ఇంటర్ బోర్డు ముందు విద్యార్థి సంఘాల ఆందోళన

ఇంటర్ బోర్డు ముందు విద్యార్థి సంఘాల ఆందోళన

నాంపల్లిలోని ఇంటర్ బోర్డు ముందు ఎస్ఎఫ్ఐ సభ్యులు ఆందోళన చేపట్టారు. శ్రీ చైతన్య కళాశాల నార్సింగి బ్రాంచ్ లో యాజమాన్యం ఒత్తిడి వల్ల  ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి సాత్విక్ మృతిపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. యాజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని, కళాశాల గుర్తింపు రద్దు చేయాలని కోరారు. సాత్విక్ కుటుంబానికి న్యాయం చేయాలని ఎస్ఎఫ్ఐ సభ్యులు విజ్ఞప్తి చేశారు. అనంతరం ఇంటర్ బోర్డు కార్యాలయం గేటు లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో ఆందోళకారులను అడ్డుకున్న పోలీసులు.... అరెస్ట్ చేసి నాంపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఇదిలా ఉండగా నార్సింగిలోని శ్రీ చైతన్య ఇంటర్ కాలేజ్ ముందు ఏబీవీపీ విద్యార్థులు, ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘం నేతలు ధర్నా చేశారు. ఈ నేపథ్యంలో శ్రీ  చైతన్య కళాశాల కిటికీల అద్దాలను నిరసనకారులు ధ్వంసం చేశారు. అనంతరం ఆందోళన చేస్తున్న వారిని అడ్డుకుని పోలీసులు అరెస్ట్ చేశారు.