సెంట్రల్ వర్సిటీ ఎన్నికల్లో .. ఎస్ఎఫ్ఐ కూటమి జయకేతనం

సెంట్రల్ వర్సిటీ ఎన్నికల్లో  .. ఎస్ఎఫ్ఐ కూటమి జయకేతనం
  • హెచ్​సీయూ స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్​గా అతీఖ్ అహ్మద్

హైదరాబాద్, వెలుగు:  గచ్చిబౌలిలోని హెచ్ సీయూ (హైదరాబాద్​సెంట్రల్ యూనివర్సిటీ) స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్​గా ఎస్ఎఫ్ఐ అభ్యర్థి అతీఖ్ అహ్మద్ విజయం సాధించారు. మిగిలిన అన్ని పోస్టుల్లోనూ ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఏ, టీఎస్ఎఫ్ కూటమి జయకేతనం ఎగరవేసింది.  2023–24 విద్యాసంవత్సరానికి  స్టూడెంట్ యూనియన్ ఎన్నికలు గురువారం జరిగాయి. దీంట్లో ఎస్ఎఫ్ఐ, ఏబీవీపీ, ఏఐఓబీసీఎస్ఏ, ఎన్ఎస్ యూఐ నేతృత్వంలోని కూటములు పోటీ చేశాయి. మొత్తం 5,300కు పైగా ఓట్లు ఉండగా, దీంట్లో 80% పోలయ్యాయి. కాగా, వర్సిటీ అధికారులు శుక్రవారం సాయంత్రం కౌంటింగ్ నిర్వహించారు. ఎన్నికల్లో ఎస్ఎఫ్ఐ, ఏబీవీపీ కూటముల మధ్య పోటీ నెలకొనగా, అన్ని పోస్టులనూ ఎస్ఎఫ్ఐ ప్యానెల్ సొంతం చేసుకుంది. 

ప్రెసిడెంట్​గా సంగారెడ్డి జిల్లాకు చెందిన పీహెచ్​డీ స్కాలర్​ అతీఖ్ అహ్మద్ ఏబీవీపీ అభ్యర్థి షేక్ అయేషాపై 471ఓట్లతో ఘన విజయం సాధించారు. వైస్​ ప్రెసిడెంట్​గా జల్లి ఆకాశ్​, జనరల్ సెక్రటరీగా దీపక్ కుమార్ ఆర్య, జాయింట్ సెక్రటరీగా ఎల్​.బాల ఆంజనేయులు, కల్చరల్ సెక్రటరీగా షమీం అక్తర్ షేక్, స్పోర్ట్స్ సెక్రటరీగా అతుల్ వారి సమీప ఏబీవీపీ అభ్యర్థులపై గెలుపొందారు.  ఎస్ఎఫ్ఐ కూటమి అభ్యర్థులు జీఎస్​ క్యాష్(ఇంటిగ్రేటెడ్) నందన పన్నికిల్, జీఎస్ క్యాష్ (పీజీ) పూజ, జీఎస్ క్యాష్ (రీసెర్చ్) సౌమ్య విజయం సాధించారు. ఎస్ఎఫ్​ఐ, ఏఎస్​ఏ, టీఎస్ఎఫ్ కూటమి గెలుపొందడంతో  వర్సిటీలో భారీ విజయోత్సవ ర్యాలీ తీశారు. వర్సిటీలో గెలుపుపై  ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ​మూర్తి, నాగరాజు హర్షం వ్యక్తం చేశారు.