- అవినీతి రహితుడిగా పేరు
- ఫైళ్ల క్లియరెన్స్‌లో ఆలస్యం చేస్తారనే అపవాదు
- ప్రైవేట్ రంగంలో మంచి ఆఫర్ వచ్చినందునే వీఆర్ఎస్ తీసుకున్నట్టు చర్చ
హైదరాబాద్, వెలుగు: సీనియర్ ఐఏఎస్ఆఫీసర్అహ్మద్ నదీమ్ రిజ్వీ స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్ఎస్) నిర్ణయం ఐఏఎస్ వర్గాల్లో కలకలం రేపింది. అవినీతి రహితుడిగా పేరున్న రిజ్వీ.. గత ఐదారు నెలల నుంచే వీఆర్‌ఎస్ తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నట్టు ఆయన సన్నిహితుల ద్వారా తెలుస్తున్నది. ప్రైవేట్సెక్టార్లో మంచి ప్యాకేజీతో కూడిన ఆఫర్రావడం వల్లే వీఆర్ఎస్తీసుకున్నట్టు చర్చ జరుగుతున్నది.
ఈ నెల 31 నుంచి రిజ్వీ వీఆర్‌ఎస్ అమల్లోకి రానుంది. ఈ మేరకు ప్రభుత్వం జీవో కూడా జారీ చేసింది. కాగా, రిజ్వీ ఎవరు చెప్పినా వినరని, కీలకమైన ఫైళ్లను నెలల తరబడి పెండింగ్‌లో పెడతారనే అపవాదు ఉన్నది. కాంగ్రెస్ అధికారంలోకి రాకముందు హెల్త్ సెక్రటరీగా పని చేసిన ఆయన.. ఆ తర్వాత విద్యుత్ సెక్రటరీగా, ఏడాదికి పైగా కీలకమైన కమర్షియల్ ట్యాక్స్, ఎక్సైజ్ ప్రిన్సిపల్ సెక్రటరీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
గత ప్రభుత్వంలో సీఎస్‌గా పని చేసిన సోమేశ్ కుమార్‌కు అత్యంత సన్నిహితుడిగా రిజ్వీకి పేరుంది. గతంలో సోమేశ్ చూసిన శాఖనే ఇప్పుడు రిజ్వీ చూస్తుండడం, మంత్రి జూపల్లి ఆదేశించినా ఎక్సైజ్‌శాఖలో కొన్ని నిర్ణయాలు అమలు కాకుండా పెండింగ్ పెట్టడంపై చర్చ జరుగుతున్నది. రిజ్వీ వీఆర్‌ఎస్‌కు సంబంధించిన జీవో వచ్చిన వెంటనే మంత్రి జూపల్లి కృష్ణారావు సీఎస్‌కు రాసిన లేఖ బయటకు రావడం చర్చనీయాంశంగా మారింది.
