కౌలు రైతులకు రైతు బంధు అమలు చేయాలి : ఉత్తమ్

కౌలు రైతులకు రైతు బంధు అమలు చేయాలి : ఉత్తమ్

రాహుల్ గాంధీ ఒక రాజకీయ నాయకుడే కాదు గొప్ప మానవతావాది అని ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ప్రతి రోజు వివిధ వర్గాల సమస్యలు తెలుసుకొని రాబోయే రోజుల్లో వాటి పరిష్కారానికి కృషి చేస్తారని చెప్పారు. రైతు స్వరాజ్య వేదిక ద్వారా రైతులను కలిసిన రాహుల్ గాంధీ..రేపు చేనేత, పోడు భూములను సేద్యం చేసుకుంటున్న వారి సమస్యలను తెలుసుకుంటారని చెప్పారు. తెలంగాణ లో 25లక్షల మంది రైతులకు అన్యాయం జరుగుతుందని..2011 కౌలు రైతుల చట్టాన్ని కేసీఆర్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకునే అనాలోచిత నిర్ణయాలతో రాష్ట్రంలో 80శాతం మంది కౌలు రైతులు చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కౌలు రైతులకు పంటల బీమా ఇవ్వడం లేదన్నారు. పంట నష్టపరిహారం కింద వారికి  ఎలాంటి సహాయం చేయడం లేదని చెప్పారు. పంటల బీమా లేని ఏకైక రాష్ట్రం తెలంగాణే అన్నారు. ధరణి పోర్టల్ అవకతవకలపై  కాంగ్రెస్ రైతుల పక్షాన పోరాడుతుందన్నారు. 

పంటకు కనీస మద్ధతు ధర కల్పించాలి

రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారం లోకి వస్తే వరంగల్ డిక్లరేషన్  ఉన్న అంశాలను కౌలు రైతులకు అమలు చేస్తామని కాంగ్రెస్ సీనియర్ నేత మధుయాష్కి గౌడ్ తెలిపారు. పంట నష్టపోయి..అప్పులు తీర్చలేక, పరిహారం అందక ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అన్నదాతలు పండించిన పంటకు కనీస మద్ధతు ధర కల్పించాలని కోరారు. 

కౌలు రైతులకు రైతు బంధు అమలు చేయాలి

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దేశంలో వ్యవసాయ రంగానికి అధిక ప్రాదాన్యత కల్పిస్తామని రాహుల్ గాంధీ అన్నదాతలకు హామీ ఇచ్చారని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేష్ అన్నారు. 2014 నుంచి ఇప్పటి వరకు తెలంగాణలో 6,500 మంది రైతులు చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. కౌలు రైతులను గుర్తించి వారికి కూడా రైతు బంధు  అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో  వారికి సహాయం చేసేలా చర్యలు చేపట్టాలన్నారు. కౌలు రైతులకు  ఎలాంటి సహాయం లేకపోతే అప్పులపాలవుతున్నారని తెలిపారు. పంట నష్టపరిహారం కౌలురైతులకు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు చట్టాలను అమలు చేయాలని కోరారు. తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్ అంతా అవకతవకలుగా ఉందన్నారు. అది ధరణి పోర్టల్  కాదది భస్మాసుర పోర్టల్ విమర్శించారు. ఆదివాసీ రైతుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. 

తెలంగాణలో భారత్ జోడో యాత్ర దిగ్విజయంగా కొనసాగుతోంది. రైతులతో,రైతు సంఘాల ప్రతినిధులతో రాహుల్ గాంధీ భేటీ అయ్యారు. రాష్ట్రంలో అన్నదాతలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో  ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జై రాం రమేష్,టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి,సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, మధుయాష్కి గౌడ్, బలరాం నాయక్, అద్దంకి దయాకర్, పొన్నం ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.