ఇండిపెండెన్స్ డే వేడుకలకు భద్రత కట్టుదిట్టం

ఇండిపెండెన్స్ డే వేడుకలకు భద్రత కట్టుదిట్టం

న్యూఢిల్లీ: దేశ 76వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రధాని మోడీ జెండా ఎగరేయనున్న ఎర్రకోట వద్ద భారీగా బలగాలను మోహరించారు. దేశం డైమండ్ జూబ్లీ వేడుకలు జరుపుకొంటున్న తరుణంలో లష్కరే తాయిబా, జైషే మహ్మద్ వంటి టెర్రరిస్ట్ సంస్థలు దాడులకు పాల్పడే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ ఇదివరకే హెచ్చరించాయి. దీంతో ఢిల్లీలో అడుగడుగునా సెక్యూరిటీని పటిష్టం చేశారు. ఎర్రకోట వద్దకు ప్రధాని మోడీ కాన్వాయ్ ఎలాంటి అడ్డంకులు లేకుండా వచ్చి, వెళ్లేందుకు ఏర్పాట్లు చేశారు. ఎర్రకోట వద్ద కార్యక్రమాలు ముగిసిన తర్వాత ప్రధాని మోడీ, ఇతర వీవీఐపీలు వెళ్లిన తర్వాతే ఆడియన్స్ ను బయటకు పంపనున్నారు. అదికూడా ఒకే మార్గం నుంచి సాధారణ పబ్లిక్​ను బయటకు పంపేందుకు ఏర్పాట్లు చేశారు. ఎర్రకోట వద్ద వేడుకలకు సుమారు 7 వేల మంది హాజరుకానున్నారు. 

పకడ్బందీగా నిఘా.. 

ఎర్రకోట వద్ద వివిధ అంచెల్లో మల్టీలేయర్ సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. తెల్లవారుజామున 4 గంటల నుంచి ఉదయం 10 గంటల వరకూ ఎర్రకోట చుట్టూ 8 ప్రధాన రోడ్లను మూసివేయనున్నారు. అలాగే ఢిల్లీ చుట్టూ అన్ని ప్రధాన బార్డర్లను క్లోజ్ చేయనున్నారు. ఒక్క ఎర్రకోట వద్దనే 10 వేల మంది బలగాలను మోహరించారు. ఫేసియల్ రికగ్నైజేషన్ కెమెరాలతో నిఘా పెట్టారు. ఎర్రకోట చుట్టూ5 కి.మీ. దాకా ‘నో కైట్ ఫ్లయింగ్ జోన్’గా ప్రకటించారు. పతంగులు, బెలూన్​లు, చైనీస్ లాంతర్లవంటివి ఎగరేస్తే పట్టుకోవడానికి కైట్ క్యాచకర్స్​ను మోహరించారు.  డ్రోన్​లను గుర్తించేందుకు రాడార్లను ఏర్పాటు చేశారు.

చారిత్రక కట్టడాలకు మువ్వన్నెల వెలుగులు 

దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు అవుతున్న సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రముఖ చారిత్రక కట్టడాలు, బిల్డింగ్ లన్నీ జెండా రంగుల లైటింగ్ లో వెలిగిపోతున్నాయి. అనేక చోట్ల ప్రత్యేక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. ఢిల్లీలోని హుమాయున్ టూంబ్, రాష్ట్రపతి భవనం, సఫ్దర్ జంగ్ టూంబ్, కర్నాటకలోని హంపి, ముంబైలోని ఛత్రపతి శివాజీ రైల్వే టెర్మినస్, తదితర కట్టడాలు, బిల్డింగ్ లకు మూడు రంగుల్లో లైటింగ్ ఏర్పాటు చేశారు. ఆయా రాష్ట్రాల అసెంబ్లీలు, హైకోర్టులను కూడా జెండా లైటింగ్ తో ముస్తాబు చేశారు. మధ్యప్రదేశ్ లోని భోపాల్​లో జ్వాలా సామాజిక సంస్థ ఆధ్వర్యంలో 5,335 మందితో ఇండియా మ్యాపు, మధ్యలో అశోక చక్రం రూపాన్ని ఆవిష్కరించి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ సాధించారు.