హైదరాబాద్, వెలుగు: డైలీ ఎక్కడో ఒకచోట సీవరేజ్, మంచినీటి సమస్యలు తలెత్తుతూనే ఉన్నాయి. నాలుగైదు రోజులుగా నీళ్లు రావట్లేదని కొందరు, లో ప్రెషర్ సమస్య ఉందని మరికొందరు రోజూ వాటర్‌బోర్డుకు ఫిర్యాదులు చేస్తూనే ఉన్నారు. కొన్నిచోట్ల వాటర్ పైప్లైన్లు లీక్అవుతున్నాయని, మ్యాన్‌హోల్స్ పొంగిపొర్లుతున్నాయని ఫిర్యాదులు వస్తూనే ఉన్నాయి. రోజులో వాటర్‌బోర్డుకు 200కు పైగా ఫిర్యాదులు అందుతున్నాయంటే గ్రేటర్‌సిటీలో పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. మాసబ్ ట్యాంక్, లక్డీకాపూల్, నానల్‌నగర్, టోలీచౌకి, బంజారాహిల్స్, బాలానగర్, జూబ్లీహిల్స్, అల్వాల్, షేక్‌పేట, లంగర్ హౌస్, చాంద్రాయణగుట్ట, భోలక్ పూర్ తదితర ప్రాంతాల నుంచి వాటర్ బోర్డు ట్విట్టర్, గ్రీవెన్స్‌సెల్ కి ఎక్కువ ఫిర్యాదులు వస్తున్నాయి. వందల్లో ఫిర్యాదులు వస్తున్నా అధికారులు శాశ్వత పరిష్కారం చూపడం లేదు. ఇటీవల లంగర్ హౌస్‌లో డ్రైనేజీ సమస్య పరిష్కరించకపోవడంతో స్థానికులు మంత్రి కేటీఆర్‌ని నేరుగా కలిసి పరిస్థితిని వివరించారు.
టైమ్‌కి రాక ఇబ్బందులు
ఓ వైపు క్రమంగా ఎండలు పెరుగుతున్నా వాటర్సప్లైపై బోర్డు దృష్టి పెట్టడంలేదు. నగరంలో వందలాది కాలనీల్లో నీటి సరఫరా అరకొరగా జరుగుతున్నట్లు ఫిర్యాదులు అందుతున్నాయి. కొన్ని కాలనీల్లో రోజుల తరబడి సరఫరా కావడం లేదని తెలుస్తోంది. సప్లై అవుతున్న ప్రాంతాల్లో టైమ్ కు రాకపోవడంతో ఆఫీసులకు వెళ్లే వారు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదు. సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తే వాటిని కిందిస్థాయి సిబ్బందికి ట్రాన్స్ఫర్ చేసి వదిలేస్తున్నారనే ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి. సమ్మర్‌కు ముందే చేపట్టాల్సిన రిపేర్లను ఇప్పటివరకు పట్టించుకోకపోవడంతో ఆయా ప్రాంతాల్లో నీటి సమస్యలు ఏర్పడుతున్నాయి.
ఎప్పుడూ ఇదే పరిస్థితి
కొన్ని ప్రాంతాల్లో మొయిన్ రోడ్లు మొదలు కాలనీల వరకు నిత్యం డ్రైనేజీలు పొంగిపొర్లుతూనే ఉన్నాయి. ఆ ప్రాంతంలో వెళ్లేవారు దుర్వాసనతో ఇబ్బంది పడుతున్నారు. మెయింటెనెన్స్సరిగా లేకపోవడంతోనే సమస్య ఏర్పడుతోంది. వర్షాకాలంలోనే కాదు సమ్మర్లో కూడా ఇదే సమస్య ఉంటోందని జనం మండిపడుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో వారం, పది రోజులైనా సమస్యను పరిష్కరించడంలేదు.
నిర్వహణ లోపం
వాటర్‌బోర్డు డ్రైనేజీ పైపులైన్ల రిపేర్లు, మెయింటెనెన్స్పేరుతో నెలనెలా కోట్లు ఖర్చు చేస్తున్నప్పటికీ సమస్య తీరడంలేదు. వర్షాకాలంలో వర్షపు నీటితో మ్యాన్‌హోల్స్ జామ్అయ్యి తరచూ పొంగడం సాధారణం. కానీ సమ్మర్‌లోనూ చాలా ప్రాంతాల్లో ఈ పరిస్థితులే కనిపిస్తున్నాయి. పెరుగుతున్న జనాభాకు, వినియోగానికి అనుగుణంగా సిటీలో డ్రైనేజీ సిస్టం లేకపోవడంతోనే మురుగు సమస్య తలెత్తుతోందని నిపుణులు చెబుతున్నారు.
‘‘వెంకటాపురం సెక్షన్‌లోని పలు కాలనీల్లో 10 రోజులుగా నల్లా నీళ్లు రావడం లేదని సామెల్ అనే సిటిజన్ వాటర్‌బోర్డుకు రెండు రోజుల క్రితం ఫిర్యాదు చేశాడు. తరచూ ఇదే సమస్య ఉంటోందని, అధికారులు పట్టించుకోవాలని కోరాడు. సుచిత్ర నుంచి అల్వాల్ వెళ్లే రోడ్డుపై మూడు నెలలుగా మురుగునీరు ప్రవహిస్తోందని సంజీవ్ అనే సిటిజన్ రెండ్రోజుల క్రితం వాటర్‌బోర్డుకు ట్విట్టర్ ద్వారా ఫిర్యాదు చేశాడు. మురుగు నీరు రోడ్డెక్కడంతో చెరువును తలపిస్తోందని, ఎవరూ పట్టించుకోవడంలేదని పేర్కొన్నాడు. స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని చెప్పాడు.’’
తమ ఏరియాలో నీళ్లు లోప్రెషర్‌తో వస్తన్నాయని కింగ్ కోఠికి చెందిన మహ్మద్ దౌల్తా ఇప్పటికే పలుమార్లు ఫిర్యాదు చేశాడు. అధికారులు స్పందించలేదు. దీంతో గతేడాది సెప్టెంబర్‌లో ఫిర్యాదు చేసిన టోకెన్ నం. 5218, డిసెంబర్ 15న ఫిర్యాదు చేసిన టోకెన్ నం. 9954, ఈ ఏడాది జనవరి 25న మరోసారి ఫిర్యాదు చేయగా ఇచ్చిన టోకెన్ నం. 2174తో నారాయణగూడ వాటర్‌బోర్డు జనరల్ మేనేజర్‌కు లెటర్ రాశాడు.
