ఖరీదైన కార్లు కొట్టేసి.. చాసిస్ నంబర్లు మార్చి అమ్ముతున్నరు

ఖరీదైన కార్లు కొట్టేసి.. చాసిస్ నంబర్లు మార్చి అమ్ముతున్నరు
  • అంతర్రాష్ట్ర గ్యాంగ్ కు చెందిన ఏడుగురు అరెస్ట్
  • రూ.3 కోట్లకుపైగా విలువైన 11 కార్లు స్వాధీనం
  • పరారీలో ప్రధాన నిందితుడు సహా మరో ఏడుగురు

గచ్చిబౌలి, వెలుగు :ఇతర రాష్ట్రాల్లో ఖరీదైన కార్లను కొట్టేసి ఫేక్ నంబర్ ప్లేట్, చాసిస్, ఇంజిన్ నంబర్లు మార్చి  అమ్ముతున్న అంతర్రాష్ట ముఠాను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు.  బుధవారం గచ్చిబౌలిలోని సైబరాబాద్ కమిషనరేట్ ఆఫీసులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీపీ స్టీఫెన్ రవీంద్ర వివరాలు  వెల్లడించారు. కోల్ కతాకు చెందిన బప్పా ఘోష్ అలియాస్ సోనూ ఘోష్ ఢిల్లీ, పుణె, హర్యానాలో ఖరీదైన కార్లను దొంగిలించేవాడు. 

కోల్ కతాకు చెందిన అరుణ్ బంగనితో కలిసి ఆ కార్లకు తెలంగాణ, వెస్ట్ బెంగాల్, మహారాష్ట్ర, యూపీ, అసోం, హర్యానా రాష్ట్రాలకు చెందిన ఫేక్ ఆర్సీలు క్రియేట్ చేసేవాడు. యూపీ, ఢిల్లీ, కోల్ కతాకు చెందిన సజాద్ ఖాన్, పర్వాజ్, మోహిత్ మాలిక్, శశిర్ దలాల్, జాకీర్, అభిషేక్​సాయంతో కొట్టేసిన కార్లకు ఫేక్ నంబర్ ప్లేట్ పెట్టేవాడు. చాసిస్, ఇంజిన్ నంబర్లను సైతం మార్చేవాడు. 

కారు డీలర్ల సాయంతో సెకండ్స్ లో సేల్..

కొట్టేసిన కార్లకు నంబర్ ప్లేట్, ఇంజిన్, చాసిస్ నంబర్ ఇలా అన్నింటిని మార్చేసిన తర్వాత బప్పా ఘోష్ ఇతర రాష్ట్రాల్లో తనకు తెలిసిన సెకండ్ హ్యాండ్ కార్లను అమ్మే డీలర్లను కన్సల్ట్ అయ్యేవాడు.  హైదరాబాద్ లో మైలార్ దేవ్ పల్లి కింగ్ కాలనీకి చెందిన మక్కీ యూఆర్ రెహమాన్(32), నిజాంపేటకు చెందిన కడియం శ్రీనివాసరావు(37)ను ఘోష్ సంప్రదించేవాడు. మీరట్ కు చెందిన అక్షయ్ సూద్(26), సమీర్ అహ్మద్(51), అక్షయ్(26), వెస్ట్ బెంగాల్ లోని గుట్రీ గ్రామానికి చెందిన అష్బుల్ మండల్(24) ఈ నలుగురిని బప్పా ఘోష్ కు ఏజెంట్లు, డ్రైవర్లుగా పనిచేసేవారు. ఘోష్ వీరి సాయంతో ఢిల్లీ, కోల్ కతా నుంచి కార్లను హైదరాబాద్ లోని డీలర్లకు పంపించేవాడు. 

ఒక్కో కారు మోడల్ ను బట్టి రూ.7 లక్షల నుంచి రూ.10 లక్షల మధ్యలో డీలర్లు రెహమాన్, శ్రీనివాసరావుకు అమ్మేవాడు. ఇలా బప్పా ఘోష్ కొట్టేసిన కార్లను ఇతర రాష్ట్రాలకు పంపి డీలర్ల సాయంతో సెకండ్ హ్యాండ్ లో అమ్మేవాడు. రెహమాన్ బప్పా ఘోష్ ఏజెంట్ల నుంచి రెండు కార్లను, శ్రీనివాసరావు 7 కార్లను కొన్నారు. వీరిద్దరూ తెలుగు రాష్ట్రాల్లోని కస్టమర్లకు ఒక్కో కారును మోడల్ ను బట్టి రూ.10 లక్షల నుంచి రూ. 19 లక్షల మధ్యలో అమ్మేశారు.  కారుకు సంబంధించిన ఎన్ వోసీని 2, 3 నెలల్లో అందజేస్తామని కొనుగోలుదారులను నమ్మించారు. 

ఇలా దొరికిన్రు..

ఇతర రాష్ట్రాల్లో దొంగిలించిన కార్లను సిటీకి తరలించి అమ్ముతున్నట్లు సమాచారం అందుకున్న రాజేంద్రనగర్ ఎస్ వోటీ, మైలార్ దేవ్ పల్లి పోలీసులు మంగళవారం సాయంత్రం ఆరాంఘర్ క్రాస్ రోడ్ లోని పరివార్ దాబా వద్ద నిఘా పెట్టారు.

 క్రెటా కారులో వస్తున్న బప్పా ఘోష్ ఏజెంట్లు సమీర్ అహ్మద్, అష్బుల్ మండల్ ను అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించి11 కార్లు దొంగిలించినట్లు గుర్తించారు. ఈ కేసులో మొత్తం ఏడుగురిని అరెస్ట్ చేయగా.. ప్రధాన నిందితుడు బప్పా ఘోష్ తో పాటు మరో ఏడుగురు పరారీలో ఉన్నట్లు సీపీ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. 

పట్టుబడ్డ నిందితుల నుంచి రూ.3 కోట్ల 30 లక్షల విలువైన 11 కార్లు, 8 సెల్ ఫోన్లు, 6 ఫేక్ ఆర్సీలు,  ఒక సెన్సార్ కీ సెట్ ను స్వాధీనం  చేసుకున్నట్లు తెలిపారు. నిందితులు కొట్టేసిన కార్లకు సంబంధించి  ఢిల్లీ, హర్యానా, పుణె ప్రాంతాల్లో 8 కేసులు నమోదై ఉన్నాయన్నారు.