కిడ్నీ సమస్యతో వెళ్తే…కరోనా వచ్చిందన్నరు

V6 Velugu Posted on Aug 06, 2020

సికింద్రాబాద్ యశోదా హాస్పిటల్ నిర్వాకం
3 లక్షలు వసూలు.. మరో 6 లక్షలు కట్టాలని ఒత్తిడి
డబ్బు కడితేనే పేషెంట్ ను చూపుతామని దబాయింపు
రిపోర్టు చూపించమంటే మాట మార్చిన్రు
నయం కాకుండానే డిశ్చార్జ్.. దారిలోనే మృతిచెందిన పేషెంట్

సికింద్రాబాద్, వెలుగు: కిడ్నీ సమస్యతో ఓ కార్పొరేట్ దవాఖానకు పోతే.. కరోనా వచ్చిందన్నరు. ఆరు లక్షలు కట్టాలని వత్తిడి తెచ్చిన్రు. డబ్బులు కడితేనే పేషెంట్ ని చూపిస్తమన్నరు.. చివరకు కరోనా రిపోర్ట్ ఇవ్వాలని అడిగితే నీళ్లు నమిలిండ్రు.. బంధువులకు సర్ది చెప్పి వెంటిలేటర్ పై ఉన్న పేషెంట్ హడావుడిగా డిశ్చార్జ్ చేసి ఇంటికి పంపిన్రు.. కానీ రెండు కిడ్నీలూ ఫెయిలై.. నయం కాకుండా సీరియస్ కండిషన్ లో ఉన్న అతన్ని పంపేయడంతో బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సికింద్రాబాద్ యశోదా హాస్పిటల్ లో ఈ సంఘటన చోటు చేసుకుంది.

ఏం జరిగిందంటే…

కోరుట్లకు చెందిన రాజశేఖర్ (28) కిడ్నీ సమస్యతో గత నెల 24న సికింద్రాబాద్ లోని యశోద ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యాడు. అడ్వాన్స్ గా లక్ష రూపాయలు చెల్లించడంతో ట్రీట్మెంట్ మొదలుపెట్టారు. ట్రీట్ మెంట్ కొనసాగుతోందంటూ గత నెల 30 వరకు మరో రెండు లక్షలు కట్టించుకున్నారు. అయితే ఈ నెల 4న రాజశేఖర్ కు కరోనా పాజిటివ్ వచ్చిందని, ఇప్పటివరకు రూ.6 లక్షల 30 వేలు బిల్లు అయిందని అది వెంటనే చెల్లించాలని కుటుంబ సభ్యులను వత్తిడి చేశారు. దీంతో ఇప్పటికే అప్పు చేసి రూ.3 లక్షలు తెచ్చి కట్టామని, ఇక తమ వద్ద డబ్బులు లేవని, ఎలాగైనా వైద్యం అందించాలని వేడుకున్నామని రోగి తల్లి పోసాని తెలిపారు. తమ కొడుకు ఎలా ఉన్నాడో చూపించాలని వేడుకున్నా కనికరించని ఆసుపత్రి యాజమాన్యం మొత్తం డబ్బులు కడితేనే చూపిస్తామన్నారని పోసాని రోదిస్తూ చెప్పింది. అలా కాకుంటే రోజుకు లక్ష రూపాయలు కడతామని ఒప్పుకున్నట్లు కాగితంపై సంతకం పెట్టాలని తనను వత్తిడి చేశారని ఆమె పేర్కొన్నారు. ఏం చేయాలో అర్థంకాక రాజశేఖర్ త‌ల్లి, బంధువులు ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న కొందరు ఎరుకల సంఘం ప్రతినిధులు ఆసుపత్రికి వెళ్లి రాజశేఖర్ కు వైద్యం అందిస్తున్న డాక్ట‌ర్ ఊర్మిళా ఆనంద్ ను నిలదీశారు. కరోనా పాజిటివ్ రిపోర్ట్ చూపించాలంటూ పట్టుబట్టడంతో బిత్తర పోయిన ఆసుపత్రి యాజమాన్యం తప్పును సర్దుకుని రాజశేఖర్ కు కరోనా సోకలేదని, అతనికి టెస్టులో నెగెటివ్ వచ్చిందంటూ చెప్పారు.

నయం కాకుండానే డిశ్చార్జ్..

పేషెంటుకు రెండు కిడ్నీలు పూర్తిగా పాడయ్యాయని, దీంతో ఊపిరి తిత్తులు కూడా చెడిపోయాయని, అతడు బతుకుతాడనే గ్యారంటీ ఇవ్వలేమంటూ చేతులెత్తేశారని రోగి తల్లి చెప్పారు. మా కొడుకును శవంగానైనా, బతికున్నా ఎలా ఉన్నా మాకు ఇవ్వండి లేకుంటే మీరే పెట్టుకోండి మావద్ద డబ్బులు మాత్రం లేవంటూ రోగి బంధువులు కరాకండిగా చెప్పడంతో ఆసుపత్రి యాజమాన్యం సందిగ్ధంలో పడ్డారు. దీంతో వారి బంధువులను పిలిచి చర్చలు జరిపి డబ్బులు మాఫీ చేసిన ఆసుపత్రి యాజమాన్యం సీరియస్ కండీషన్ లో వెంటిలేటర్ పై ఉన్న రాజశేఖర్ ను డిశ్చార్జ్ చేశారు. ఇలాంటి కండిషన్ లో ఉన్న పేషెంట్ కు ట్రీట్మెంట్ చేయకుండా హడావుడిగా హాస్పిటల్లోంచి పంపేయడంపై కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆసుపత్రిపై చర్యలు తీసుకోవాలి..

రోగం నయం అవుతుందని అప్పుచేసి ప్రైవేటు ఆసుపత్రిలో చేరితే కరోనా సోకిందంటూ తప్పుడు సమాచారం ఇచ్చి లక్షల్లో డబ్బులు వసూలు చేసేందుకు ప్రయత్నించిన ఆసుపత్రిపై చర్యలు తీసుకోవాలని ఎరుకల సంఘం రాష్ట్రఅధ్యక్షుడు వెంకటేష్ డిమాండ్ చేశారు. డబ్బులు లాగి సరైన వైద్యం అందించలేదని, ఆసుపత్రి నిర్ల‌క్ష్యం వ‌ల్ల రాజశేఖర్ చనిపోయాడని ఆరోపించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం

Tagged corona, secunderabad, FEES, Yashoda Hospital, robbing

Latest Videos

Subscribe Now

More News