- చోరీ విషయాన్ని గోప్యంగా ఉంచిన అధికారులు
- ఇంటి దొంగల పాత్రపై అనుమానాలు
మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల జిల్లా జైపూర్ సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ (ఎస్టీపీపీ)లో వరుస చోరీలు కలకలం రేపుతున్నాయి. గతంలో పలుమార్లు లక్షల విలువైన ఐరన్, ఇతర సామగ్రి చోరీ కాగా తాజాగా రూ.20 లక్షల విలువైన ఫ్లోటింగ్ సోలార్ కాపర్ పట్టీలు మాయం కావడం చర్చనీయాంశంగా మారింది. ఎస్టీపీపీ చుట్టూ పటిష్టమైన కాంపౌండ్, దానిపైన ఫెన్సింగ్, చుట్టూ సీసీ కెమెరాల నిఘా, 24 గంటల పాటు సీఐఎస్ఎఫ్ సిబ్బంది కాపలా ఉంటారు.
దీంతో బయటి వ్యక్తులు కాంపౌండ్ దాటి లోపలికి వెళ్లే చాన్స్ ఉండదు. మెయిన్ గేట్ వద్ద నుంచి ఎంట్రీ పాస్ లేకుండా ఎవరినీ ప్లాంట్ లోకి అనుమతించరు. ఇంత పకడ్బందీ సెక్యూరిటీ సిస్టం ఉన్నప్పటికీ ప్లాంట్ లోపల ఉన్న విలువైన సామగ్రి మాయం కావడం పలు అనుమానాలకు తావిస్తోంది.
రూ.20 లక్షల ఫ్లోటింగ్ సోలార్ కాఫర్ పట్టీలు మాయం..
ఎస్టీపీపీలో నెలరోజుల కింద భారీ చోరీ జరిగింది. దాదాపు రూ.20 లక్షల విలువైన ఫ్లోటింగ్ సోలార్ కాపర్ పట్టీలు మాయమయ్యాయి. చోరి జరిగిన విషయాన్ని ఎస్టీపీపీ అధికారులు గోప్యంగా ఉంచడంతో ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎస్టీపీపీలో 10 మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే ఐదు మెగావాట్ల ప్లాంట్ పనులు పూర్తయ్యాయి. మరో ఐదు మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్ పనులు జరుగుతున్నాయి.
దీనికోసం సంబంధిత కాంట్రాక్టర్ ఆ ప్రాంతంలో సామగ్రిని ఉంచాడు. ఈ క్రమంలో అక్కడ ఉన్న కాపర్ పట్టీలు చోరి అయినట్లు తెలిసింది. వీటి విలువ రూ.20 లక్షలకు పైగా ఉంటుందని చర్చ జరుగుతోంది. ఈ విషయం తెలిసిన అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేసి సైలెంట్ గా ఉండడంతో వారి తీరుపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఇంటి దొంగలపై అనుమానాలు..
ఎస్టీపీపీ చుట్టూ పకడ్బందీ సెక్యూరిటీ ఉన్నప్పటికీ తరచూ చోరీలు జరుగుతుండడం అంతుచిక్కడం లేదు. ఇందులో ఇంటి దొంగల పాత్ర ఉండవచ్చనే అనుమానాలు బలపడుతున్నాయి. ప్లాంట్ లోని ఇంజినీర్లు, ఉద్యోగులు అక్రమార్కులతో జతకట్టి మెటీరియల్ చోరీకి సహకరిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఇంతకుముందు ఎస్టీపీపీ ఎఫ్ జీడీ ప్లాంట్ నిర్మించే ప్రాంతంలో చోరీ జరిగి విలువైన ఐరన్ సామగ్రి దొంగతనం జరిగింది. అది కూడా ఫిర్యాదుతో సరిపెట్టుకున్నారు తప్ప ఆ దొంగలను ఇప్పటికీ పట్టుకోలేదు. గతంలో ఎస్టీపీపీ ఆపరేషన్స్ విభాగం పరిధిలోని స్టోర్ లో ఐరన్ సామగ్రి చోరి జరిగింది. కొంతమంది ఉన్నతాధికారులు తప్పించుకోవడానికి కిరీటి అనే ఉద్యోగిని బాధ్యుడిని చేశారు. దీంతో అతడు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
చోరీ జరిగింది నిజమే..
తాజాగా జరిగిన కాపర్ చోరీ విషయంపై ఎస్టీపీపీ ఎస్ అండ్ పీసీ అధికారిని వివరణ కోరగా.. ఫ్లోటింగ్ సోలార్ నిర్మాణం ప్రాంతంలో చోరీ జరిగిన విషయం వాస్తవమేనని తెలిపారు. కాపర్ పట్టీలు చోరీకి గురయ్యాయని, కానీ అది ఎప్పుడు జరిగిందో క్లారిటీ లేదన్నారు. అధికారులు పోలీసులకు కంప్లయింట్ చేశారని చెప్పారు. డీజీఎం పర్సనల్ వివరణ కోసం ఫోన్ లో సంప్రదించగా ఆయన అందుబాటులోకి రాలేదు.
