుక్లాతో బీఎస్‌జీ రాష్ట్ర చీఫ్ కమిషనర్, గవర్నర్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎం.దానకిశోర్, బీఎస్‌జీ రాష్ట్ర కార్యదర్శి, స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ డాక్టర్ నవీన్ నికోలస్ భేటీ అయ్యారు. అనంతరం బీఎస్‌జీ వివరాలను వెల్లడించారు. తెలంగాణ స్టేట్ అసోసియేషన్ గతేడాది కాలంలో అపూర్వమైన ప్రగతి నమోదు చేసిందని అధికారులు గవర్నర్‌కు వివరించారు. 2025–26లో సభ్యత్వ నమోదు ఏకంగా 176 శాతం పెరిగిందన్నారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 1,494 యూనిట్లలో మొత్తం సభ్యుల సంఖ్య 47,448కి చేరిందని తెలిపారు. అనంతరం బీఎస్‌జీ తెలంగాణ సరికొత్త అధికారిక వెబ్‌సైట్‌ను గవర్నర్ లాంఛనంగా ప్రారంభించారు.
