- 24 వేల దగ్గర నిఫ్టీ
- రూ.8 వేల కోట్ల షేర్లు అమ్మిన ఎఫ్ఐఐలు
ముంబై: బెంచ్ మార్క్ ఇండెక్స్ లు సెన్సెక్స్, నిఫ్టీ గురువారం తమ ఇంట్రాడే నష్టాల నుంచి షార్ప్‌గా రికవర్ అయ్యాయి. ముడిచమురు ధరలు భారీగా పెరగడం, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి బలహీన సంకేతాల కారణంగా ఒకశాతం మేర నష్టపోయినా, మధ్యాహ్నం సెషన్‌లో కొనుగోళ్లు పెరగడంతో కోలుకున్నాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 582.86 పాయింట్లు (0.75 శాతం) క్షీణించి 76,913.50 వద్ద స్థిరపడింది. ఒకానొక దశలో 1,237.5 పాయింట్లు పతనమై 76,258.86 కనిష్ట స్థాయిని తాకింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 180.10 పాయింట్లు క్షీణించి 23,997.55 వద్ద ముగిసింది.
అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ ముడిచమురు ధర బ్యారెల్‌కు 125 డాలర్ల మార్కును తాకింది. తదనంతరం 114 డాలర్లకు దిగివచ్చింది. పశ్చిమాసియాలో ఘర్షణల వల్ల సరఫరాకు ఆటంకం ఏర్పడుతుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. హార్మూజ్ జలసంధి గుండా చమురు రవాణా నిలిచిపోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చమురు దిగుమతులపై ఆధారపడే భారత్ లాంటి దేశాల్లో ఇది ద్రవ్యోల్బణాన్ని భారీగా పెంచుతుంది. ఎఫ్ఐఐలు బుధవారం రూ.2,468.42 కోట్ల విలువైన షేర్లను విక్రయించగా, గురువారం మరో రూ.8 వేల కోట్ల షేర్లను అమ్మారు.
మెటల్ షేర్లకు భారీ నష్టాలు
బీఎస్ఈలో మెటల్ రంగం అత్యధికంగా 2.13 శాతం మేర కుప్పకూలింది. పీఎస్‌యూ బ్యాంక్ 1.66 శాతం, రియల్టీ 1.44 శాతం నష్టపోయాయి. కమోడిటీస్, ఎఫ్ఎంసీజీ, ఫైనాన్షియల్ సర్వీసెస్ రంగాలు కూడా ఒకశాతానికిపైగా నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్ కంపెనీల్లో హిందుస్థాన్ యూనిలీవర్, టాటా స్టీల్, లార్సెన్ అండ్ టూబ్రో, అల్ట్రాటెక్ సిమెంట్, మహీంద్రా అండ్ మహీంద్రా నష్టపోయాయి.
సన్ ఫార్మా, ఇన్ఫోసిస్, బజాజ్ ఫైనాన్స్, అదానీ పోర్ట్స్ లాభాలను సాధించాయి. బీఎస్ఈ లో మొత్తం 2,532 షేర్లు నష్టపోగా, 1,649 షేర్లు లాభపడ్డాయి. దక్షిణ కొరియా కోస్పీ, జపాన్ నిక్కీ, హాంగ్ కాంగ్ హాంగ్ సెంగ్ సూచీలు కూడా ఒకశాతానికిపైగా నష్టపోయాయి. మహారాష్ట్ర దినోత్సవం సందర్భంగా శుక్రవారం మార్కెట్లకు సెలవు.
రూపాయి.. ఆల్‌టైం లో! చివరికి 4 పైసల లాభం
రూపాయి విలువ చారిత్రక కనిష్ట స్థాయికి పడిపోయింది. యుద్ధం, చమురు ధరల పెరుగుదల ప్రభావంతో ఇంట్రాడేలో రూపాయి రూ.95.34 స్థాయిని తాకింది. మధ్యాహ్నం సమయానికి రూ.95.25 వద్ద ట్రేడయ్యింది. ఫారెక్స్ మార్కెట్లో రూపాయి రూ.95.01 వద్ద ప్రారంభమైంది. ట్రేడింగ్ మధ్యలో 46 పైసలు క్షీణించి రూ.95.34 వద్ద రికార్డు కనిష్టానికి పడింది. మధ్యాహ్నం సమయానికి కొంత కోలుకుని రూ.95.25 వద్ద ట్రేడయ్యింది. చివరికి నాలుగు పైసల లాభంతో 94.84 వద్ద ముగిసింది.

