
న్యూఢిల్లీ: దేశ అవినీతి నిరోధక అంబుడ్స్‌మన్ అయిన లోక్‌పాల్.. తన సభ్యుల కోసం ఏడు హై-ఎండ్ బీఎండబ్ల్యూ లగ్జరీ కార్ల కొనుగోలుకు ప్రముఖ ఏజెన్సీల నుంచి ఓపెన్ టెండర్లు ఆహ్వానించింది. ఈ నెల 16న టెండర్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ కార్లు లోక్‌పాల్ చైర్మన్, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి అజయ్ మాణిక్ రావ్ ఖాన్విల్కర్‌తో సహా ఆరుగురు సభ్యుల కోసమని తెలుస్తోంది.
ఒక్కో కారు ధర సుమారు రూ.60 లక్షల నుంచి -రూ.70 లక్షలు ఉండగా.. మొత్తం ఏడు కార్ల ధర దాదాపు రూ.5 కోట్లు అవుతుంది. ఈ నిర్ణయంపై సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. అవినీతి నిరోధక సంస్థే విలాసవంతమైన విదేశీ కార్లు కొనుగోలు చేయడం హాస్యాస్పదమని నెటిజన్లు మండిపడుతున్నారు. ప్రముఖ అడ్వకేట్, సామాజిక కార్యకర్త ప్రశాంత్ భూషణ్ ఈ నిర్ణయాన్ని తీవ్రంగా ఖండించారు.
‘‘మోదీ ప్రభుత్వం లోక్‌పాల్ లో స్వయం సేవకులను సభ్యులుగా నియమించింది. వారు ఇప్పుడు తమ కోసం రూ.70 లక్షల బీఎండబ్ల్యూ కార్లు కొనుగోలు చేస్తున్నారు" అని ఆయన ఎక్స్ లో పోస్ట్ చేశారు. ఏఐసీసీ అధికార ప్రతినిధి షామా మొహమ్మద్ మాట్లాడుతూ.. ‘‘లోక్‌పాల్ కేవలం కాగితాలపైనే ఉంది. అవినీతి అధికారులతో నిండిపోయింది’’ అని ఆరోపించారు.