
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఎవ్వరితో పొత్తు లేకుండానే 8 స్థానాల్లో విజయం సాధించామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తెలిపారు. మంగళవారం రాత్రి ఆయన స్టేట్ ఆఫీసులో మీడియాతో మాట్లాడారు. మోదీ నాయకత్వం పట్ల ప్రజలు సంపూర్ణ విశ్వాసంతో ఉన్నారని తెలిపారు. అందుకే రాష్ట్రంలో మెజార్టీ సీట్లను బీజేపీ సాధించినట్టు చెప్పారు. బీజేపీ గెలిస్తే రాజ్యాంగాన్ని మారుస్తారని, రిజర్వేషన్లు తీసేస్తారని బీఆర్ఎస్, కాంగ్రెస్ విషప్రచారం చేసినా తెలంగాణ ప్రజలు నమ్మలేదన్నారు. బీఆర్ఎస్ పార్టీ లాగే కాంగ్రెస్ పార్టీ పాలనపై ప్రజలు నిరాశ నిస్పృహాలతో ఉన్నారని తెలిపారు. అందుకే తమకు 8 సీట్లను ఇచ్చారని చెప్పారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునేలా అంకితభావంతో బీజేపీ పనిచేస్తుందని స్పష్టం చేశారు.
రాష్ట్రంలో బీజేపీ ఒక ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థ అని ప్రజలు భావిస్తున్నట్లు వివరించారు. పదేండ్ల పాటు అహంకార పాలన చేసిన బీఆర్ఎస్ ఈ ఎన్నికల్లో పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిందని ఎద్దేవా చేశారు. ఒక్క సీటూ బీఆర్ఎస్ గెలువలేదని, కంచుకోటగా చెప్పుకునే మెదక్ స్థానంలోనూ బీజేపీ విజయం సాధించిందని వెల్లడించారు. ఈ ఎన్నికలను రెఫరెండంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారని కానీ, ఆ పార్టీ సగం సీట్లు కూడా పొందలేదని, దీన్ని ఆయన సమర్థించుకుంటాడో చెప్పాలని ప్రశ్నించారు. -ఫేక్ వీడియోలతో, అసత్య ప్రచారాలతో ప్రజలను తప్పుదోవ పట్టించిన కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయకుండా బీజేపీని ప్రజలు ఆదరించారని తెలిపారు. భవిష్యత్లో ప్రజల మెప్పు ఎలా పొందాలనే దానిపై ప్లాన్ వేసుకొని ముందుకు పోతామని..దేశంలో మోదీ నాయకత్వంలో మూడోసారి ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడబోతుందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.