లే ఔట్లను రెగ్యులరైజ్ చేయాలి: సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి

లే ఔట్లను రెగ్యులరైజ్ చేయాలి: సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి

హైదరాబాద్, వెలుగు: నాదర్ గుల్ ఆదిభట్ల ఎంఎం కుంటలో నివసిస్తున్న గ్రామాల రైతులు, ప్లాట్ల యజయానులు సొంత ఇండ్లు నిర్మించుకోవడానికి ఉన్న అడ్డంకులను తొలగించాలని సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి కోరారు.  గత 24 ఏండ్లుగా వీళ్ల జాగాలు నిషేధిత జాబితాలో ఉన్నాయని ఆయన గుర్తు చేశారు. ఈ మేరకు ఆదివారం నాంపల్లి టీజేఎస్ పార్టీ కార్యాలయంలో ఎంఎం కుంట బాధితుల జేఏసీ మీటింగ్ జరిగింది. ప్రభుత్వం తన మొండి వైఖరిని విడనాడాలని, ప్లాట్ల యజమానులు సొంత ఇండ్లు నిర్మించుకునే అవకాశం కల్పించాలని పాశం యాదగిరి  డిమాండ్ చేశారు.

అలాగే అన్ని లేఔట్లను రెగ్యులరైజ్ చేయాలని, నిషేధిత  జాబితా నుంచి తొలగించాలని, బాధితుల భూములను వారి పేర్లపై నమోదు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. గత 24 సంవత్సరాలుగా నాదర్‌‌గుల్, ఆదిభట్ల, ఎంఎం కుంట గ్రామాల రైతులు, ప్లాట్ల యజమానులను సొంత ఇండ్లు నిర్మించుకోకుండా నిషేధిత జాబితాలో ఉంచి ప్రభుత్వం వేధిస్తోందని సమావేశంలో  బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. గత ఎనిమిదేండ్లుగా తెలంగాణ జన సమితి పార్టీ ఆధ్వర్యంలో హార్డ్‌‌వేర్ పార్క్ వ్యతిరేక పోరాట సమితిని ఏర్పాటు చేసి, ప్రొఫెసర్ కోదండరాం  నాయకత్వంలో నిరంతర పోరాటం కొనసాగిస్తున్నామని బాధితులు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీజేఎస్ నేత బైరి రమేశ్, హార్డ్‌‌వేర్ పార్క్ లీగల్ అడ్వైజర్ , హైకోర్టు న్యాయవాది మాధవరం రామేశ్వరరావు, అభినందన లేఔట్ బాధ్యుడు ఎస్.ఆర్.కే. నరేంద్ర, నాదర్‌‌గుల్ సర్వే నెం. 9 బాధ్యుడు దామోదర్ రెడ్డి పాల్గొన్నారు.