నాగర్ కర్నూల్/ఆమనగల్లు, వెలుగు : తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి మహిళకు ఉపాధి అవకాశాలు కల్పించి వారిని కోటీశ్వరులను చేయాలనే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క తెలిపారు. సోమవారం ఆమె నాగర్ కర్నూల్ జిల్లా తాడూరు మండలం సిర్సవాడ వద్ద దుందుభి వాగుపై రూ.20.20 కోట్లతో నిర్మించనున్న హైలెవల్ బ్రిడ్జి పనులకు భూమి పూజ చేశారు. జిల్లా కేంద్రంలో మహిళా భరోసా కేంద్రానికి శంకుస్థాపన చేసి, నూతన ఇందిరా మహిళా శక్తి భవనాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా స్వయం సహాయక సంఘాల మహిళల సమావేశంలో ఆమె మాట్లాడుతూ మహిళల పాత్ర లేకుండా అభివృద్ధి అసాధ్యమని, రాష్ట్రవ్యాప్తంగా ఒకే రోజు 8 వేల మహిళా భవన నిర్మాణాలకు శంకుస్థాపన చేయడం దేశంలోనే చారిత్రాత్మక ఘట్టమన్నారు. మహిళా సంఘాలకు రూ.10 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు అందిస్తున్నామని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని టిఫిన్ సెంటర్లు, కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసుకుని వ్యాపారవేత్తలుగా ఎదగాలని ఆకాంక్షించారు.
మహిళలు బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను క్రమశిక్షణతో తిరిగి చెల్లిస్తున్నారని ప్రశంసిస్తూ, నాగర్ కర్నూలు జిల్లాలో 98 శాతం రికవరీ సాధించడం అభినందనీయమన్నారు. రాబోయే రోజుల్లో కొనుగోలు చేసిన వరి ధాన్యం గిడ్డంగుల్లో భద్రపరిచే బాధ్యతను కూడా మహిళలకే అప్పగిస్తామని, ఇచ్చిన హామీ ప్రకారం త్వరలోనే అర్హులకు రూ.2,500 జీవన భృతి చెల్లించేలా చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.
కేటీఆర్ సినిమా బుద్ధికి ఇది నిదర్శనం..
రంగారెడ్డి జిల్లా కడ్తాల్ ఎంపీడీవో కార్యాలయ నూతన భవనాన్ని ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యేలు కసిరెడ్డి నారాయణరెడ్డి, వంశీకృష్ణతో కలిసి మంత్రి సీతక్క ప్రారంభించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ప్రజాపాలనను సినిమాతో పోల్చడం బీఆర్ఎస్ నేత కేటీఆర్ సినిమా ఎంటర్టైన్మెంట్ బుద్ధికి, ఆయన అల్ప ఆలోచనకు నిదర్శనమని విమర్శించారు.
మూడు గంటల సినిమా కొందరికి వినోదం, మరికొందరికి సంపాదన ఇస్తుందని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం నిరుపేదలకు కూడు, గుడ్డ, నీరు అందిస్తూ వారి కష్టాలు తీర్చే ప్రభుత్వమని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పార్టీ అబద్ధాల పునాదులపై నడుస్తోందని, గత ప్రభుత్వం పోయాకే తాగునీరు రావడం లేదంటూ సోషల్ మీడియాలో పిల్లల ఫొటోలు పెట్టి అవాస్తవాలు ప్రచారం చేయడం వారి అవివేకానికి నిదర్శనమన్నారు.
