హైదరాబాద్, వెలుగు: జీహెచ్‌ఎంసీ చట్టంలోని సెక్షన్ 462ఎ ప్రకారం 'మున్సిపల్ బిల్డింగ్ ట్రైబ్యునల్'ను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది. విచారణను ఏప్రిల్ 15కు వాయిదా వేసింది. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఉప్పల్ మండలం కొత్తపేటలో రాధేశ్యాం కన్‌స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్‌కు ఇచ్చిన భవన నిర్మాణ అనుమతులను రద్దు చేయాలంటూ జె.శ్రీనివాస్ యాదవ్, మరొకరు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
దీన్ని గతంలో సింగిల్ జడ్జి కొట్టివేయడంతో హైకోర్టులో అప్పీల్ పిటిషన్ వేశారు. దీన్ని సీజే అపరేశ్ కుమార్ సింగ్, జస్టిస్ మొహియుద్దీన్‌లతో కూడిన ధర్మాసనం గురువారం విచారించింది. బిల్డింగ్ ట్రైబ్యునల్ ఏర్పాటుకు ఏమైనా అవకాశం ఉంటే ప్రభుత్వానికి సలహా ఇవ్వాలని అడ్వొకేట్ జనరల్ ఎ.సుదర్శన్‌రెడ్డికి సూచించింది. 2017 జనవరిలో తీసుకువచ్చిన చట్టం ప్రకారం.. బిల్డింగ్ ట్రైబ్యునల్ ఏర్పాటు చేయకపోవడంతో కక్షిదారులు నేరుగా కోర్టును ఆశ్రయిస్తున్నారని తెలిపింది. ఈ ప్రాజెక్టు అనుమతుల రికార్డులను సమర్పించాలని జీహెచ్‌ఎంసీని ఆదేశించింది.
