ప్రజల దృష్టిని మరల్చడానికే కేసీఆర్ కొత్త నాటకాలు: పొన్నం ప్రభాకర్

ప్రజల దృష్టిని మరల్చడానికే కేసీఆర్ కొత్త నాటకాలు: పొన్నం ప్రభాకర్

టీఆర్ఎస్ నేతలు ఇసుక,ల్యాండ్, మైనింగ్ మాఫియాలకు పాల్పడుతూ అడ్డగోలుగా అక్రమ ఆస్తులు సంపాదించుకుంటున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. లిక్కర్ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కవిత తనకు వీలున్నప్పుడే సీబీఐ అధికారులు ఇంటికి వచ్చి విచారణ చేయాలని ఆదేశించడాన్ని తప్పుబట్టారు. కేసీఆర్ కుటుంబానికి నరేంద్ర మోడీ, అమిత్ షా బంధువా అని ప్రశ్నించారు. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీని ఈడీ కార్యాలయంలో అధికారులు విచారణ చేయలేదా? మరి కేంద్ర ప్రభుత్వం కవితకు ఎందుకంత ప్రత్యేకత ఇస్తుందని నిలదీశారు. బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు రెండూ ఒక్కటేనన్నారు. 

అవినీతి అసమర్ధ పాలనపై, రైతులు,విద్యార్థులు, నిరుద్యోగులు ప్రశ్నించకుండా వారి దృష్టిని మరల్చడానికి టీఆర్ఎస్ ప్రభుత్వం దొంగనాటకాలు ఆడుతుందని పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. సీఎం కేసీఆర్ బుధవారం  జగిత్యాల జిల్లాకు రానున్న నేపథ్యంలో వేములవాడ రాజన్నకు రూ.100 కోట్లు ఇస్తానన్న హామీ ఏమైందో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ రీ ఓపెన్ చేస్తామని ఎమ్మెల్సీ కవిత ఇచ్చిన హామీపై సీఎం స్పందించాలన్నారు. 2018 ఎన్నికలకు ముందు కలికోట సూరమ్మ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసినప్పటికీ ఇప్పటివరకు దాన్ని పట్టించుకోలేదన్నారు. దీని గురించి ప్రభుత్వానికి గుర్తు చేసే విధంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గత ఏడాది  నుండి నిరసన కార్యక్రమాలు చేపడుతున్నా ప్రభుత్వంలో చలనం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

మేడిపల్లిలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటు గురించి విద్యార్థులు, యువకులు ప్రభుత్వానికి విన్నవించినప్పటికీ దానిపై స్పందించడం లేదని పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. తెలంగాణలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను వదిలేసి పంజాబ్, హర్యానా లాంటి ఇతర రాష్ట్రాల్లో మరణించిన రైతు కుటుంబాలకు నష్టపరిహారం ఇవ్వడం దేనికి నిదర్శనమని ప్రశ్నించారు.