
సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఇవాళ ఉదయం మంత్రి తలసాని శ్రీనివాస్ కుటుంబ సభ్యులు అమ్మవారికి తొలి భోనం సమర్పించారు. ప్రత్యేక అలంకరణతో అమ్మవారు మెరిసిపోతున్నారు. తెల్లవారుజామున నుంచే భక్తులు క్యూ కట్టారు.
భక్తుల కోసం ఈసారి ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఆరు క్యూ లైన్లను ఏర్పాటుచేసి భక్తులను అమ్మవారి దర్శనానికి పంపించనున్నట్లు తెలిపారు. బోనాలతో వచ్చే భక్తులను సికింద్రాబాద్ బాటా వద్ద ఏర్పాటు చేసిన క్యూ లైన్ నుంచి అనుమతించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. సాధారణ భక్తులకు రాంగోపాల్ పేట పీఎస్ నుంచి ఎంట్రీ ఉంటుందన్నారు. ఆలయం వెనుక వైపు ఏర్పాటు చేసిన క్యూ లైన్లలో ఒక దాని నుంచి వీపీసీ పాస్లు ఉన్నవారిని, మరో లైన్లో బోనాలతో వచ్చే భక్తులను, జనరల్ బజార్ వద్ద ఏర్పాటు చేసి 2 క్యూ లైన్లలో ఒక దాని నుంచి వీఐపీలు, మరో లైన్ నుంచి భక్తులను అనుమతించనున్నట్లు తెలిపారు. గతేడాది గర్భగుడి ప్రాంతం నుంచి అమ్మవారి దర్శనానికి ఒకే క్యూ లైన్ ఉండటంతో భక్తులు ఇబ్బందిపడ్డారని.. అందుకే ఈ సారి అక్కడ 4 క్యూ లైన్లను ఏర్పాటు చేశామన్నారు. అమ్మవారిని దర్శించుకునేందుకు వీఐపీలు హాజరుకానున్నారు. ఉదయం 10 గంటలకు ఎమ్మెల్సీ కవితతో పాటు సుమారు 2 వేల మంది భక్తులు ర్యాలీగా ఉజ్జయిని మహంకాళి ఆలయానికి చేరుకోనున్నారు. అనంతరం మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర వీఐపీలు, కార్పొరేటర్లు అమ్మవారిని దర్శించుకుని బోనాలు సమర్పించనున్నారు.
సెక్యూరిటీ ఏర్పాట్లను పరిశీలించిన సీపీ
బోనాల సందర్భంగా పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసినట్లు సిటీ సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. ఆలయ పరిసరాల్లో సెక్యూరిటీ ఏర్పాట్లను అడిషనల్ సీపీ డీఎస్ చౌహన్, నార్త్ జోన్ డీసీపీ చందనా దీప్తితో కలిసి శనివారం ఆయన పరిశీలించారు. కరోనా ఎఫెక్ట్ తో రెండేళ్లుగా లష్కర్ బోనాలకు రాలేకపోయిన భక్తులు ఈ సారి భారీ సంఖ్యలో హజరయ్యే అవకాశాలున్నట్లు పోలీసులు తెలిపారు. ఆదివారం ఉదయం నుంచే ప్రారంభమయ్యే జాతరలో సుమారు 7 నుంచి8 లక్షల మంది పాల్గొంటారని అంచనా వేస్తున్నారు.