ప్రధాని మోడీ పర్యటనలో సెక్యూరిటీ ల్యాప్స్‌.. SI సహా ఆరుగురు పోలీసులపై సస్పెన్షన్

ప్రధాని మోడీ పర్యటనలో సెక్యూరిటీ ల్యాప్స్‌.. SI సహా ఆరుగురు పోలీసులపై సస్పెన్షన్

దేశ ప్రధాని భద్రత విషయంలో జరిగిన ఒక నిర్లక్ష్యం ఇప్పుడు సంచలనంగా మారింది. బెంగళూరులో మే 10న జరిగిన ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ వేడుకలకు ప్రధాని హాజరైన సంగతి తెలిసిందే. అయితే ఈ పర్యటనలో తీవ్ర భద్రతా లోపాలు తలెత్తినట్లు నిర్ధారణ కావడంతో.. ఒక సబ్-ఇన్‌స్పెక్టర్‌తో సహా ఆరుగురు పోలీసు అధికారులను సస్పెండ్ చేస్తూ బెంగళూరు సౌత్ ఎస్పీ ఆర్. శ్రీనివాస్ గౌడ ఆదేశాలు జారీ చేశారు.

ఈ కఠిన చర్య వెనుక రెండు వారాల క్రితం జరిగిన ఒక కలకలం దాగి ఉంది. ప్రధాని మోడీ ప్రయాణించే మార్గానికి కేవలం రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న కుప్పారెడ్డి కెరె సమీపంలో ఒక కార్టన్ బాక్స్‌లో పేలుడు పదార్థాలు దొరికాయి. ప్రధాని కాన్వాయ్ ఆ మార్గంలో వెళ్లడానికి కేవలం ఒకటిన్నర గంటల ముందే అప్రమత్తమైన ఒక కానిస్టేబుల్ ఈ అనుమానాస్పద బాక్స్‌ను గుర్తించారు. ప్రధాన రహదారికి కేవలం 25 అడుగుల దూరంలో ఉన్న ఓ ప్రైవేట్ ప్రాపర్టీ కాంపౌండ్ వాల్ వద్ద ఈ బాక్స్ ఉన్నట్లు గుర్తించారు.

మొదట పోలీసులు ఈ విషయాన్ని చాలా తేలికగా తీసుకున్నారు. కేవలం రెండు జెలటిన్ స్టిక్స్, ఒక అగ్గిపెట్టె మాత్రమే దొరికాయని ప్రకటించారు. కానీ రంగంలోకి దిగిన NIA, ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులు లోతుగా పరిశీలించగా అసలు నిజాలు బయటపడ్డాయి. ఆ బాక్స్‌లో రెండు జెలటిన్ స్టిక్స్‌తో పాటు మ్యాచ్‌స్టిక్స్, కర్పూరం, బ్యాటరీలు, వైర్లు, రియల్ టైమ్ క్లాక్, ఎల్‌సీడీ డిస్‌ప్లే వంటి టైమ్ బాంబుకు వాడే వస్తువులు ఉన్నట్లు ఎన్‌ఐఏ గుర్తించింది.

కేసు తీవ్రత దృష్ట్యా పోలీసు బృందాలు పొరుగున ఉన్న ఏపీ, తమిళనాడుతో పాటు కర్ణాటకలోని వివిధ జిల్లాల్లో విస్తృతంగా గాలింపు చేపట్టాయి. అయితే ఈ కేసులో ఇంతవరకు ఎలాంటి పురోగతి లభించలేదు. తాజాగా అందిన ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదిక మాత్రం కాస్త ఊరటనిచ్చింది. ఆ బాక్స్‌లో దొరికిన జెలటిన్ స్టిక్స్ మూడేళ్ల నాటివని, టైమర్ పనిచేయడం లేదని అలాగే అందులో డెటొనేటర్ లేకపోవడం వల్ల ఎలాంటి ప్రమాదం జరగలేదని తేలింది. ముప్పు తప్పినప్పటికీ, ప్రధానమంత్రి భద్రతలో ఇంతటి నిర్లక్ష్యం వహించినందుకు పోలీసులపై వేటు పడింది.