సంక్రాంతి రద్దీ : ప్రయాణికులతో కిక్కిరిసిన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్

సంక్రాంతి రద్దీ : ప్రయాణికులతో కిక్కిరిసిన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్

రాష్ట్రంలో సంక్రాంతి సందడి నెలకొంది. పండగ సందర్భంగా నగరవాసులు తమ సొంతూళ్లకు పయనమయ్యారు. దీంతో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది. టిక్కెట్ కౌంటర్ల వద్ద ప్రయాణికులు బారులు తీరారు. పండగ రద్దీని దృష్టిలో ఉంచుకుని..దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్లో 21 టిక్కెట్‌ కౌంటర్లను ఏర్పాటు చేసింది. సాధారణ రోజుల్లో 12 మాత్రమే ఉండేవి.  రైళ్లు ఏ సమయానికి, ఏ ప్లాట్‌ఫామ్‌కు వస్తాయనేది ఎప్పటికప్పుడు ప్రకటిస్తున్నట్లు రైల్వేశాఖ అధికారులు తెలిపారు. 

మరోవైపు ఇవాళ, రేపు పలు ఎంఎంటీఎస్‌ రైళ్లను రద్దు చేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. లింగంపల్లి – హైదరాబాద్‌ మధ్య 5 సర్వీసులు, ఫలక్‌నుమా – లింగంపల్లి మధ్య 11 సర్వీసులు, హైదరాబాద్‌ –ఫలక్‌నుమా మధ్య ఒక రైలు సర్వీసును రద్దు చేసినట్లు తెలిపింది. నగరవాసులు సొంత ఊళ్లకు వెళ్లడంతో సిటీలో ట్రాఫిక్ తగ్గింది. హైదరాబాద్లో స్థిరపడిన వాళ్లు, ఉద్యోగులు సంక్రాంతికి స్వస్ధలాలకు వెళుతుండటంతో రోడ్లపై వాహనాల రద్దీ తక్కువగా కనిపిస్తోంది.