హైదరాబాద్ మహా నగరంలో ఈ వర్షాకాల సీజన్ పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్క వర్షానికే తెలిసి వచ్చింది. తెల్లవారుజామున నగరంలో కురిసిన భారీ వర్షానికి ఓల్డ్ సిటీలో కొన్ని ప్రాంతాల్లో వరద ఎఫెక్ట్ కనిపించింది. తొలకరి వర్షంతో సిటీలో సీన్ ఒక్కసారిగా మారిపోయింది. పాతబస్తీ పరిధిలోని ఛత్రినాక, శివగంగా నగర్, శివాజీనగర్ లో వరద నీరు రోడ్లపై పారుతోంది. ఈ ప్రాంతాల పరిధిలోని నాలా పొంగి పొర్లడంతో వీధులు చెరువులను తలపించాయి. లోతట్టు ప్రాంతాల ఇండ్లు నీట మునిగడంతో జనం బయటకు వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. సిటీలో ఇప్పటికే కొన్ని చోట్ల స్ట్రాటజిక్ నాలా పనులు మొదలయ్యాయి. అయితే ఇందులో కొన్ని పూర్తవగా, కొన్ని మధ్యలో ఉన్నాయి. కీలక ప్రాంతాల్లో పనులు పూర్తయితే నాలాలు పొంగడం సమస్య నుంచి బయటపడే అవకాశం ఉంది. కానీ ఇప్పటికే వర్షాకాలం సీజన్ మొదలవడంతో ఈ ఏడాది కూడా నగరానికి వాన కష్టాలు తప్పేలా లేవంటున్నారు జనాలు.
