నన్ను గెలిపిస్తే చంద్రమండలానికి తీసుకెళ్తా

నన్ను గెలిపిస్తే చంద్రమండలానికి తీసుకెళ్తా

చెన్నై: ఎన్నికల్లో నాయకులు హామీలు ఇవ్వడం మామూలే. ప్రజలను తమ వైపు ఆకర్షించడానికి అది చేస్తాం, ఇది చేస్తామంటూ రకరకాలు హామీలు ఇవ్వడాన్ని చూస్తూనే ఉంటాం. అయితే కొందరు నేతలు మాత్రం వింత హామీలు ఇస్తూ వార్తల్లో నిలుస్తుంటారు. అలాంటి కోవలోనే వస్తారు తమిళనాడుకు చెందిన రాజకీయ నేత శరవణన్. రాష్ట్రంలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర్య అభ్యర్థిగా శరవణన్ పోటీలో నిలబడ్డారు. ప్రచారంలో భాగంగా ఆయన అనూహ్య హామీలు ఇస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. తనను గెలిపిస్తే నియోజకవర్గ ప్రజల్ని చంద్రమండలం పైకి బ్యాచ్‌‌ల వారీగా తరలిస్తానని శరవణన్ అంటున్నారు. 

‘నన్ను గెలిపిస్తే ఈ నియోజకవర్గంలో రాకెట్ ప్రయోగ కేంద్రం ఏర్పాటు చేస్తా. ఇళ్లలో ఆడవాళ్లకు పనికి సాయంగా ఇంటింటికీ ఒక రోబో పంపిణీ చేస్తా. ట్రాఫిక్ రద్దీ తగ్గించడానికి కాల్వలు తవ్వించి ఇంటికో బోటు పంపిణీ చేస్తా. ఎండ వేడి నుంచి నియోజకవర్గాన్ని కాపాడేందుకు 300 అడుగుల ఎత్తున కృత్రిమ మంచు కొండతోపాటు ప్రజలు ఎంజాయ్ చేయడానికి కృత్రిమంగా సముద్రాన్ని నిర్మిస్తా. నియోజకవర్గ ప్రజలందరికీ ఉచితంగా ఐఫోన్‌‌లు అందిస్తా’ అని శరవణన్ హామీలు ఇవ్వడం విశేషం. దక్షిణ మధురై నుంచి శరవణన్ ఇండిపెండెంట్‌‌గా బరిలోకి దిగుతున్నారు. అన్ని రాజకీయ పార్టీలు టికెట్ నిరాకరించడంతో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి పోటీలోకి దిగుతున్నారు. శరవణన్ హామీలు చూసి రాజకీయ నేతలు ఆశ్చర్యపోతున్నారు.