Fire accident : కాంప్లెక్స్ పక్కనున్న బస్తీని చుట్టేసిన మంటలు

Fire accident : కాంప్లెక్స్ పక్కనున్న బస్తీని చుట్టేసిన మంటలు

ఫైర్ సిబ్బంది గంటల తరబడి శ్రమించినా మంటలు మాత్రం చల్లారడం లేదు. ప్రమాదం జరిగిన బిల్డింగ్ నుంచి భారీగా శబ్దాలు వినిపిస్తున్నాయి.  ఉవ్వెత్తున ఎగిసి పడుతున్న మంటలు పక్కనున్న బస్తీకి వ్యాపించాయి. దీంతో వెంటనే అప్రమత్తమైన అధికారులు బస్తీవాసులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ప్రాణభయంతో జనం కట్టుబట్టలతో ఆ ప్రాంతాన్ని వదలి వెళ్తున్నారు. బిల్డింగ్ పరిసర ఆ ప్రాంతాల్లో దట్టమైన పొగ కమ్మేయడంతో రెస్క్యూ ఆపరేషన్ కష్టంగా మారింది. దట్టమైన పొగ జనాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. బిల్డింగ్ ఉన్న రోడ్డును బారికేడ్లతో పూర్తిగా బ్లాక్ చేసిన పోలీసుల.. భవనం చుట్టుపక్కలకు ఎవరూ రాకుండా చర్యలు తీసుకుంటున్నారు. పొగ కారణంగా ఇద్దరు ఫైర్ సిబ్బంది అస్వస్థతకు గురయ్యారు. అగ్ని ప్రమాదం జరిగిన ప్రాంతానికి కిమ్స్ హాస్పిటల్ సమీపంలోనే ఉండటంతో ఆస్పత్రి చుట్టూ దట్టంగా పొగ కమ్మేసింది. దీంతో ఆస్పత్రి సిబ్బంది, రోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఉవ్వెత్తున ఎసిగిపడుతున్న మంటలు, పొగ ట్యాంక్ బండ్ వరకు కనిపిస్తున్నాయి.

నల్లగుట్టలోని డెక్కన్ స్పోర్ట్స్ స్టోర్ అగ్ని ప్రమాద ఘటనలో రెస్క్యూ సిబ్బంది ఇప్పటి వరకు నలుగురిని రక్షించారు. మిథిలేష్, రూపేష్, భూపేష్, రామ్ రాజ్ సింగ్ అనే నలుగురు వ్యక్తులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. స్టోర్ లో పనిచేసే వసీం, జహీర్ అనే ఇద్దరు కార్మికులు మంటల్లో చిక్కుకుపోయినట్లు తెలుస్తోంది. జావీద్, రహీం అనే ఇద్దరు సోదరులు స్పోర్ట్స్ స్టోర్ నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.