యూఎస్‌ ఓపెన్‌ మూడో రౌండ్‌లో సెరెనా ఓటమి

యూఎస్‌ ఓపెన్‌ మూడో రౌండ్‌లో సెరెనా ఓటమి

27 ఏళ్ల కెరీర్‌... 96 టైటిల్స్‌.. 23 గ్రాండ్‌స్లామ్స్‌.. 319 వారాల పాటు నంబర్‌వన్‌ హోదా.. 4 ఒలింపిక్‌ గోల్డ్‌ మెడల్స్‌.. ప్రపంచ మహిళా అథ్లెట్లలో అత్యధిక సంపాదన కలిగిన ప్లేయర్‌గా రికార్డులు... 
టెన్నిస్‌ హిస్టరీలో ఇంతటి ఘన చరిత్ర కలిగిన అమెరికా లెజెండ్‌ సెరెనా విలియమ్స్‌ కథ ముగిసింది. ​తన ఫేర్​వెల్​ టోర్నీ అని చెప్పిన యూఎస్​ ఓపెన్​లో మూడో రౌండ్​లోనే వెనుదిరిగింది.! రిటైర్మెంట్​ నిర్ణయాన్ని వెనక్కితీసుకోనని చెప్పిన సెరెనా ఓటమితో కెరీర్​కు వీడ్కోలు పలికినట్టయింది.  ఓవైపు గాయాలు వెంటాడినా.. మరోవైపు ఫామ్‌లేమితో ఇబ్బందిపడినా.. బిడ్డకు జన్మనిచ్చే క్రమంలో  చావు అంచుల వరకు వెళ్లొచ్చినా.. ఆటపై  ప్రేమతో పడి లేచిన కెరటంలా మళ్లీ రాకెట్‌ పట్టి ప్రత్యర్థులను గడగడలాడించింది..! అయితే మార్గరెట్‌ కోర్టు 24 గ్రాండ్‌స్లామ్స్‌ రికార్డు అందుకోవాలన్న తన కల నెరవేరవేర్చుకోలేకపోవడం ఒక్కటే ఆమె కెరీర్​లో లోటు!!

న్యూయార్క్‌‌‌‌:టెన్నిస్‌‌లో ఓ శకం ముగిసినట్టే. పాతకాలపు ఆటకు కొత్త హంగులు అద్దుతూ.. తన రాకెట్‌‌ పవర్‌‌ చూపెట్టిన అమెరికా లెజెండ్‌‌ ప్లేయర్‌‌ సెరెనా విలియమ్స్‌‌ ఆట ముగిసింది. యూఎస్‌‌ ఓపెన్‌‌లో భాగంగా శుక్రవారం రాత్రి జరిగిన మహిళల సింగిల్స్‌‌ థర్డ్‌‌ రౌండ్‌‌లో సెరెనా 5–7, 7–6 (7/4), 1–6తో అజ్లా టొమల్జినోవిచ్‌‌ (ఆస్ట్రేలియా) చేతిలో ఓడింది. పావు శతాబ్దం పాటు టెన్నిస్‌‌ ప్రేమికులను అలరించిన సెరెనా ఆఖరాటలో మాత్రం తన పూర్తి సత్తా ఏంటో చూపెట్టలేకపోయింది. మ్యాచ్​ ముగిసిన తర్వాత భావ్వోద్వేగాలను ఆపుకుంటూ.. కన్నీళ్లను తూడుచుకుంటూ.. రిటైర్మెంట్​నిర్ణయంపై పునరాలోచన చేయనని చెప్పింది. కానీ, ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు? అంటూ ట్విస్ట్​ ఇచ్చిన సెరెనా ఓ గంభీరమైన వాతావరణంలో, కిక్కిరిసిపోయిన అభిమానుల చప్పట్ల నడుమ ఆర్థర్‌‌ యాషే స్టేడియం నుంచి నిష్క్రమించింది. 

అభిమాని చేతిలోనే..
చిన్నప్పట్నించి టీవీలో తన ఆటను చూస్తూ పెరిగిన టొమల్జినోవిచ్‌‌ చేతిలోనే సెరెనా ఓడటం మరో విశేషం. 3 గంటలా 5 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌‌లో అమెరికా స్టార్‌‌ ఐదు మ్యాచ్‌‌ పాయింట్లను కాచుకుని గట్టిగా పోరాడింది. కానీ చివరి వరకు అదే ఆధిపత్యాన్ని చూపెట్టలేక డిసైడర్‌‌లో చేతులెత్తేసింది. తొలి సెట్‌‌ స్టార్టింగ్‌‌లో పదునైన సర్వీస్‌‌లు, బలమైన ఫోర్‌‌హ్యాండ్‌‌ షాట్లతో ఆధిక్యంలోకి వచ్చినా.. చివర్లో రిటర్న్‌‌ సర్వీస్‌‌ల్లో తడబడింది. అప్పటికే 0–1తో వెనుకబడటంతో రెండోసెట్‌‌ భిన్నంగా ఆడింది. క్రాస్‌‌ కోర్టు షాట్స్‌‌తో టొమల్జినోవిచ్‌‌ను అలసిపోయేలా చేసి 4–0 లీడ్‌‌లోకి వెళ్లింది. అయినప్పటికీ టైబ్రేక్‌‌లో సెట్‌‌ను చేజిక్కించుకుంది. నిర్ణయాత్మక మూడో సెట్‌‌లో మాత్రం అమెరికా ప్లేయర్‌‌ ఏమాత్రం పోటీ ఇవ్వలేదు. కేవలం రెండో గేమ్‌‌లోనే సర్వీస్‌‌ను నిలబెట్టుకుంది. మిగతా గేమ్స్‌‌లో ఆసీస్‌‌ ప్లేయర్‌‌ 
ధాటిని తట్టుకోలేకపోయింది. మ్యాచ్‌‌ మొత్తంలో 11 ఏస్‌‌లు కొట్టిన సెరెనా 7 డబుల్‌‌ ఫాల్ట్స్‌‌, 51 తప్పిదాలతో మూల్యం చెల్లించుకుంది. 

ఆరంభం, అంతం మూడో రౌండ్​తోనే..
1998లో 16 ఏళ్ల వయసులో యూఎస్‌‌ ఓపెన్‌‌లో డెబ్యూ చేసిన సెరెనా మూడో రౌండ్‌‌లోనే ఇంటిముఖం పట్టింది. ఆ తర్వాత అదే గ్రౌండ్‌‌లో 1999లో తొలి గ్రాండ్‌‌స్లామ్‌‌ను ముద్దాడింది. అప్పట్నించి 19సార్లు థర్డ్‌‌ రౌండ్‌‌లో ఆడితే అన్నిసార్లు గెలిచింది. 11సార్లు సెమీస్‌‌కు చేరి రికార్డు కూడా సృష్టించింది. కానీ ఆఖరాటలోనూ మూడో రౌండ్‌‌ దాటలేకపోయింది. దీంతో ఆరంభానికి, అంతానికి మూడో రౌండ్‌‌ ఓటమితోనే ముగింపు పలికింది.  

23తోనే సరి!
ఈ నెల 26తో 41వ పడిలోకి అడుగుపెడుతున్న సెరెనా.. కెరీర్‌‌లో 23 సింగిల్స్‌‌ గ్రాండ్‌‌స్లామ్స్‌‌ను నెగ్గింది. ఇందులో ఆస్ట్రేలియన్‌‌ ఓపెన్‌‌ (7), ఫ్రెంచ్‌‌ ఓపెన్‌‌ (3), వింబుల్డన్‌‌ (7), యూఎస్‌‌ ఓపెన్‌‌ (6) ఉన్నాయి. తన అక్క వీనస్‌‌ విలియమ్స్‌‌తో కలిసి 14 డబుల్స్‌‌ టైటిల్స్‌‌ను సాధించింది. మొత్తం కలిపి 39 టైటిల్స్‌‌ తన ఖాతాలో ఉన్నాయి. గర్భవతిగా 2017లో ఆస్ట్రేలియన్‌‌ ఓపెన్‌‌లో ఆడిన సెరెనా చివరిసారిగా 23వ గ్రాండ్‌‌స్లామ్‌‌ గెలిచి స్టెఫీ గ్రాఫ్‌‌ను అధిగమించింది. అదే ఏడాది సెప్టెంబర్‌‌ 1న కూతురు ఒలింపియాకు జన్మనిచ్చింది. తర్వాత తీవ్రమైన అనారోగ్యంతో ఆటకు దూరమైంది. 2018 ఫ్రెంచ్‌‌ ఓపెన్‌‌తో మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చిన సెరెనా.. మార్గరెట్‌‌ కోర్టు రికార్డు (24)ను టార్గెట్‌‌గా పెట్టుకుంది. అదే ఏడాది వింబుల్డన్‌‌, యూఎస్‌‌ ఓపెన్‌‌లో ఫైనల్స్‌‌కు చేరినా రన్నరప్‌‌గానే నిలిచింది. 2019లోనూ సేమ్‌‌ సీన్‌‌ రిపీట్‌‌ కావడంతో మార్గరెట్‌‌ రికార్డును సమం చేయలేకపోయింది. 2021 వింబుల్డన్‌‌ ఫస్ట్‌‌ రౌండ్‌‌లో గాయపడిన సెరెనా ఏడాది పాటు ఆటకు దూరమైంది. ఈ ఏడాది జూన్‌‌లో జరిగిన వింబుల్డన్‌‌లో మళ్లీ రాకెట్‌‌ పట్టిన అమెరికన్‌‌.. కెరీర్‌‌ను ముగిస్తున్నట్లు సంకేతాలిచ్చింది. రిటైర్మెంట్‌‌ అనే పదం వాడకుండా యూఎస్‌‌ ఓపెన్‌‌ ఫేర్‌‌వెల్‌‌ టోర్నీ అని ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచింది. అనుకున్నట్లుగా తొలి రెండు రౌండ్లలో సూపర్‌‌ షో చూపెట్టినా.. థర్డ్‌‌ రౌండ్‌‌లో గట్టెక్కలేకపోయింది. ప్రస్తుతానికి ఆటకు సెండాఫ్‌‌ చెప్పిన సెరెనా సెకండ్‌‌ ఇన్నింగ్స్‌‌లో ఓ తల్లిగా, వ్యాపారవేత్తగా రాణించే దిశగా ఉజ్వల భవిష్యత్‌‌ వైపు అడుగులు వేస్తోంది. 

అక్క వీనస్‌ లేకపోతే నేను లేను. టెన్నిస్‌లో నేను ఉన్నత శిఖరా లకు చేరడంలో నా సోదరి కృషి ఎంతో ఉంది. అందు కే వీనస్‌కు ధన్యవాదాలు చెబుతున్నా. నా తల్లిదండ్రు లు కూడా చాలా ప్రోత్స హించారు. ప్రతి దానికి వారు అర్హులే. అందరికి కృతజ్ఞతలు చెబుతున్నా. నా కళ్లలో వచ్చే నీళ్లు ఆనంద భాష్పాలు అనుకుంటున్నా. నేనెప్పుడూ ఓటమిని ఈజీగా అంగీకరించలేదు. పడిన ప్రతిసారి రెట్టింపు ఉత్సాహంతో పైకి లేచా. నా కెరీర్‌ మొత్తం ఇలాగే సాగింది. ఇప్పటికీ నాలో సత్తా ఉందనే అనుకుంటున్నా. అయితే నేను భిన్నమైన రంగాల్లో రాణించేందుకు ప్రయత్నించాలనుకుంటున్నా. 
‑ సెరెనా