- స్టూడెంట్ల భద్రత కోసం అందుబాటులోకి ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్: కృష్ణ ఆదిత్య
- బీఈడీ, బీఫార్మసీతో పాటు ప్రొఫెషనల్ కోర్సులు ప్రవేశపెడుతున్నట్లు వెల్లడి
హైదరాబాద్, వెలుగు: ఎస్సీ గురుకుల సొసైటీలో సమస్యల పరిష్కారానికి పలు సంస్కరణలు చేపడుతున్నట్లు సెక్రటరీ కృష్ణ ఆదిత్య తెలిపారు. ఇందులో భాగంగా గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలకు చెక్ పెట్టేందుకు హాస్టల్స్‌లో కిచెన్‌లను ఆధునీకరిస్తున్నామన్నారు. తొలి దశలో షేక్‌పేటలో కిచెన్‌ను ఆధునీకరించి ప్రారంభించామని, త్వరలో మరో రెండు చోట్ల స్టార్ట్ చేస్తున్నామని చెప్పారు. సోమవారం హైదరాబాద్‌లో మీడియాతో ఆయన చిట్‌చాట్ చేశారు.
రాష్ట్రంలో 268 గురుకులాలు ఉండగా, ఇందులో 150 సొంత భవనాలు ఉండగా, మరో 78 గురుకులాలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయని, వీటికి సొంత బిల్డింగ్‌లు నిర్మిస్తున్నామన్నారు. ఇందుకోసం రూ.3,950 కోట్లు కేటాయించాలని ప్రభుత్వానికి ప్రపోజల్స్ పంపించామని తెలిపారు. గురుకులాల్లో స్టూడెంట్స్ ఔటింగ్ వెళ్లి మిస్ అవుతున్న నేపథ్యంలో ఎఫ్‌ఆర్‌ఎస్(ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్)ను లాంచ్ చేశామని, ఉదయం, సాయంత్రం దీని ద్వారా అటెండెన్స్ తీసుకుంటున్నామని చెప్పారు. ఆరోగ్య సమస్యలు ఉంటే వారికి వెంటనే చికిత్స ఇప్పిస్తామన్నారు.
స్కూల్, హాస్టల్ స్టూడెంట్లకు కిట్స్..
ఎస్సీ గురుకుల స్కూల్ స్టూడెంట్స్‌కు 10 వస్తువులతో, హాస్టల్ స్టూడెంట్స్ 9 వస్తువులతో వేర్వుగా కిట్‌లు అందజేస్తామని కృష్ణ ఆదిత్య వెల్లడించారు. “వచ్చే విద్యా సంవత్సరానికి సంబంధించి పాఠ్యపుస్తకాల కొనుగోలు ఇప్పటికే ప్రారంభించాం. స్కూళ్ల ప్రారంభానికి ముందే పుస్తకాలు పంపిణీ చేస్తం. 37 సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీవోఈ), 28 స్పోర్ట్స్ అకాడమీలు, 3 ప్రత్యేక స్కూళ్లను మరింత బలోపేతం చేయనున్నాం. విద్యా ప్రమాణాలు, మౌలిక వసతులు, ప్రత్యేక శిక్షణ సదుపాయాలను మెరుగుపరుస్తున్నాం.
సొసైటీ పరిధిలో బీఈడీ, బీఫార్మసీ, డీఈడీ, అగ్రికల్చర్, ఆక్యుపెంచరీ థెరపీ కోర్సులతో పాటు ప్రొఫెషనల్ కోర్సులు ప్రవేశపెడుతున్నాం. గురుకుల ఎంట్రన్స్ ఫలితాలను మార్చి 9న రిలీజ్ చేస్తాం. సీఎం రేవంత్ గైడ్ లైన్స్ ప్రకారం మార్గదర్శకాల మేరకు రాష్ట్రంలోని అన్ని సంక్షేమ గురుకుల విద్యాసంస్థల కోసం టీజీ ఆన్‌లైన్ ఆధ్వర్యంలో సమగ్ర డిజిటల్ వేదికను అభివృద్ధి చేస్తున్నాం”అని ఆయన వెల్లడించారు.
