- నచ్చిన డిపోలకు ఫోకల్.. నచ్చని వారికి నాన్-ఫోకల్..
- ఏడేళ్లు ఖాళీగా ఉన్న వివాదాస్పదుడికి ఫోకల్ పోస్టు ఇచ్చేలా ప్లాన్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్‌లో బదిలీల ప్రక్రియ తీవ్ర వివాదాలకు దారితీస్తోంది.15 ఏళ్లుగా ఒకే చోట పాతుకుపోయిన కొందరు ఉద్యోగులను కదపకుండా, కింది స్థాయి క్యాడర్ల వారికే ఈ బదిలీలను వర్తింపజేయడం వెనుక పెద్ద మతలబు ఉందనే ఆరోపణలున్నాయి. పరిపాలనాపరమైన బదిలీల పేరిట కొంతమందిని లక్ష్యంగా చేసుకుని వేధిస్తుండగా, మరికొందరిని యథేచ్ఛగా పాత స్థానాల్లోనే కొనసాగిస్తున్నారు
ఈ ప్రక్రియలో సీనియారిటీ నిబంధనలను తుంగలో తొక్కి హౌసింగ్ విభాగం నుంచి డెప్యుటేషన్‌పై వచ్చిన వారికి అనవసర ప్రాధాన్యతనిచ్చారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అదే సమయంలో ఇటీవల పరిపాలన అవసరాల కోసం బదిలీపై వెళ్లిన వాళ్లకు ఈ ట్రాన్స్ఫర్స్లో అవకాశం కల్పించలేదు. నిబంధనల ప్రకారం బదిలీలకు అర్హులైన అసిస్టెంట్ స్టోర్స్ ఆఫీసర్స్ గ్రేడ్-2 ఉద్యోగులు 66 మంది ఉండగా, 49 పోస్టులకు అవకాశం కల్పించడం వెనుక ఉన్న ఆంతర్యం ఏంటని బాధితులు ప్రశ్నిస్తున్నారు.
బేవరేజెస్ డిపోల వర్గీకరణలోనూ అక్రమాలు జరిగాయని, తమకు నచ్చిన డిపోలను అత్యంత అనుకూలమైనవిగా (ఫోకల్), మిగిలిన వాటిని నాన్-ఫోకల్‌గా మార్చుకుంటూ నిబంధనలను మార్చేశారనే వాదనలు వినిపిస్తున్నాయి. దీంతో నిబద్ధతతో పనిచేసే అసిస్టెంట్ మేనేజర్లు, స్టోర్స్ అధికారులు, గ్రేడ్-1, గ్రేడ్-2 అధికారులు తీవ్రంగా నష్టపోతున్నారు.
కొందరికి సంఘాల లీడర్లకు పోస్టు లేకున్నా సంఘం పదవి పేరుతో హెడ్‌ఆఫీస్‌కు బదిలీ చేసేలా ప్లాన్ చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఏడేళ్లుగా ఎలాంటి పోస్టింగ్ లేకుండా ఖాళీగా ఉన్న ఓ వివాదాస్పద వ్యక్తికి ఇప్పుడు అత్యున్నత పోస్టు కట్టబెట్టడం చర్చనీయాంశమైంది. ఆడిట్ పనులను పెండింగ్‌లో పెట్టి, అక్రమాలకు పాల్పడినప్పటికీ సదరు అధికారిపై చర్యలు తీసుకోకపోవడం, పైగా సీఎం అండదండలు ఉన్నాయంటూ ప్రచారం చేసుకోవడం ఉద్యోగ వర్గాల్లో కలకలం రేపుతోంది.
