- మార్కెట్లో మళ్లీ అమ్మకాల మోత.. 1,342 పాయింట్లు పడ్డ సెన్సెక్స్
- 91 డాలర్లకు చేరుకున్న బ్రెంట్ క్రూడాయిల్
- ఆగని ఎఫ్‌ఐఐల అమ్మకాలు
- రూ.7.5 లక్షల కోట్లు ఆవిరి
న్యూఢిల్లీ: క్రూడాయిల్ ధరలు మళ్లీ 90 డాలర్లు దాటడంతో స్టాక్ మార్కెట్లు బుధవారం నష్టాల్లో కదిలాయి. బ్రెంట్ క్రూడాయిల్ మంగళవారం బ్యారెల్‌కు 84 డాలర్ల వరకు పడగా, తిరిగి 91 డాలర్లకు చేరుకుంది. దీంతో గత సెషన్ లాభాలను సెన్సెక్స్, నిఫ్టీ కోల్పోయాయి. నిఫ్టీ ఇంట్రాడేలో 23,850 దిగువకు జారుకొని 11 నెలల కనిష్ట స్థాయిని తాకింది. సెన్సెక్స్ 1,342 పాయింట్లు (1.72శాతం) తగ్గి 76,863.71 వద్ద, నిఫ్టీ 394 పాయింట్లు (1.63శాతం) తగ్గి 23,866.85 వద్ద సెటిలయ్యాయి. ఇన్వెస్టర్లు రూ.7.5 లక్షల కోట్లు నష్టపోయారు.
నిఫ్టీ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 1.2 శాతం , స్మాల్‌క్యాప్ 0.36శాతం తగ్గింది. ఆటో, ఎఫ్‌ఎంసీజీ, బ్యాంకింగ్, ఐటీ, రియల్టీ రంగాలు 1–3శాతం పడ్డాయి. ఆయిల్ అండ్ గ్యాస్, ఫార్మా స్వల్ప లాభాలతో ముగిశాయి. నిఫ్టీలో బజాజ్ ఫైనాన్స్, యాక్సిస్ బ్యాంక్, ఐషర్ మోటార్స్ ఎక్కువగా నష్టపోగా, ఎన్‌టీపీసీ, జియో ఫైనాన్షియల్, కోల్ ఇండియా, సన్ ఫార్మా లాభాల్లో నిలిచాయి. ఎఫ్ఐఐలు బుధవారం నికరంగా రూ.6,267 కోట్ల విలువైన షేర్లను అమ్మారు. రూపాయి 16 పైసలు తగ్గి 92.01 వద్ద ముగిసింది. యుద్ధం మొదలైనప్పటి నుంచి నిఫ్టీ 4.6 శాతం పడగా, ఇన్వెస్టర్లు రూ.25 లక్షల కోట్లు నష్టపోయారు.
ఈ షేర్లు జూమ్..
రూ.401.33 కోట్ల ఆర్డర్ దక్కించుకోవడంతో హెచ్‌జీ ఇన్‌ఫ్రా ఇంజనీరింగ్ షేర్లు 6 శాతం ర్యాలీ చేశాయి. కొత్త గిడ్డంగిని ఏర్పాటు చేస్తుండడంతో టీవీఎస్ సప్లయ్ చెయిన్ షేర్లు 2.5శాతం లాభపడ్డాయి. 300 మెగావాట్ల సోలార్ పీవీ ప్లాంట్ కోసం ఈపీసీ కాంట్రాక్ట్‌ను కుదుర్చుకోవడంతో వారీ రెన్యూవబుల్ షేర్లు పాజిటివ్‌గా కదిలాయి. 2.5శాతం పెరిగాయి. సుమారు 180 స్టాక్‌లు బుధవారం 52 వారాల కనిష్టాన్ని తాకాయి.
టీసీఎస్, ఐఆర్‌సీటీసీ, కోటక్ మహీంద్రా బ్యాంక్, జూబిలంట్ ఫుడ్, రెలక్సో ఫుట్‌వేర్ షేర్లు ఈ లిస్టులో ఉన్నాయి. ‘‘24,300 లెవెల్ వద్ద బేర్స్ ఆధిపత్యం కనిపించింది. నిఫ్టీ 50 డేస్ మూవింగ్ యావరేజ్ (డీఎంఏ), 200 డీఎంఏ కంటే కిందకి జారే ప్రమాదం ఉంది. అదే జరిగితే అమ్మకాల ఒత్తిడి పెరుగుతుంది. నిఫ్టీకి 23,700–23,300 వద్ద సపోర్ట్, 24,100 వద్ద రెసిస్టెన్స్ ఉంది”అని ఎల్‌కేపీ సెక్యూరిటీస్ ఎనలిస్ట్ రూపక్ దే తెలిపారు.
