
బషీర్‌బాగ్, వెలుగు: బ్లింకిట్ కస్టమర్ కేర్ కోసం గూగుల్ లో సెర్చ్ చేస్తే, స్కామర్స్ బ్యాంక్ ఖాతాను ఖాళీ చేశారు. హైదరాబాద్ సైబర్ క్రైమ్ ఏసీపీ శివమారుతి తెలిపిన వివరాల ప్రకారం.. అజాంపురా ప్రాంతానికి చెందిన 69 ఏండ్ల వృద్ధుడు ఆగస్టు 26న బ్లింకిట్ యాప్‌లో మేకప్ వస్తువులు ఆర్డర్ చేశారు. ఆ వస్తువులు డ్యామేజ్ ఉండడంతో గూగుల్‌లో కస్టమర్ కేర్ నంబర్ కోసం సెర్చ్ చేశాడు. స్కామర్లు పోస్ట్ చేసిన నకిలీ నంబర్‌ను సంప్రదించారు. స్కామర్స్ వాట్సాప్ ద్వారా బాధితుడితో చాట్ చేశారు. డ్యామేజ్ అయిన వస్తువులను రీప్లేస్ చేస్తామని తెలిపి, అతని భార్య మొబైల్ లో పేటీఎం ఇన్స్టాల్ చేయమని తెలిపారు.
అనంతరం ఓ ఏపీకే ఫైల్ లింక్ ను పంపించి దానిని కూడా ఇంస్టాల్ చేయమన్నారు. అనంతరం ఆ మొబైల్ రిమోట్ యాక్సెస్ పొంది , బాధితుడి భార్య ఖాతాలో ఉన్న రూ.4,193 లను కాజేశారు. మరల కాల్ చేసి ప్రాసెస్ కావడం లేదని, ఈసారి అతని కోడలి ఫోన్ లో ఇదే తరహాలో ఏపీకే ఫైల్ ను పంపించి ఆమె ఖాతాలో ఉన్న రూ.98,001 లను కాజేశారు. కాసేపటికి మోసపోయినట్లు గ్రహించిన బాధితుడు... మొత్తం రూ.1,02,194 లను పోగొట్టుకున్నట్లు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీపీ వెల్లడించారు.