వీరికి సముద్రమే ప్రపంచం.. జీవితం

వీరికి సముద్రమే ప్రపంచం.. జీవితం

సముద్రంలనే పుడతరు. సముద్రంలనే ఆడుకుంట పెరుగుతరు. సముద్రంలనే ఈతనేర్చుకుంట బతుకుపోరాటం మొదలుపెడతరు.సముద్రపు అడుగుదాంక పోయి జీవితంల గెలుస్తరు. సముద్రమే వాళ్లకు ప్రపంచం. సముద్రమే వాళ్ల జీవితం. నేల విడిచి సాము చేసే సాహసగాళ్ల సముద్రవాసం చూసొద్దామా! చాలా మందికి సముద్రంల ఎట్ల బతుకుతరు? అనే డౌట్​ వస్తది. ‘ఈడ బతకనీకి మంచి దారులే ఉన్నయ్​’ అంటున్నరు బజావు తెగ గూడెం పెద్దలు. ‘పోనీకి దారేముంది? చుట్టుముట్టు నీళ్లేనాయె!’ అంటె.. ‘గదేం లేదు. ఆకలైతే నీళ్లలోకి, ఆడుకోవాల్నంటే నీళ్లపైన తిరిగొస్తం’ అంటున్నరు. అక్కడ పిలగాండ్లకు ఈత ఉగ్గుపాలతో నేర్పిన విద్య. ఇగ వేట అంటరా.. అది వెన్నతో పెట్టిన విద్య! బజావు తెగవాళ్లు మన దేశానికి దగ్గర్లోనే ఉంటారు.
ఇండోనేషియా, పిలిప్పైన్స్​, మలేషియా దేశాల తీరం ఎంబడి కొన్ని సంచార జాతులున్నయ్​. ఈ సంచార జాతులల్ల ‘బజావు, ఒరాంగ్​, మోకెన్​’ అనే మూడు తెగల వాళ్లున్నరు. ఈ మూడు తెగల్ల బజావు తెగ పెద్దది. ఇప్పుడీ తెగ మొత్తం జనాభా ఒక లక్ష. సముద్రంలనే చిన్న గుడిసెలు  వేసుకొని ఉంటరు. చిన్న పడవల్లో తిరుగతా బతుకు బండిని నడిపిస్తరు. 

సముద్రపు వేటగాళ్లు
బజావు తెగవాళ్లు ఎదిగేప్పటి నుంచే సముద్రంల ఈత కొడుతనే నీళ్లల మునుగుతరు. ఇట్ల పెరగడంతోనే వాళ్లకి ఊపిరి బిగబట్టడం అలవాటైతది. కాబట్టి ఎక్కువ గాలి పీల్చుకుంటరు. బజావు తెగల పెద్దోళ్లు సముద్రంలో మునిగి 13 నిమిషాల దాంక తేలకుండ ఉంటరు. సముద్రంల తేలిగ్గ 60 అడుగుల లోతుదాంక పోయి, వస్తరు. అట్ల ఉండబట్టే వాళ్లు ఆయుధాలతోని నీళ్లల మాటువేసి పెద్ద చేపల్ని పట్టుకుంటరు. అట్లనే సముద్రం అడుగుకుపోయి పగడాలు ఏరుకొస్తరు. జజావు ట్రైబ్స్​ ఎప్పుడూ చేపలు పట్టుకుంట సముద్రంలనే ఉండరు. ఆ చేపల్ని బయటివాళ్లకు అమ్మి సంపాదించుకుంటారు. కావాల్సినయి కొనుక్కుంటరు. చిన్న చిన్న అవసరాల కోసం సముద్రం ఒడ్డుకు చేరుకుంటరు. హ్యాపీగా ఉండేందుకు కూడా అప్పుడప్పుడు మైదాన ప్రాంతాల్ల తిరిగొస్తరు. కానీ, సముద్రమే వాళ్లకు కేరాఫ్​. సముద్రమే వాళ్లకు జీవనాధారం. 
అలలపైనే ఆటలు 
ఇట్ల పెద్దోళ్లు ఇంటికి కావాల్సిన ఫుడ్​ తెస్తుంటే చిన్నోళ్లు మొద్దులతో తయారు చేసిన చిన్న పడవలల్ల తిరుగుతా ఉంటరు. ఆడుకోవాల్నన్నా వాళ్లకు పడవలే దిక్కు. పిలగాళ్లందరూ తలా ఒక పడవేసుకుని పోటీలు పడి ఆడుకుంటరు. సలికాలంల సలివెడుతుంటే మనం పొద్దుగాల్నే లేచి సలిమంట ఏసుకుంటం. అయితె వీళ్లు ఇంటి ముందలే చిన్న పడవల ఎండలో పడుకుంటరు. మన ఇండ్లల దూలానికి ఊయలేసి పిలగాండ్లని జోకొడుతా నిద్రపుచ్చినట్లే వాండ్లు పడవలనే బజ్జోపెడుతరు. అలలే అటు ఇటు కదులుతు పడవని కదిలిస్తంటే పిలగాండ్లు హాయిగ నిద్రపోతరు. భలేగుంది కదా లైఫ్​ అనుకునేరు. అప్పుడప్పుడు తుఫానులు, ఆటుపోట్లొస్తయి. ఎప్పుడు సముద్రంల ఉండాలో? ఎప్పుడు బయటపడాల్నో వాళ్లకి బాగనే ఎరుక. సదువు లేదు, సైన్స్​ తెలియది అనుకోకుండ్రి. సునామీ అచ్చినప్పుడు ఆగమైందంతా నాగరిక మానవులేనని మర్చిపోవద్దు. జంతువుల లెక్కనే దీవుల్లో ఉండే ఆదివాసీ తెగలవాళ్లు గూడ సునామీని గుర్తించి సేఫ్​గ ఉన్నరు. బజావో తెగవాళ్లు అట్లనే వాతావరణంలో వచ్చే మార్పుల్ని గుర్తించే సెన్సిటివిటీ ఉన్నోళ్లే. అట్లాంటి విపత్తుల బతికి బయటపడుతరు. కానీ, గుడిసెలు మాత్రం సముద్రంల కలుస్తయి. అప్పుడు ఇంకో చోటకుపోయి మళ్లీ గుడిసెలేస్తరు. 
సముద్రంలో సావాసగాళ్లు 
సముద్ర గర్భాన్ని స్టడీ చేసే సైంటిస్టులు, ఫొటోగ్రాఫర్లు వీళ్ల సాయం కోరివస్తరట. డైవింగ్​ కిట్స్​ తొడుక్కుని వాళ్లు సముద్రంల దిగితే జబావు తెగవాళ్లు మాత్రం ముఖానికి మాస్కులు, కాళ్లకు స్కీవర్స్​, ఆక్సీజన్​ సపోర్ట్​ లేకుండనే దిగుతరు. టూరిస్టులు, ఫొటోగ్రాఫర్లు, సైంటిస్టులు ఎవల్ని ఎక్కడికి తీస్కపోవాల్నో అక్కడికి తీస్కపోతరు. సముద్రమంతా చూపించి తీసుకొస్తరు. సముద్రంల జీవుల మధ్య భయమే లేకుండ తిరగడమే కాదు. వాటితో కలిసి పిలగాండ్లు, పెద్దోళ్లు సరదాగా ఆడుకుంటరు. మార్కెట్​ ఉన్న వాటినైతే పట్టుకొచ్చి అమ్ముకుంటరు. 
సీక్రెట్​ కనిపెట్టినరు
నీళ్లలో ఒకటి రెండు నిమిషాలు మునిగితేనే ప్రాణం విలవిల్లాడుతది. బజావు తెగ వాళ్లు మాత్రం గంటల కొద్దీ ఎట్లుంటరని శానా మందికి డౌటొచ్చింది. వీళ్లకు మంత్ర విద్యలు వస్తయని అనుకునేటోళ్లట. ఈ రహస్యం ఎట్లయినా తెలుసుకోవాల్నని శానా మంది ఆలోచించిన్రు. చివరికి సైంటిస్టులు అసలు సంగతి తేల్చినరు. బజావు తెగవాళ్ల ప్లీహం (స్ల్పీవ్) సాధారణంగా అందరిలో ఉండే ప్లీహం కంటే పెద్దగా ఉన్నదంట! అందుకే నీటిలో ఎక్కువ సేపు ఉంటున్నరు. డెన్మార్క్‌‌ల ఉన్న సెంటర్ ఫర్ జియోఫిజిక్స్ (కోపెన్‌‌హాగన్ యూనివర్సిటీ)ల పనిచేసే  మెలిస్సా లార్డో వీళ్ల మీద రీసెర్చ్​ చేసిండు. ఇండోనేషియల ఎక్కువగా ఉండే సలువాన్ తెగ వాళ్లలో కంటే జబావు తెగ వాళ్లలో ఉండే ప్లీహం 50 శాతం ఎక్కువగా ఉందని రీసెర్చ్​లో తేల్చిండు. వేల సంవత్సరాలు ఒకే వాతావరణంలో ఉంటే దానికి తగ్గట్టే బాడీ మార్పుచెందుతది. హిమాలయాలపై ఉండే షెర్పాల ఊపిరితిత్తులు ఎక్కువ వెడల్పుతో ఉన్నట్టే వీళ్ల ప్లీహం పెద్దగా ఉంది. ఇట్ల డెవలప్​ అయిన బాడీ కాబట్టే ఎంతసేపైనా నీళ్లల ఉంటున్నరు. సముద్రంలనే బతికేస్తున్నరు.