వరుస చైన్ స్నాచింగ్​ల కేసులో ఆరుగురు అరెస్ట్

వరుస చైన్ స్నాచింగ్​ల కేసులో ఆరుగురు అరెస్ట్

హైదరాబాద్‌‌, వెలుగు: వనస్థలిపురం, మల్కాజిగిరి, జవహర్‌‌‌‌నగర్‌‌‌‌లో బుధవారం రాత్రి జరిగిన వరుస చైన్​స్నాచింగ్​ల కేసుల్లో ఆరుగురిని రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి గోల్డ్‌‌చైన్స్, స్నాచింగ్‌‌కు వాడిన బైక్స్, సెల్‌‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. రాచకొండ సీపీ డీఎస్‌‌ చౌహాన్‌‌ వివరాలు వెల్లడించారు. 

బుధవారం రాత్రి 7 గంటలకు..

మల్కాజిగిరి పరిధి మీర్జాలగూడలో ఉండే ఎలిజబెత్‌‌ జోసెఫ్‌‌(69) అనే మహిళ ఇంటికి బుధవారం రాత్రి 7 గంటలకు వచ్చిన చైన్ స్నాచర్లు.. ఇల్లు రెంట్​కు కావాలని అడిగారు. ఆమె మాటల్లో పెట్టి10 గ్రాముల గోల్డ్‌‌ చైన్​ను లాక్కెళ్లారు. బాధితురాలి కంప్లయింట్​తో మల్కాజిగిరి పోలీసులు దర్యాప్తు చేపట్టి మహబూబ్‌‌నగర్‌‌‌‌ జిల్లా చొక్కంపేటకు చెందిన వలిజి దినేష్‌‌(20)తో పాటు మరో మైనర్‌‌‌‌ను అరెస్ట్ చేశారు.  

రాత్రి 8 గంటలకు..

శామీర్‌‌‌‌పేట్‌‌ పీఎస్‌‌ పరిధిలో అదే రోజు రాత్రి 8 గంటలకు మరో దోపిడీ జరిగింది. లోతుకుంటలోని బిర్యానీ మాల్‌‌లో పనిచేస్తున్న అలకుంట్ల కవిత(30)ను హకీంపేటకు చెందిన అనూప్‌‌సింగ్‌‌(32), ప్రకాష్‌‌ చంద్ మీనా(31) ఓ ఫంక్షన్‌‌లో వంట చేయాలని చెప్పి పిలిచారు. అనంతరం బిట్స్‌‌ కాలేజీ సమీపంలో ఆమెపై దాడి చేశారు. మెడలో ఉన్న పుస్తెలతాడుతో పాటు బ్యాగ్​లోని రూ.3 వేల క్యాష్, మొబైల్‌‌ ఫోన్ దోపిడీ చేశారు. జవహర్‌‌‌‌నగర్ పోలీసులు కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేశారు. సీసీ ఫుటేజ్‌‌, బైక్ నంబర్ ఆధారంగా ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. పుస్తెల తాడు, సెల్‌‌ఫోన్‌‌, రూ. వెయ్యి స్వాధీనం చేసుకున్నారు.

రాత్రి 9 గంటలకు..

నల్గొండ జిల్లా చింతపల్లి మండలం పీకే పల్లికి చెందిన పంగా రాజేశ్వరి(29) సిటీకి వచ్చి వనస్థలిపురంలోని జక్కిడి రామిరెడ్డి కాలనీలో ఉంటోంది. రొట్టెలు తయారు చేసి అమ్ముతోంది. బుధవారం రాత్రి 9 గంటలకు రాజేశ్వరి రొట్టెలు అమ్ముతుండగా ఇద్దరు చైన్​స్నాచర్లు ఆమె దగ్గరికి వచ్చి పుస్తెలతాడు లాక్కుని పారిపోయారు. వనస్థలిపురం పోలీసులు కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేపట్టారు.  ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు.